ఆయన జీవితం ఒక ప్రభంజనం.. ఆయన కలం విప్లవ కెరటం.

-డా. మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే

 

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఈనాడు గ్రూపుల అధినేత   రామోజీరావు మరణంతో తెలుగుజాతి ఒక మహోన్నత దిగ్గజాన్ని కోల్పోయింది.పట్టుదల, దృఢదీక్ష, మనో నిబ్బరంతో సామాన్య స్థితి నుంచి అసమాన్య స్థితికి ఎదిగిన ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం.. భావితరాలకు మార్గదర్శకం.పత్రికారంగ చరిత్రలో ఈనాడు పత్రిక, ఈటీవీ ఒక సంచలనం. సినీ రంగ చరిత్రలో రామోజీ ఫిలిం సిటీ ఒక అద్భుతం. వ్యాపార రంగంలో మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా పచ్చళ్ళు… ఆయన ఏది చేపట్టిన బంగారమయింది.1977 ఉప్పెన సమయంలో దివిసీమ ధీనగాధలను లోకానికి చాటి చెప్పి, ఈనాడు సహాయ నిధి ద్వారా రూ. 3,73,927/- సేకరించి పాలకాయతిప్పలో 112 ఇళ్ళు, కృష్ణాపురంలో 22 ఇళ్ళు రామకృష్ణమిషన్ ద్వారా నిర్మింపచేశారు. పాలకాయతిప్ప కు వారు వచ్చినప్పుడు వారిని అవనిగడ్డ గాంధీ క్షేత్రానికి తీసుకువచ్చి అనాధ పిల్లల శరణాలయాన్ని చూపించాను. అది వారిని కలుసుకున్న మొదటి సందర్బం.ఆ తరువాత తెలుగు భాషా పరిరక్షణలో వారు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు. నేను అధికార బాషా కమిషన్ అధ్యక్షుడినైనప్పుడు వారు అందించిన సహకారం అంతా ఇంతా కాదు. వారు జీవించి ఉన్న కాలంలో తెలుగు మసక బారుతుంటే బాధ కలుగుతుందని, ఎలాగైనా తెలుగుని నిలబెట్టాలని అనేవారు. తెలుగు భాషా పరిరక్షణకు వారు చేసిన కృషి మహత్తరమైనది. ఆంగ్ల పదాలకు తగిన తెలుగు పదాలను సృష్టింపచేసి ఈనాడు ద్వారా వ్యాప్తికి తెచ్చారు. ఒక మహా నిఘంటు నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. తెలుగు జాతి వైభవోన్నతికి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి  రామోజీరావు.నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేసిన అక్షర యోధుడు  రామోజీరావు. తెలుగుజాతికి సవాళ్లు ఎదురైనప్పుడు ధీటుగా ఎదిరించి నిలబడిన మహోన్నత ధైర్యశాలి. ఆయన జీవితం ఒక ప్రభంజనం.. ఆయన కలం విప్లవ కెరటం. వారి మరణం తెలుగు జాతికి తీరనిలోటే కాకుండా వ్యక్తిగతంగా ఒక హితైషిని కోల్పోయాను. వారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

 

Tags:His life is a blessing.. His pen is a wave of revolution.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *