డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై ఆశలు

Date:12/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

గ్రేటర్‌ పరిధిలోని నిరుపేదల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై ఆశలు చిగురిస్తున్నాయి. భారీగా వచ్చిన దరఖాస్తులపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ పథకాల కింద పెండింగ్‌ దరఖాస్తులను సైతం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. దరఖాస్తులన్నింటినీ వడపోసి మండలాల వారీగా పూర్తి వివరాలు, చిరునామాలతో సహా జాబితా రూపొందిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల కంటే ముందే దరఖాస్తులపై పూర్తి వివరాలతో సిద్ధంగా ఉంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందిన దరఖాస్తులను కేట గిరీల వారీగా వర్గీకరిస్తున్నారు.

 

 

 

 

మరోవైపు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం కొత్త దరఖాస్తుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ల కోసం అధికారికంగా ఎలాంటి దరఖాస్తులు ఆహ్వానించకపోయినా పేదలు పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో డబుల్‌ బెడ్‌రూమ్‌లపై వారి ఆశలు మరింత బలపడ్డాయి.హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే ఇప్పటి వరకు సుమారు నాలుగు లక్షల పేద కుటుంబాలు డబుల్‌ బెడ్‌రూమ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగర పరిధిలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో సైతం మరో మూడు నాలుగు లక్షల కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

 

 

 

ఇంకా  కొత్తగా దరఖాస్తుల పరంపర కొనసాగుతూనే ఉంది. కేవలం మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లోనే హైదరాబాద్‌ జిల్లా పరిధిలో మూడు లక్షల వరకు దరఖాస్తులు నమోదైనట్లు సమాచారం. పెండింగ్, ప్రజాప్రతినిధులు సిఫార్సులు చేసిన
దరఖాస్తులు కలిపి నాలుగు లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రెవెన్యూ యంత్రాంగం భారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్ర స్థాయి విచారణ కోసం ప్రాథమిక జాబితా రూపొందిస్తున్నట్లు సమాచారం.

 

 

ప్రభుత్వం మురికి వాడల్లో స్థల లభ్యతను బట్టి లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని లబ్ధిదారులందరికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేసి పోజిషియన్‌ సర్టిఫికెట్లను కూడా అందజేసింది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా, వివిధ కారణాలతో ఇళ్ల నిర్మాణం నెమ్మదిగా కొనసాగుతోంది.. ఇప్పటి వరకు కేవలం 612 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. మరో 23వేల ఇళ్లు తుది దశలో ఉన్నాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. లక్ష ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా
తర్వాత మరో లక్ష ఇళ్లను నిర్మించి స్వంత గూడు లేని వారికి అందించాలని నిర్ణయించిన విషయం విదితమే.

అమాంతం పెరిగిన  భూముల ధరలు

Tags:Hopes for double bedroom homes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *