భారీగా దారిమళ్లుతున్న నిధులు

Date:08/11/2018
అనంతపురం ముచ్చట్లు:
 ప్రాజెక్టులకు నిధులు మంజూరు వెనుక ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ప్రాజెక్టును మంజూరు చేసి, ప్రాజెక్టు ఖర్చును భారీగా పెంచి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు దోచిపెడుతున్నారు. జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనులను నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.  హంద్రీ–నీవాలో భాగంగా 36వ ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీకి రూ.336 కోట్లు మంజూరైంది.
ఇందులో తొలివిడతగా 244.72 కోట్ల పనులను టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ చేస్తోంది. ఈ పనుల అంచనా వ్యయాన్ని కూడా భారీగా పెంచారు. బత్తపల్లి–రాప్తాడు నేషనల్‌ హైవే పనులను రూ.147 కోట్లకు కేసీపీఎల్‌–లికాన్‌(జాయింట్‌ వెంచర్‌) దక్కించుకుంది. కళ్యాణదుర్గం–రాయదుర్గం పనులను రూ.194 కోట్లతో ఇవే సంస్థలు దక్కించుకున్నాయి.
అంటే రూ.341 కోట్ల విలువైన ఈ రెండు పనులను ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌ సబ్‌లీజుకు చేస్తోంది. ఇందులో ఏస్థాయిలో మిగులుతుందో ఇట్టే తెలుస్తోంది. చిలమత్తూరు–మడకశిర రోడ్డు పనులను రూ.282 కోట్లకు ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ దక్కించుకుంది.
గుంతకల్లు–గుత్తి హైవే పనులు రూ.275 కోట్లకు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు దక్కాయి. ఈ పనులు మొదట 13 శాతం లెస్‌కు రిత్విక్‌ దక్కించుకుంది.
ఆ తర్వాత టెండర్‌ రద్దు చేసి, తిరిగి 4.95 శాతానికి పెంచి మళ్లీ టెండర్‌ దక్కిచుంది. లెస్‌ చేసిన 13 శాతం, పెంచిన 4.95 శాతం ప్రభుత్వానికి నష్టమే. హెచ్చెల్సీ ఆధునికీకరణలో భాగంగా యాడికి కెనాల్‌ పనులు 548.96 కోట్లుతో సాగుతున్నాయి. ఈ పనులు జీఎస్‌రెడ్డి, కేకేరెడ్డి, హిందుస్తాన్‌ రత్నకి చెందిన ఏజెన్సీలు చేస్తున్నాయి. జీబీసీ(గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌) పనులు రిత్విక్, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ చేస్తున్నాయి.
ఈ పనుల్లో పయ్యావుల కేశవ్, గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు లబ్ధి చేకూరింది. పుట్టపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న మారాల రిజర్వాయర్, కదిరి పరిధిలోని చెర్లో పల్లి రిజర్వాయర్‌ పనులతో పల్లె రఘునాథరెడ్డి, అత్తార్‌ చాంద్‌బాషా, కందికుంట ప్రసాద్‌కు డబ్బులు చేరినట్లు తెలుస్తోంది.  కియా రాకతో పెనుకొండ ఎమ్మెలే పార్థసారథికి భారీగా లబ్ధి చేకూరింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన ఈయనకు కియాకు ఇచ్చిన రూ.600 ఎకరాలు చదును చేసేందుకు రూ. 178 కోట్లతో టెండర్‌ పిలిచారు.
అనంతలో రూ.191 కోట్లతో పైపులైన్‌ పనులు మంజూరయ్యాయి. ఇందులో ఫేజ్‌–1లో రూ.147 కోట్ల పనులను 6.89 శాతం ఎక్కువతో ఐహెచ్‌పీ దక్కించుకుంది. ఇందులో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి భారీగా అందినట్లు తెలుస్తోంది. ఇసుకకు శింగనమల అడ్డా కావడంతో దోపిడీకి అడ్డు లేకుండా పోతోంది. ఇలా 14 నియోజకవర్గాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు ఎక్కడిక్కడ ప్రజాధనాన్ని కొల్లగొట్టి నగదు రూపంలో పోగు చేసుకుని ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈ స్థాయిలో అర్జించిన వీరంతా ఎన్నికల్లో నియోజకవర్గానికి రూ. 25 కోట్ల నుంచి రూ.40 కోట్లు వరకూ ఖర్చు చేసేందుకు సిద్ధ మయ్యారు.
Tags: Heavy redirection funds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *