విద్యాసంస్థల అధినేతలు… పోటీకి రెడీ

Date:08/10/2018
రాజమండ్రి ముచ్చట్లు:
ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఏర్పడనున్న ఖాళీల భర్తీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రుల, టీచర్ ఎమ్యెల్సీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికలకు ఇప్పటినుంచే ఆశావహులు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల అధినేతలు కొందరు ఇప్పటికే పోటీకి సై అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి దృష్ట్యా స్వతంత్ర అభ్యర్థులుగానే రంగంలోకి దిగి తమ సత్తా చాటాలని వీరు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో వున్న ఓటర్లు ఇప్పుడు తిరిగి నమోదు చేయించుకోవాలిసిన నేపథ్యంలో ఇప్పుడు పోటీకి ఉత్సహం చూపే వారంతా కొత్త ఓటర్ల నమోదు పై దృష్టి సారించారు.
తూర్పు గోదావరి జిల్లాలో గట్టి పట్టున్న మాజీ ఎమ్యెల్సీ, మాజీ ఎమ్యెల్యే ఆదిత్యా విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి ని గోదావరి జిల్లాల్లోని ప్రయివేట్ విద్యా సంస్థలు ఇప్పటికే బలపరుస్తూ ఆయనే తమ అభ్యర్థి అంటూ ప్రకటించాయి. గతంలో టీచర్ ఎమ్యెల్సీగా, ఆ తరువాత తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్యెల్యేగా అనుభవం సాధించిన శేషారెడ్డి ఎన్నికల నిర్వహణ వ్యూహాత్మకంగా చేస్తారని పేరుంది. సొంత నెట్ వర్క్ తో పాటు ఆర్ధిక స్థోమత పుష్కలంగా వున్న శేషా రెడ్డి ని ఢీ కొట్టడం అంత సులువైన వ్యవహారం కాదు. రెండు సార్లు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించిన అనుభవంతో పాటు రెండు జిలాల్లో ఆయనకు బలమైన నెట్ వర్క్ అదనపు బలమని చెప్పాలి.
తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయబోవడం లేదని ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా స్వతంత్రులే తమ గొంతును నిస్పక్షపాతంగా వినిపించగలరని అంటున్నారు శేషా రెడ్డి.రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత టికె విశ్వేశ్వర రెడ్డి ఎమ్యెల్సీ ఎన్నికల బరిలో తానూ దిగుతున్నట్లు ప్రకటించారు. నాలుగుదశాబ్దాలుగా కాంగ్రెస్, వైసిపి వంటి పార్టీల్లో చురుగ్గా వుంటూ అందరి విజయాల్లో పాలుపంచుకున్నానని, ఇక నేరుగా చట్టసభకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రకటించి గోదావరి జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టించారు.
తనకు ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ పరిధిలోని గోదావరి జిల్లాల పరిధిలో వున్న కళాశాలలన్నీ మద్దతని టికె ప్రకటించారు. ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, విద్యా వేత్తగా, వ్యాపారవేత్తగా వున్న టికె కూడా స్వతంత్ర అభ్యర్థిగానే యుద్ధానికి సై అన్నారు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల అధినేతల నడుమ రసవత్తర పోటీ జరగడం ఖాయం అయ్యింది. అయితే ప్రధాన రాజకీయ పక్షాలు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతాయా లేక గెలిచిన వారిని తమ పార్టీలో కలుపుకుంటాయా అన్నది వేచి చూడాలి.
Tags:Heads of Educational Institutions … Ready to Compete

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *