చంద్రన్న భీమా పధకంలో ఇంటి దొంగలు

Date:20/03/2018
నెల్లూరు ముచ్చట్లు:
‘చంద్రన్న బీమా’ పథకానికి అధికార పార్టీ నాయకులే తూట్లు పొడుస్తున్నారు. రాజకీయ స్వార్థం కోసం అక్రమార్కులను తప్పించేసి… ఇతరులను బలిచేసే పరిస్థితి తలెత్తింది. బుక్కరాయసముద్రం మండలంలో చోటుచేసుకున్న చంద్రన్న బీమా అక్రమాల బాగోతంపై రాజకీయ కోణంలోనే పోలీసుల విచారణ సాగినట్లు తెలుస్తోంది. ఎక్కడా కూడా ‘వెలుగు’ ఉద్యోగుల ప్రస్తావన లేకుండా చేశారు. తెర ముందు ఉంటూ కడుపునిండా భోంజేసిన వారిని విస్మరించి… చిరు ఉద్యోగులను ఇరికించేలా వ్యవహరించినట్లు తేటతెల్లమౌతోంది. పోలీసుల విచారణ పక్కాగా… న్యాయ సంబంధంగా సాగలేదనే ఆరోపణలు లేకపోలేదు. బీమామిత్రను తమకు అనుకూలంగా మార్చుకుని… ఆమె చెప్పిన ప్రకారమే పోలీసుల విచారణ సాగినట్లు బయట పడింది. అన్ని కోణాల్లో పోలీసుల విచారణ సాగలేదని స్పష్టమైంది. ఈ అవినీతి బాగోతం విచారణలో రాజకీయ పైరవీలు జరిగినట్లు విస్తృత ప్రచారం నడుస్తోంది.బీకే సముద్రం మండలంలో రోటరీపురంలో ఒక మహిళ ఆత్మహత్యను సహజ మరణంగా సృష్టించి రూ.2లక్షలు కాజేశారు. ఇదే తరహాలోనే నీలారెడ్డిపల్లి, రేగడికొత్తూరులో నమోదైన ఆత్మహత్యలను సాధారణ మరణాలుగా చిత్రీకరించి రూ.4 లక్షలు కాజేసేలా పన్నాగం పన్నారు. ఈలోపు బీమా కంపెనీ గుర్తించడంతో ఈ రెండు ఘటనల డబ్బు డ్రా కాకుండా సెర్ప్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.  తాజాగా పోలీసుల విచారణలో ‘వెలుగు’ సిబ్బంది పాత్ర ఎక్కడా ప్రస్తావించలేదు. బీమా మిత్ర, స్థానికంగా పాత్ర ఉందనే ఉద్దేశంతో మరొక ఉద్యోగి, అకౌటెంట్‌, ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి, బయట వ్యక్తి… ఇలా ఈ ఐదుగురి పాత్ర ఉందని కేసులు పెట్టారు. వెలుగు ఉద్యోగులకు తెలియకుండానే గ్రామాల్లో ఉన్న సిబ్బందికి ఈ అక్రమ వ్యవహారాన్ని నడిపే శక్తి ఉంటుందా? పోలీసుల విచారణలో మండల స్థాయిలో సంతకాలు, కాల్‌ సెంటర్‌లో అప్‌లోడ్‌ వ్యవహారాలన్నీ తెరమరుగయ్యాయి. పక్కా కుట్రతో… అల్లిన కథలా పాత్రలను ఇరికించేసినట్లు తెలిసిపోయింది. పార్టీని భ్రష్టు పట్టించేందుకే ఇలా చేశారంటూ ఓ ఇద్దరు ప్రజాప్రతినిధులకు ‘రాజకీయ’ రంగు పులమడంలో వెలుగు సిబ్బంది విజయవంతం అయ్యారు. వారి మాటలను నిమ్మిన ప్రజాప్రతినిధులు విచారణనే పక్కదారి పట్టేలా ఒత్తిళ్లు పెంచినట్లు సమాచారం. అసలు పాత్ర.. సూత్రధారులు తప్పించుకుని… ప్రమేయం ఉన్న వారిని.. లేనివారిని అరెస్టు చేశారు. ఇదే విషయాన్ని ఆ సమాఖ్య అకౌంటెంట్‌ బహిరంగంగా పేర్లతో సహా ప్రస్తావిస్తూ బోరున విలపించింది. ఈమె వాదనను పోలీసులు అసలు పరిగణనలోకి తీసుకోలేదు.మొత్తానికి ఏదో కోణంలో పోలీసుల విచారణను ముగించారు. ఇప్పుడు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) విచారణ నివేదికపై అక్రమార్కులు, అధికార యంత్రాంగం నిరీక్షిస్తోంది. ఇప్పటికే డీఆర్వో, ఆయన నిర్దేశించిన కార్యాలయ పర్యవేక్షకులు బీకే సముద్రం చంద్రన్నబీమా ఘటనపై విచారణ చేశారు. తమ కార్యాలయానికే దోషులను పిలిపించి విచారించారు. ఈ విచారణలోనైనా వాస్తవాలులు ‘వెలుగు’ చూస్తాయా లేక పోలీసు విచారణ తరహాలోనే చేతులు కడిగేసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. డీఆర్వో మాత్రం నిక్కచ్చిగా నివేదిక ఇవ్వాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Tags: Home thieves in Chandranna Insurance Scheme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *