కన్నడ ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు

Date:15/03/2018
బెంగళూర్ ముచ్చట్లు:
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పార్టీలతో పాటు రాజకీయ కుటుంబాల్లో కూడా కలకలం సృష్టిస్తున్నాయి. తమ రాజకీయ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు ఆ యా పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహరచన చేస్తున్నారు. హైకమాండ్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కుమారులు, కూతుళ్లు, అల్లుళ్లు, భార్యలకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన పరిస్థితి కాదు. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ, జనతాదళ్ (ఎస్) ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. ఎలా అధిగమించాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ కు ఈ తలనొప్పి మరికొంత ఎక్కువ.స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పైకి అధిష్టానం అంగీకరిస్తేనే అంటున్నప్పటికీ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ స్తానాన్ని వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నగర్ కు వెళ్లనున్నట్లు సమాచారం. పెద్దకుమారుడు 2016లో బెల్జియంలో జరిగిన ప్రమాదంలో మరణించడంతో చిన్న కుమారుడు యతీంద్రను బలవంతంగా రాజకీయ తెరపైకి తెస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడి కోసం రంగంలోకి దిగడంతో ఇతర నాయకులు, మంత్రులు అదే బాటలో తమ వారికి టిక్కెట్ల కోసం పైరవీలు చేస్తున్నారు. ప్రజాపనుల శాఖ మంత్రి సునెల్ బోస్ ను మైసూరు జిల్లాలోని టి.నరసిపుర నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. హోంమంత్రి ఆర్. రామలింగారెడ్డి తన కూతురు సౌమ్యరెడ్డిని బెంగళూరు నగరం లోని ఏదో ఒక స్థానంలో నిలబెట్టేందుకు తపన పడుతున్నారు. కేంద్రమాజీ మంత్రి కె. రహమాన్ ఖాన్ తన కుమారుడు మన్సూద్ ఆరాన్ కు జయనగర టిక్కెట్ ఇప్పించుకునేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. కేంద్రమాజీ మంత్రి జాఫర్ షరీఫ్ తన మనవడు రెహమాన్ ఖాన్ ను హెబ్బల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలన్న పట్టుదలతో ఉన్నారు. బోఫోర్స్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ పార్టీ కమిటీ ఛైర్మన్ గా పనిచేసిన మరో కేంద్ర మాజీ మంత్రి బి.శంకరానంద తన కుమారుడు భీమ్ సేన్ రావుకు అరల్ స్థానం కోసం పాత పరిచయాలను తిరగేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ అల్లుడు చంద్రసింగ్ బీదర్ జిల్లా నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడుకాంగ్రెస్ లో చక్రం తిప్పిన, రాజస్థాన్ గవర్నర్ గా పనిచేసిన సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వా చిన్న కుమారుడు నివేదిత ఆల్వాకు ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సి నియోజకవర్గం టిక్కెట్ కోసం హైకమాండ్ పెద్దలతో మాట్లాడుతున్నారు. న్యాయశాఖ మంత్రి జయచంద్ర తుముకూరు జిల్లాలోని చిక్కనాయకన హళ్లి నుంచి కుమారుడు సంతోష్ ను పోటీ చేయించుకునేందుకు పావులు కదుపుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖామంత్రి రోహన్ బేగ్ కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కుమారుడు రెహన్ బేగ్ కు అసెంబ్లీ, తనకు రాజ్యసభ స్థానం కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. సీనియర్ దళితనాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.హెచ్. మునియప్ప కుమారుడు రూపను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి బరిలోకి దించాలని చూస్తున్నారు. స్పీకర్ కె.బి. కొలివద్ క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగి కుమారుడి అరంగేట్రం కోసం తపన పడుతున్నారు. మరికొందరు నాయకులు కూడా ఇదే బాటలో ఉన్నారు. ఇందుకోసం కేంద్ర పెద్దలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు.రాజకీయ వారసుల అంశం ఒక్క అధికారపార్టీకే పరిమితం కాలేదు. విపక్ష బీజేపీ, జనతాదళ్ (ఎస్) కూడా ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారులు కూడా టిక్కెట్ల బరిలో ఉన్నారు. ఇప్పటికే శాసనసభ్యుడిగా ఉన్న పెద్దకుమారుడు రాఘవేంద్ర రానె చెన్నూరు స్థానం నుంచి మళ్లీ పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చిన్న కుమారుడు విజయేంద్ర కూడా బెంగళూరు నగరంలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలన్న యోచనలో పావులు కదుపుతున్నారు. కుటుంబ పార్టీగా ముద్రపడిన జనతాదళ్ ఎస్ లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే పార్టీ నుంచి దేవెగౌడ హసన్ ఎంపీగా ఉన్నారు. కుమారుడు కుమారస్వామి రామనగర నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సోదరుడు హెచ్.డీ దేవన్న కూడా ఎమ్మెల్యేనే. తాజాగా కుమారస్వామి భార్య అనిత కూడా బెంగళూరు గ్రామీణ ప్రాంతంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. మొత్తం మీద వారసత్వ రాజకీయాల్లో కన్నడనాడు కళకళలాడుతోంది. కుటుంబం పేరు చెప్పుకుని, తాత, తండ్రి పేరు చెప్పుకుని రాజకీయ అరంగేట్రం చేసేందుకు యువనాయకులు ఉత్సుకతతో ఉన్నారు. వీరి టిక్కెట్ల ప్రయత్నాలను ఆ యా పార్టీల అధిష్టానాలు ఎంతవరకూ అంగీకరిస్తాయో వేచి చూడాలి మరి.
Tags: Heights over the heights in Kannada elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *