ఎన్నిసార్లు తిరగాలి..?

Date:17/09/2018
కరీంనగర్ ముచ్చట్లు:
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం అలసత్వానికి.. అవినీతికి చిరునామాగా మారుతోంది.. విధుల్లో నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడేవారిపై కలెక్టర్ కొరడా ఝళిపిస్తున్నా పనుల్లో వేగం పెరగడం లేదు. ప్రతి అప్లికేషన్ కు కొర్రీలు పెట్టడం.. లంచాలిస్తేగాని పనులు చేయకపోవడం పరిపాటిగా మారింది. ఎలాంటి కారణాలు లేకుండా భూ సమస్యలను పెండింగ్‌లో పెట్టడం అధికారులకే చెల్లింది.
ఇక భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో వీఆర్‌ఏ, వీఆర్వో, గిర్దావర్‌, తహసీల్దార్‌ల విషయాల్లో ఫిర్యాదు రావడమే తరువాయి నిశిత పరిశీలనతో వారిపై వేటు వేస్తున్నారు. కొన్ని నెలల క్రితం వీణవంక తహసీల్దార్‌ను సీసీఎల్‌ఎకు సరెండర్‌ చేయగా ఇద్దరు వీఆర్‌ఓలను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జమ్మికుంట మండలం వావిలాల వీఆర్‌ఓ లక్ష్మణ్‌పై సస్పెన్షన్‌ వేటు వేయడంతో పాటు అనుమతి లేకుండా కార్యస్థలం నుంచి వెళ్లరాదని ఆదేశించారు. శంకరపట్నం వీఆర్‌ఓ దయాకర్‌, వీణవంక వీఆర్‌ఓ రవీందర్‌రెడ్డిలను నెలల వ్యవధిలో సస్పెండ్‌ చేశారు.
అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా జిల్లాలో వేల మంది అన్నదాతలు ప్రభుత్వ ఆర్థిక చేయూతకు దూరమయ్యారు. సుమారు 20వేల మందికి పైగా పాసుపుస్తకాలు రాకపోవడం, తప్పులు దొర్లడంతో రైతుబంధుకు నోచుకోలేదు. గతంలో అన్ని సక్రమంగా ఉన్నా ప్రక్షాళన తప్పులతో నానాపాట్లు పడుతున్నారు.
ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4వేల చొప్పున చెక్కులను అందించగా వేల ఎకరాలకు డబ్బులు రాలేదు. ఇకనైనా తప్పొప్పులను సవరించి చెక్కులను అందేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇక పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కులను పంపిణీ చేయాల్సి ఉండగా కరీంనగర్‌, హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్లలోని పలు మండలాల్లో అవినీతికి పాల్పడుతున్నారు. పాసుపుస్తకాలు వచ్చాయా రాలేదా.. కార్యాలయంలో అడిగితే గానీ తెలియని దుస్థితి రైతన్నది.
Tags:How many times can it go?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *