హిప్పీ  కామెడీ హారార్ మూవీ

Hippie Comedy Horror Movie

Hippie Comedy Horror Movie

Date:20/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు :
వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా వచ్చిన ‘ఆర్‌ఎక్స్100’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాల్లో ఇదో పెద్ద సంచ‌ల‌నం. తొలి చిత్రంతోనే హీరో కార్తికేయ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే, దక్షిణ భారత సినీ రంగంలో కలైపులి యస్.థాను అంటే ఒక బ్రాండ్. అభిరుచి గల భారీ బడ్జెట్ నిర్మాతగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
‘తుపాకి’, ‘తెరి’ ‘కబాలి’ వంటి భారీ చిత్రాలను ఆయన నిర్మించారు. 1985 నుంచి సినిమా నిర్మాణంలో త‌న‌దైన ముద్ర వేసుకుని తమిళనాట నిర్మాత‌గా, ప్రముఖ పంపిణీదారుడిగా కొన‌సాగుతున్నారు. అంత గొప్ప నిర్మాత.. కార్తికేయతో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. వి క్రియేష‌న్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టి.ఎన్‌.కృష్ణ ద‌ర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మితమవుతోంది. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ‘హిప్పీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు టి.ఎన్‌.కృష్ణ మాట్లాడుతూ ఇది రొమాంటిక్ కామెడీ చిత్రమని చెప్పారు. కార్తికేయ తన తొలి చిత్రానికి భిన్నంగా ఈ సినిమాలో కనిపిస్తారని తెలిపారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, వాళ్లని ఇంకా ఎంపిక చేయలేదని వెల్లడించారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని, ప్రస్తుత ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టే సినిమా అని చెప్పుకొచ్చారు. అక్టోబ‌ర్ నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ ఉంటుందన్నారు.
నిర్మాత క‌లైపులి య‌స్‌.థాను మాట్లాడుతూ.. ‘త‌మిళంలో 1985 నుంచి వ‌రుస‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించాం. అటు పంపిణీరంగంలోనూ మాదైన ముద్రతో కొన‌సాగుతున్నాం. తెలుగులో నేరుగా సినిమా తీయాల‌ని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఇప్పటికి కుదిరింది. కార్తికేయ ‘ఆర్‌ఎక్స్100’ చూశాను. ప్రస్తుత ట్రెండ్‌కి త‌గ్గ హీరో అనిపించింది. ఆయ‌న‌తో ‘హిప్పీ’ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాం.
ఎక్కడా బ‌డ్జెట్‌కు వెన‌కాడ‌కుండా, సినిమాకు కావాల్సిన‌దంతా స‌మ‌కూర్చి భారీగా రూపొందిస్తాం’ అని అన్నారు. ‘ఆర్ఎక్స్100’ తరవాత ఇంత పెద్ద సంస్థలో అవకాశం రావడం తన అదృష్టమని హీరో కార్తికేయ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి నివాస్ కె.ప్రసన్న సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Tags:Hippie Comedy Horror Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *