ట్రిపుల్ ఐటీ సమస్యలకు నిలయం
అదిలాబాద్ ముచ్చట్లు:
బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలకు నిలయంగా మారింది. ట్రిపుల్ ఐటీ నిర్వహణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థుల చదువులకు శాపంగా మారింది. దీంతో పాటు రెగ్యులర్ వీసీ లేకపోవడం కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. క్యాంపస్‌లో ఏళ్ల తరబడి తిష్ట వేసిన సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ ఏడాది ఇంకా ప్రత్యక్ష తరగతులను ప్రారంభించలేదు. వసతి గృహాల్లో పడకలు, పరుపులు లేకపోవడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.ఈ విషయం బయటకు పొక్కకుండా ఆన్‌లైన్ క్లాసుల పేరిట కాలం వెళ్లదీసే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ట్రిపుల్ ఐటీ ప్రారంభంలో సరిపడా ఏర్పాట్లు చేసినప్పటికీ క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో కొరత ఏర్పడుతోంది. పీయూసీ రెండో ఏడాది పరీక్షా ఫలితాలు విడుదల కాకముందే ఇంజనీరింగ్ 2,3,4 సంవత్సరాల తరగతులు ప్రారంభం కాగా అందుబాటులో ఉన్న పాత పరుపులు, పడకలను సర్దుబాటు చేశారు. కానీ, డిసెంబర్ 14న సీట్లు కేటాయించిన 1,440 మంది ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు డిసెంబర్ 20 నుంచి ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం పరుపులు, పడకల కొనుగోళ్లకు టెండర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఆ ప్రయత్నం ప్రారంభం కాలేదు.ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గతంలో లాగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదు. 2008 నుంచి ఇప్పటి వరకు 13 బ్యాచ్‌లు బయటకు రాగా, 11 బ్యాచ్‌ల వరకు ఉన్నత విద్యా శాఖ విద్యార్థులకు ల్యాప్ టాప్‌లను సమకూర్చింది. రెండేళ్ల నుంచి ఇవ్వకపోవడంతో విద్యార్థులే తమ ల్యాప్ టాప్‌లు తెచ్చుకోవాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించే లక్ష్యానికి ట్రిపుల్ ఐటీ దూరమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్‌ను నియమించడంతో పాటు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Home to triple IT issues