పంచాయితీ ఎన్నికల వేడి

Date:14/04/2018
కరీంనగర్ ముచ్చట్లు:
తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది.. త్వరలోనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటనతో పల్లెల్లో ముందస్తు పంచాయతీ సందడి మొదలైంది. ఈ సారి ఎన్నికలు ప్రత్యక్ష విధానామా.. పరోక్ష విధానమా.. అనేది త్వరలోనే స్పష్టత రానుంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందనే ప్రచారంతో.. పల్లెల్లో రాజకీయం వేడెక్కుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహిస్తారనే ప్రచారంతో పల్లెల్లో తాజాగా గ్రామ పంచాయితీ జోరుగా రాజుకుంటోంది. పాత వాటితో పాటు కొత్తగా ఆవిర్భవించే గ్రామ పంచాయతీలకు కూడా ఒకే సారి ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్త పంచాయతీల ఏర్పాటుతో పాటు పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రకటనతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. పల్లెల్లో పంచాయతీ పోరుకు సమయం సమీపిస్తోంది. పాలక వర్గాల గడువు ముగియనుండటంతో సకాలంలోనే ఎన్నికల్ని నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. దీంతో కరీంనగర్‌ జిల్లాలోని గ్రామపంచాయతీల వారీగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చకచకా చేపడుతోంది.  జిల్లా ఆవిర్భావంతో 16 మండలాలకు పరిమితమైంది. 276 గ్రామపంచాయతీలున్న జిల్లాలో కొత్తగా  53 నూతన పంచాయతీలకు ఇటీవల పంచాయత్‌రాజ్‌ చట్టం బిల్లులో ఆమోదముద్ర పడింది. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య పెరిగింది.  మేజర్‌ పంచాయతీలుగా ఉన్న జమ్మికుంట, హుజురాబాద్‌లు పురపాలికలుగా హోదాను అందుకున్నాయి. వీటి పరిధిలో మరో ఆరు గ్రామపంచాయతీలు విలీనమవబోతున్నాయి. ఇవేకాకుండా కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి  పలు గ్రామలు కలవనుండటంతో జిల్లా మొత్తంగా 16 గ్రామాలు పంచాయతీ హోదాకు దూరమవుతున్నాయి. దీంతో 276 గ్రామపంచాయతీలుగా ఉన్న జిల్లాలో  వీటి సంఖ్య 260కి చేరింది.గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని, నూతన పంచాయతీల ఏర్పాటును ఒకేసారి చేపట్టడంతో జిల్లాలో పంచాయతీల ముఖచిత్రం మారింది. కొన్ని పంచాయతీలు పురపాలిక హోదాను అందుకోనుండటం, ఇంకొన్ని గ్రామాలు వాటి పరిధిలో విలీనమవడం వల్ల జిల్లాలో మొత్తంగా 313 గ్రామపంచాయతీలు ఏర్పాటవుతున్నాయి. గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు జూలై 31తో పూర్తవుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ దిశగా జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.  వివిధ శాఖల్లో పనిచేస్తున్న 8,500మంది సిబ్బంది వివరాల్ని సేకరించారు. ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యేందుకుగాను వివరాల్ని టీ-పోల్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.21-3-2018న ప్రచురించిన ఓటరుజాబితాను అనుసరించి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాల పరిశీలనను ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఓటింగ్‌కు అవసరమైన బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు జిల్లాస్థాయిలో అందుబాటులో ఉన్న ముద్రణ కేంద్రాల వివరాలను గుర్తించారు. వాటి వివరాల్ని ఉన్నతాధికారులకు నివేదించారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు పలుమార్లు జిల్లాలో చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు. అవసరమైన సూచనల్ని అందించారు.జిల్లాలో పలు విడతలవారీగా నిర్వహించే ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్‌ డబ్బాలను మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు. జిల్లాలో 878 పెద్దవి, 745 చిన్న డబ్బాలు మొత్తంగా 1630 మాత్రం ఉన్నాయి. మహారాష్ట్రలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో నుంచి 2774 బ్యాలెట్‌ డబ్బాలను జిల్లాకు తెచ్చారు.  జిల్లాలో ఉన్న డబ్బాలకు అదనంగా 1898 డబ్బాలు మాత్రం అవసరం. ఇందులో 952 చిన్నవి, అత్యంత పెద్దవి 946 అవసరం. కాగా పెరిగిన పంచాయతీల సంఖ్య అదనంగా డబ్బాలు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో 1433 అతి పెద్ద డబ్బాలతోపాటు 1341 చిన్న డబ్బాలు కలిపి మొత్తంగా 2774 బ్యాలెట్‌ డబ్బాలను జిల్లాకు తీసుకొచ్చారు. వీటిని స్థానికంగా ఉన్న గోదాములో పదిలపర్చారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో 1433 అతిపెద్ద డబ్బాలు, 878 పెద్దవి, 2086 చిన్నడబ్బాలు ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నాయి.
Tags: Heat Panchayat Election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *