హలో…ప్రభాకర్ బాగున్నావా…

#భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
#పలకరింపు, నాటి రోజులపై పిచ్చాపాటి

Date:28/05/2020

బుధవారం 27 వ తేదీ మధ్యాహ్నం సమయం 12 గంటల 32 నిముషాలు.
నా మొబైల్ మోగింది.
ఎత్తుకోగానే…
సార్ మీరు ప్రభాకర్ గారా…అని
అడిగారు.
అవునుసార్… అన్నాను.
మీతో వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతారు… లైన్లో వుండండి అన్నారు.
ఆశ్చర్యపోయాను.
మరోవైపు ఆనందం…

ఇంతలో హలో…. ప్రభాకర్ బాగున్నావా.. అంటూ వెంకయ్యనాయుడు గారు తన గంభీరమైన గొంతుతో పలకరింపు.నా ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. సార్…బాగున్నాను అన్నాను. కుటుంబం అంతా క్షేమమే కదా అన్నారు. క్షేమమే సార్ అని చెప్పాను. 30 సంవత్సరాల క్రితం ఆయన బీజేపీ అధ్యక్షలుగా ఎంపికైన సందర్భంగా వారితో నేను చేసిన ఇంటర్వ్యూ గుర్తు చేసాను. అప్పుడు నేను ఆంధ్రపత్రిక నెల్లూరు స్టాఫ్ రిపోర్టర్ గా ఉండేవాడిని. ఆ సమయంలో ఆంధ్రప్రభ & ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టర్ గా ఉన్న మధుసూదనరావు గారు వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి – నన్ను గురించి చెప్పి నాకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. సాయంత్రం ప్రభాకర్ ను ఇంటర్వ్యూ చేసుకోడానికి రమ్మన్నారు. అప్పుడు మిలటరీ కాలనీ లో వున్న వెంకయ్య నాయుడు గారి ఇంటికి వెళ్ళాను.‌ నేను వచ్చి వున్న విషయం బయట వున్న వ్యక్తికి తెలపగానే – వెంకయ్య నాయుడుగారు బయటకు వచ్చారు. ఇంటి ఆవరణలోనే బయట కూర్చున్నాము. ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఎక్కువ వేసాను. ప్రభాకర్ ఇంటర్వ్యూ చాలా లెంగ్త్ అయ్యింది అన్నారు.
ధన్యవాదాలు చెప్పి వచ్చేసాను.

 

మరుసటిరోజు
“వెంకయ్య నాయుడితో ముఖాముఖి ” అని ఆంధ్రపత్రికలో రెండురోజులు పాటు నా బై లైన్ తో ఆ ఇంటర్వ్యూ ప్రచురించారు. ఆ విషయం ఈ సందర్భంలో గుర్తు చేసాను. అవును ప్రభాకర్ గుర్తుకొచ్చింది. మధుసూదనరావు కూడా ఆ తర్వాత కాకినాడకు ట్రాన్స్ఫర్ అయ్యారని వెంకయ్య నాయుడు గారు నాకు గుర్తుచేశారు. హిందూ నాయణరావు, ఈనాడు నాగేశ్వరరావు ల పేర్లు ఆయనే గుర్తు చేశారు.తర్వాత చాలాసార్లు ప్రెస్ మీట్స్ లో వారిని కలిశాను మ. ఒక్కసారి పరిచయం అయితే పేరు మరచిపోయే గుణం ఆయనది కాదు. ఎప్పుడు కనిపించినా ప్రభాకర్ అని సంబోధించేవారు.చాలా గ్యాప్ తర్వాత 2014 లో మళ్లీ విజయవాడలో ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో వారిని కలిశాను. అప్పుడు నేను నది మాసపత్రిక ఎడిటర్ గా విజయవాడలో వున్నాను. విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా కూడా వుండే వాడిని. ఆ రోజు వెంకయ్యనాయుడు గారిని కలిసి నమస్కారాలు చెప్పాను.ఆతర్వాత ఈ రోజు ఇలా… అనూహ్యంగా భారత ఉపరాష్ట్రపతి గా ఉన్నత పదవిలో వున్న వెంకయ్య నాయుడు గారి ఫోన్ పలకరింపుతో నా జన్మకు, నా జర్నలిజం వృత్తికి సార్ధకత చేకూరినట్లైంది .ఫోన్లో ఒక ప్రశ్న అడిగాను‌. భారతీయ జనతాపార్టీ పట్ల కొందరు ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటారు కదా – మరి మిమ్మల్ని ఉదయగిరి నియోజకవర్గంలో వున్న ముస్లింలు నూటికి నూరుశాతం ఇప్పటికీ ఎందుకు ప్రేమిస్తున్నారని అడిగాను . అందుకు వెంకయ్యనాయుడు గారు సమాధానం ఇస్తూ…1977లో నేను ఓటమి చెందిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించారు . ముఖ్యంగా ఆ గెలుపులో పాత్రంతా ముస్లిం సోదరులదే . ఎందుకో ఆనాటినుండి వారితో నాకు ఏర్పడ్డ అనుబంధం నేటికీ చెక్కు చెదరకుండా వుంది అని బదులిచ్చారు . ఈ సందర్భరంగా నేను నామిత్రుడు , ఉదయగిరి నవాబుల వంశీయుడైన అబ్దుల్ ఖాదర్ అఫ్ఫాన్ పేరు ప్రస్తావించాను . వెంటనే వెంకయ్యనాయుడు అఫ్ఫాన్ తమ్ముడు షకీల్ , షాజహాన్ , ఖాదర్ భాషా ల పేర్లు కూడా చెబుతూ – వారంతా ఇప్పటికీ తనను కలుస్తుంటారని చెప్పినప్పుడు నా కళ్ళు చెమర్చాయి . ఇప్పటికీ ఇంత గుర్తుగా పేర్లు చెబుతూ వారి యోగక్షేమాలు తెలుసుకొనే నాయకులు ఎవరుంటారా అని .ఎక్కడ వుంటున్నావ్ ప్రభాకర్ ? అని అడిగారు . కావలిలో సార్ అన్నాను . కావలి అభివృద్ధికి మీరు మంజూరు చేయించిన ” అమృత పథకం ” కు గుర్తుగా నిర్మించిన పైలాన్ ధ్వంసం విషయం తమ దృష్టికి వచ్చిందా సార్ అని అడిగాను . నా దృష్టికి కొందరు తీసుకొచ్చారు . నేను ఇప్పుడు రాజకీయాల్లోలేనని , లోకల్ గా వున్న నాయకులే సమస్యను పరిష్కరించుకోమని చెప్పాను అన్నారు .భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు సీనియర్ జర్నలిస్టుగా నన్ను గుర్తించి ఫోన్ చేసి యోగక్షేమాలు విచారించడం వారి సంస్కారం. వారికి నా హృదయపూర్వక నమస్కారం.

-ప్రభాకర్ జలదంకి. ✍🏻
సీనియర్ జర్నలిస్టు
కావలి
ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా

కాళహస్తి రాజకీయ తెరపైకి హరి..

Tags: Hello … Prabhakarbagunnawa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *