అనంతపురం విద్యాశాఖలో ఇంటి దొంగలు

Date:13/10/2018
అనంతపురం ముచ్చట్లు:
ప్రైవేటు పాఠశాలలకు అనుమతులకు వస్తే ఆఫీసులో పండగే. అనంతపురం జిల్లాలో అన్ని యాజమాన్య పరిధిలో 5,114 పాఠశాలలు ఉండగా ఇందులో 5,69,687 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు యాజమాన్య పరిధిలో 1,182 పాఠశాలలు ఉండగా ఇందులో ప్రాథమికలో 389, ప్రాథమికోన్నతలో 415, ఉన్నత పాఠశాలలు 378 ఉన్నాయి. మొత్తం 2,16,182 మంది విద్యార్థులు చదువుతున్నారు.
అనంతపురం విద్యా శాఖలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు ఇంటి దొంగలుగా మారిపోతున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. కొత్తగా పాఠశాలలకు అనుమతి ఇవ్వాలన్నా అనుమతులు కొనసాగిస్తూ రెన్యువల్‌ చేయాలన్నా, అదనపు సెక్షన్లు మంజూరు చేయాలన్నా ఇంత రేటు అని నిర్ణయిస్తున్నారు. ప్రైవేటుకు సంబంధించిన ఏతరహా దస్త్రం వచ్చినా ఉద్యోగులకు ఆదాయ వనరుగా మారుతోంది. అందుకే తప్పిదాలకు మార్గం అన్వేషించారు.కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు వద్ద ఎవరి స్థాయుల్లో వారికి తూకం ఉంచాల్సిందే. ఇదే అదనుగా భావించిన ఓ ఉద్యోగి తానే అన్నీ తానై వ్యవహరించాడు.
ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి ఆట స్థలం, స్థలం లీజు, సౌకర్యాలు, డిపాజిట్లు తదితర వివరాలన్నీ పక్కాగా ఉండాలి. పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకుంటే విద్యార్థులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కొద్ది రోజుల కిందట గోరంట్లలో ఓ ప్రైవేటు పాఠశాలలో బండ విరిగి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. తాజాగా అనంతపురంలో ఓ పాఠశాలకు  రెన్యువల్‌ ఉత్తర్వులు, అదనపు సెక్షన్‌ పెంచడానికి ఆర్జేడీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పాఠశాలకు ఇచ్చారు. జిల్లాలో పదుల సంఖ్యలోనే ఇలాంటి పాఠశాలలు ఉండొచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఆయా పాఠశాలలకు ఇచ్చిన అనుమతులను పరిశీలిస్తే మరికొన్ని నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది.అనంతపురంలోని అఫ్లాటస్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాలకు రెన్యువల్ తో పాటు కొనసాగింపు, అదనపు సెక్షన్లకు సంబంధించి నా పేరుతో ఉత్తర్వులు ఇచ్చారు. అసలు ఆ పాఠశాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఫోర్జరీ సంతకాలతో అనుమతి ఇచ్చినట్లు గుర్తించాం. ఆర్సీ నంబరుతోపాటు ఆర్జేడీ, కార్యాలయం ఉద్యోగుల సంతకాలన్నీ ఫోర్జరీ చేసి ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలో ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తేలాల్సి ఉంది.
Tags: Home thieves in Ananthapur education department

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *