భారీగా పెరిగిన హెలికాఫ్టర్ కల్చర్

-సీజన్ లో దాటనున్న 100 కోట్ల బిజినెస్

Date:05/11/2018

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఎన్నికల సీజన్ వచ్చినప్పుడు కూడా పలు వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాటిలో ప్రైవేట్ ఏవియేషన్ ఒకటి. ఎన్నికలు వచ్చాయంటే ప్రైవేటు హెలికాప్టర్ సర్వీసు సంస్థలకు పండుగ వచ్చినట్లే.
ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువగా హెలికాప్టర్లలోనే ప్రయాణిస్తున్నారు. దీంతో సమయం మిగలడం, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడం, ఒకేరోజు ఎక్కువ
చోట్ల ప్రచారం చేయవచ్చనే కారణాలున్నాయి. పదేళ్ల కిందటి పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు హెలికాప్టర్లలో ప్రయాణించి ఎన్నికల ప్రచారానికి వెళ్లే సంస్కృతి ఎక్కువైంది. పార్టీ అధ్యక్షులుగా ఉండేవారు
స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తూ ఆ పార్టీ పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం  అనివార్యమైంది.2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు రూ.70 కోట్లను హెలికాప్టర్ల
కోసమే ఖర్చు చేసినట్లు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల్లో పేర్కొంది. ఇక టిడిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి రూ.1.03 కోట్లను ఖర్చు చేసింది.
టిఆర్‌ఎస్ రూ. 38.50 లక్షలను ఖర్చు చేసింది. రెండేళ్ల కిందట జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి, సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీగా ఉన్న అప్నాదళ్ కూడా హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగించడం గమనార్హం. ఎన్నికలకు ఆరు నెలల ముందే ప్రైవేటు హెలికాప్టర్ సర్వీసెస్ సంస్థలకు రిజర్వేషన్లు మొదలవుతాయి. ఎన్నికల షెడ్యూలు విడుదల కావడానికి కాస్త అటూ ఇటుగా వ్యాపారం ప్రారంభమై ప్రచారం ముగిసే నాటికి పూర్తవుతుంది. మొత్తం అరవై రోజులపాటు వ్యాపారం కొనసాగినా కూడా ఎక్కువగా 30 రోజులపాటు జోరుగా సాగుతుంది.

సాధారణ రోజుల్లో నెలకు గరిష్ఠంగా 60 గంటల ఫ్లైయింగ్ సమయం ఉండేలా వ్యాపారం కొనసాగితే ఎన్నికల సమయంలో మాత్రం అది దాదాపు వంద గంటలకు చేరుకుంటుంది. తెలంగాణ ఎన్నికల్లో మాత్రం టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎక్కువగా హెలికాప్టర్ వినియోగించే అవకాశముంది. మామూలు సమయాల్లో ప్రత్యేక విమానాలను అధికారికంగా పరిపాలనా అవసరాల కోసం వాడుతున్నప్పటికీ ఎన్నికల ప్రచారం సమయంలో మాత్రం ప్రైవేటు హెలికాప్టర్‌లనే ఎక్కువగా వాడుతారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు ఇప్పటికే అన్ని పార్టీలూ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను అందజేశాయి. ఈసారి ఎన్నికల్లో ఎయిర్ అంబులెన్స్‌లు, కేంద్ర ఎన్నికల సంఘం పారా మిలిటరీ బలగాలు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ‘ఎమర్జెన్సీ’ ఆరోగ్య అవసరాల నిమిత్తం వాడాలని నిర్ణయించుకున్నందున ప్రతీ జిల్లా కేంద్రంలో కనీసంగా రెండు చొప్పున హెలిపాడ్‌లను సిద్ధం చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులను ఆదేశించింది. ఇవే హెలిపాడ్‌లను రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల ప్రచారంలో వాడే హెలికాప్టర్ల కోసం వాడుకోడానికి వీలవుతుంది.ముగిసిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి, జెడిఎస్, కాంగ్రెస్ పార్టీలు హెలికాప్టర్లను విరివిగానే ఉపయోగించాయి. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే నాలుగైదు సందర్భాల్లో పార్టీ అధినేత కెసిఆర్ హెలికాప్టర్లను వినియోగించగా, ఇటీవల మంత్రి కెటిఆర్ కూడా వినియోగిస్తున్నారు. హెలికాప్టర్లకు వెచ్చిస్తున్న ఖర్చు మొత్తం పార్టీ లెక్కల్లోకే వస్తుంది తప్ప అభ్యర్థుల ఖర్చులోకి వెళ్లదు.ఎన్నికల సందర్భంగా పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్లు హెలికాప్టర్లను వినియోగించుకోడానికి ముందుగా ఎన్నికల సంఘానికి  తెలియజేసి అనుమతి పొందాల్సి ఉంటుంది.

అయితే సమయానికి ప్రైవేటు హెలికాప్టర్లు దొరుకుతాయో లేవోనన్న ఉద్దేశంతో ఆరు నెలల ముందుగానే ప్రైవేటు ఏవియేషన్ సంస్థలను సంప్రదించి రిజర్వు చేసుకునే సంప్రదాయం కూడా వచ్చేసింది. దేశంలోని ప్రముఖ ప్రైవేటు ఏవియేషన్ సంస్థ పవన్ హన్స్‌తోపాటు డెక్కన్ ఏవియేషన్, స్పాన్ ఎయిర్ లిమిటెడ్, జిఎంఆర్ ఏవియేషన్, ఎయిర్ చార్టర్ సర్వీసెస్, సిల్వర్‌లైన్ ఏవియేషన్, లిగర్ ఏవియేషన్, ఎయిర్ లుమినస్, తాజ్ ఎయిర్ లిమిటెడ్, గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్ లిమిటెడ్, టర్బో ఏవియేషన్, చిప్సన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర అనేక సంస్థలు హెలికాప్టర్ సర్వీసులను అందిస్తున్నాయి.పార్టీలు కోరుకునే హెలికాప్టర్ రకాన్ని బట్టి వీటి అద్దె గంటల్లో ఉంటుంది. అయితే, ఎక్కువసేపు పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే దానికి అదనంగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో సింగిల్ ఇంజన్ హెలికాప్టర్‌కు ఒకటిన్నర లక్ష
రూపాయల్లోపు ప్రతి గంటకు అద్దె ఉంటే రెండు ఇంజన్లు  ఉండే హెలికాప్టర్లకు గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు అద్దె ఉండేది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ హన్స్ సంస్థ నుంచి దాదాపు 16 హెలికాప్టర్లను బిజెపి అద్దెకు తీసుకోగా, సమాజ్‌వాదీ పార్టీ ఆరు హెలికాప్టర్లతో ప్రచారం చేసింది. ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న స్టార్ క్యాంపెయినర్లు రీటా బహుగుణ, అవినాష్ పాండే, రాజ్‌బబ్బర్, సినీ నటి నగ్మా, రాజీవ్ శుక్రా, మొహిసినా కిద్వాయ్, సుశీల్‌కుమార్ షిండే, దిగ్విజయ్‌సింగ్, ఆనంద్‌శర్మ, అజ్హారుద్దీన్, ప్రమోద్ తివారీ, మధుసూధన్ మిస్త్రీలాంటి వారు కూడా ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లను వినియోగించారు.

ఇక సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కెప్టెన్ అమరీందర్‌సింగ్, మోతీలాల్ ఓరా, గులాం నబీ ఆజాద్ తదితరులు ఎలాగూ విలాసవంతంగా ఉండే హెలికాప్టర్లను వాడేవారు. హెలికాప్టర్ రకాన్ని బట్టి దాని అద్దె ఆధారపడి ఉంటుంది. రెండు ఇంజన్లతో కూడిన ఆగస్టా వెస్ట్‌లాండ్ 139 రకం (15 మంది కూర్చునే సామర్థం), 109 రకం (ఎనిమిది మంది కూర్చునే సామర్థం), యూరో కాప్టర్ 155 రకం (13 మంది) తదితరాలకు అద్దె కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే, వివిఐపిలు స్టార్ క్యాంపెయినర్లుగా పాల్గొనేటప్పుడు విధిగా రెండు ఇంజన్లు ఉండే హెలికాప్టర్లనే వినియోగించడం శ్రేయస్కరమని కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా తెలియజేసేది. వీటికి ప్రతీ గంటకు అద్దె గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది (ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన అద్దెను ఖరారు చేస్తాయి). ఇక ఒకే ఇంజిన్ ఉండే డాఫిన్ ఎన్ 3 రకం హెలికాప్టర్లు గానీ, ఎనిమిది మంది కూర్చునే సామర్థం ఉన్న బెల్ 429 రకం హెలికాప్టర్లు, 15 మంది కూర్చునే బెల్ 412 రకం హెలికాప్టర్ల ధర కాస్త తక్కువగానే (గంటకు గరిష్టంగా రూ.1.50 లక్షలు) ఉంటుంది.

పోస్ట్ మార్టం

Tags:Heavily raised helicopter culture

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *