సాగర్, శ్రీ శైలం జలాశయాలకు  భారీగా నీరు

Date:18/08/2018
నల్గొండ ముచ్చట్లు:
సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో ఖరీఫ్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. జలాశయాలలో పెరుగుతున్న నీటి మట్టాలు, వరదల ప్రవాహం ఇందుకు ఊతమిస్తోంది. సాగర్‌ ఎడమ కాల్వకు వారబందీ ప్రకారం నీటిని విడుదల చేస్తే ప్రస్తుత నిల్వలు సరిపోవచ్చని అధికారుల అంచనా.
సాగర్‌, శ్రీశైలం జలాశయాలకు వస్తున్న ప్రవాహాలను బట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 3 లక్షల ఎకరాల రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. స్టేట్‌ లెవల్‌ హైయర్‌ కమిటీ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఇటీవలే సమావేశమైంది.
అప్పటికి నీటి లభ్యత లేకపోవడంతో ఏ నిర్ణయం తీసుకోలేదు. నీటి విడుదల విషయంలో ప్రాజెక్టుల అధికారులు, ఈఎన్‌సీ ఉన్నతాధికారులు, వ్యవసాయ, వాతావరణ శాఖల నివేదికలు, గత పదేళ్లలో ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలు, వరదలు, నీటి ప్రవాహాలు పరిగణలోకి తీసుకుంటారు.
ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు ఆగస్టు చివరి నాటికి వచ్చే వరదలను అంచనా వేసి ఒక నిర్ణయానికి వస్తారు. ఆగస్టు 20 వరకు ఈ అంచనాలు వేసి నివేదిస్తే నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
శివం కమిటీ సమావేశమైతే అన్ని ప్రాజెక్టులలో నీటి లభ్యత, భవిష్యత్తు తాగునీటి అవసరాలు అంచనా వేసి నీటి విడుదలకు మార్గం ఉందా అనే అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తుంది. ప్రస్తుతం నీటి ప్రవాహాలు, నిల్వలు పెరగడంతో త్వరలోనే శివం సమావేశం కానుంది. సాగర్‌ జలాశయం ఎగువన ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. రెండు రోజులుగా కర్టాటక తుంగభద్ర పరిసరాలలో కురుస్తున్న వర్షాలకు వరద ఉద్ధృతి పెరుగుతోంది.  తుంగభద్రకు వరద ప్రారంభమైంది. వెనువెంటనే శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.
గురువారం సాయంత్రానికి 2,10,000 క్యూసెక్కుల వరకు వస్తోంది. మరో రెండు రోజుల పాటు వరద  వచ్చే పరిస్థితి ఉంటుందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలమట్టికీ వరద భారీగా పెరిగింది. లక్షకు పైగా వస్తుండటంతో 1,26,180 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. జూరాల, నారాయణపూర్‌ జలాశయాలకు సైతం 1,19,000 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతకంటే ఎక్కువగానే నీటిని కిందకు వదులుతున్నారు.
అటు తుంగభద్ర నుంచి విడుదలయ్యే నీటితో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే వరద తోడై శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతుంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా గురువారం సాయంత్రం 6 గంటలకు 874.90 అడుగులకు చేరింది.ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయిస్తే పదిరోజుల్లో నీరు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. 500-510 అడుగుల మేర నీరు ఉందంటే 16 టీఎంసీలు వాడుకోవడానికి అవసరమైన నీరు అందుబాటులో ఉంటుంది.
510-520 వరకు 20 టీఎంసీలు, 520-530 వరకు ఉంటే 35 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సాగర్‌ జలాశయంలో 523 అడుగుల వరకు నీటిమట్టం ఉంది. శ్రీశైలం నుంచి వచ్చే వరదతో మరికొంత మేర నీటిమట్టాలు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఖరీఫ్‌లో ఉమ్మడి జిల్లాలో 3 లక్షల ఎకరాల సాగుకు 25 టీఎంసీల నీరు సరిపోతుంది.
రెండు జోన్లకు కలిపి సుమారు 4.50 లక్షల ఎకరాలకు వారబందీ ప్రకారం నీటిని విడుదల చేసి సక్రమంగా వినియోగిస్తే కేవలం 35 టీఎంసీలతో ఖరీఫ్‌ పంటకు నీరివ్వవచ్చు.సాగర్‌ జలాశయం నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. నీటి విడుదల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ముందుగా చెరువులకు విడుదల చేస్తే వచ్చే రోజుల్లో తాగునీటి అవసరాలకు, రబీ అవసరాలకు కొరత రాకుండా చూడాలని ఆలోచిస్తున్నారు.
ఖరీఫ్‌లో నీరివ్వాలంటే ప్రస్తుతం కృష్ణా నది యాజమాన్య బోర్డు కేటాయించిన నీరు సరిపోదు. మిషన్‌భగీరథ, ఎస్‌ఎల్‌బీసీ, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు పోగా మిగిలిన నీటిని విడుదల చేయాలి. ఈ అవసరాలకు పోగా నీరు మిగలకపోతే పరిస్థితి ఏంటని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
గతేడాది అక్టోబర్‌ చివరి వారంలో కురిసిన వర్షాలకు 570 వరకు నీటిమట్టాలు పెరగడంతో రబీకి ముందస్తుగా నీటిని విడుదల చేశారు. అంతకు ముందు సంవత్సరం ఖరీఫ్‌ పంటను కాపాడేందుకు నవంబర్‌లో నెల పాటు విడుదల చేశారు.
Tags: Heavy water for Sagar and Shailam reservoirs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *