అధికారుల తీరును తప్పుపట్టిన హైకోర్టు

Date:24/04/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పన్మక్త గ్రామం వద్ద తన గెస్ట్‌హౌస్‌కు రెవెన్యూ అధికారులు తాళాలు వేయడాన్ని సవాలు చేస్తూ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు  సంచలన తీర్పు వెలువరించింది. కొనుగోలు చేసిన ఆ స్థలం నుంచి ప్రభాస్‌ను ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమని, ఈ విషయంలో అధికారులు తీరు సక్రమంగా లేదని వ్యాఖ్యానించింది. అలాగే క్రమబద్ధీకరణ దరఖాస్తుపై ఎనిమిది వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. అయితే, 1958 నుంచి భూములకు సంబంధించిన వివాదం నడుస్తోందని, వాటిని తిరిగి స్వాధీనం చేయాలని, ప్రభాస్‌కు వాటిని అప్పగించలేమని పేర్కొంది. ఆరు దశాబ్దాలకుపైగా వివాదంలో ఉన్న భూముల వ్యవహారంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని, వివాదాలు సమసిపోతాయని, ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. అంతేకాదు తమ ఉత్తర్వులను ధిక్కరిస్తే ప్రభాస్‌ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపింది.
పన్మక్త గ్రామంలో తాను కొనుగోలు చేసిన స్థలాన్ని ప్రభుత్వానిదిగా పేర్కొంటూ అధికారులు తాళాలు వేయడాన్ని సవాలు చేస్తూ ప్రభాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం తుది తీర్పు వెలువరించింది. చట్టబద్దంగా భూమిని కొనుగోలు చేసినప్పటికీ వివాదాలు తలెత్తకూడదని భావించిన ప్రభాస్‌ దీని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారంది. దీనిని పరిష్కారించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది. ఈ వివాదంలో ఆ స్థలంపై ప్రభాస్‌ హక్కుల జోలికి తాము వెళ్లడంలేదని, అలా స్పందిస్తే తమ పరిధిదాటినట్లేనని ధర్మాసనం ఉద్ఘాటించింది. కానీ, ఆక్రమణదారులకూ హక్కులున్నాయని, వారిని ఖాళీ చేయించడానికి భూఆక్రమణల నిరోధక చట్టం ఉందని తెలిపింది. అలా కాకుండా సివిల్‌ కోర్టును ఆశ్రయించి హక్కులు తేల్చుకోవాలంటూ ప్రభాస్‌కు చెప్పడం సరికాదని తప్పుపట్టింది. చట్ట వ్యతిరేకంగా భూమిని స్వాధీనం చేసుకుంటే దాన్ని తిరిగి అప్పగించాలంటూ ఆదేశాలివ్వవచ్చని, ఈమేరకు గతంలో సుప్రీం కోర్టు తీర్పులను ఉదాహరణగా పేర్కొంది. క్రమబద్ధీకరణ కోసం ప్రభాస్‌ పెట్టుకున్న దరఖాస్తును ప్రజా, ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిగణనలోకి తీసుకోవాలని వివరించింది. ఈ తీర్పు కాపీ అందిన ఎనిమిది వారాల్లో ప్రభాస్‌ దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.
Tags:High Court to blame the authorities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *