ఆర్టీసీ గట్టెక్కేది ఎలా

హైదరాబాద్ ముచ్చట్లు:

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా పీఆర్సీ సంబురంలో ఉంటే.. అసలే వేతనాలు రాక ఆర్టీసీ కార్మికులు ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. వేతన సవరణ సంతోషంలో ఉద్యోగులు పాలాభిషేకాలు చేస్తున్నారు. కానీ వేతనాల రాక.. నెలలో సగం రోజులు గడిచినా చేతిలో చిల్లిగవ్వ లేక ఆర్టీసీ కార్మికులు ముఖాలు చూసుకుంటున్నారు. జీతాలు ఎప్పుడు పడుతాయో తెలియక ఖాతాలను తనిఖీ చేసుకుంటున్నారు. ఇంటి అద్దెలు చెల్లించక, నిత్యావసర సరుకులు లేక దినదినగండంగా వారి బతుకు మారింది. జూన్ 16 వచ్చినా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇంకా జమ కాలేదు. మొన్నటిదాకా లాక్‌డౌన్‌తో ఆర్టీసీ ఆదాయం కూడా పడిపోయింది. దీంతో ఇప్పుడు వేతనాలు ఇచ్చేందుకు సర్కారు సాయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.రాష్ట్రంలో మొన్నటి వరకు లాక్‌డౌన్కొనసాగినా ఆర్టీసీ కార్మికులు మాత్రం యధాతథంగా విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ లాక్‌డౌన్నిబంధనలు వర్తించినా వేతనాలు మాత్రం నెల ప్రారంభంలోనే జమ అయ్యాయి. కేవలం ఆర్టీసీ కార్మికులు మినహా అందరికీ వేతనాలు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వేతన సవరణ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్టీసీ కార్మికులకు మినహా అందరికీ 30 శాతం వేతనాలు పెరిగాయి.

ఆర్టీసీ కార్మికులకు మాత్రం రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయి. వాస్తవంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు కూడా వేతనాలు పెరుగుతాయని ప్రకటించారు. కానీ, దీనిపై ఎక్కడా క్లారిటీ లేదు. ప్రస్తుతం వేతనాల పెంపు పక్కనపెడితే ఇవ్వాల్సిన జీతాలే ఇవ్వడం లేదు. లాక్‌డౌన్‌తో ఆర్టీసీ ఆదాయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు.ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల వేతనాల, మెడికల్ బిల్లులు, ఇతర అత్యవసర ఖర్చుల కోసం రూ. 118.87 కోట్లు అవసరమున్నాయి. డ్రైవర్లకు రూ. 34.85 కోట్లు, కండక్టర్లకు రూ. 36.56 కోట్లు, మేనేజర్లకు రూ. 2.11 కోట్లు, మెడికల్ బిల్లులు రూ. 83 లక్షలతో పాటుగా మెయింటెనెన్స్, ఆపరేషన్స్ కోసం మొత్తం రూ. 118.87 కోట్లు అవసరమున్నాయి. ఈ నిధులు సర్దుబాటు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.కరోనా కష్టాలు ఆర్టీసీని వీడటం లేదు. సెకండ్వేవ్‌లో వేతన తిప్పలు మరింత ఎక్కువవుతున్నాయి. నాలుగు నెలల నుంచి కొంత గాడిన పడిందనుకున్న తరుణంలో సెకండ్వేవ్‌తో మళ్లీ మొదటికొచ్చింది. రెండు నెలల వరకు ప్రతిరోజు ఆర్టీసీ ఆదాయం రూ.13 కోట్లుగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు కేవలం రూ. రెండు కోట్లు కూడా దాటడం లేదు. మొన్నటి వరకు లక్షల్లోనే ఆదాయం ఉండగా.. ఈ నాలుగైదు రోజుల నుంచి రూ. 2 కోట్లకు చేరుతోంది. అటు రోజువారీ ఖర్చులు తగ్గడం లేదు.

అంతరాష్ట్ర సర్వీసులన్నీ ఆపేశారు. గ్రేటర్లో 800 బస్సుల వరకు తిప్పుతున్నా వచ్చే ఆదాయం డీజిల్‌కు సరిపోని పరిస్థితుల్లోనే నెట్టుకువస్తున్నారు. దీంతో ఇప్పుడు కార్మికులకు చెల్లించాల్సిన జీతాలపై మళ్లీ ఎఫెక్ట్ పడింది. 16వ తేదీ వచ్చినా ఇంకా జీతాలు అందక కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు కూడా కార్మికుల్లో ఎక్కువవుతున్నాయి. అటు జీతాలు పడక, వైద్య సదుపాయం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు.ప్రస్తుతం వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం చేతిలో చిల్లిగవ్వ లేదు. రెండు, మూడు కోట్లు ఉన్నా అవి ఏ మూలకు సరిపోవు. ఇలాంటి స్థితిలో మళ్లీ ప్రభుత్వ సాయం కోసం చూడాల్సి వస్తోంది. గతంలో వేతనాల కోసం ప్రభుత్వం అప్పుడో, ఇప్పుడో రూ. 100 కోట్లు సాయం చేసేది. కానీ, ఈసారి రూ. 118 కోట్లు కచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే ఆర్టీసీ ఖాతాల్లో నగదు లేదు. ఇప్పుడు సర్కారు సాయం చేస్తేనే వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల పలు అవసరాల కోసం రూ. 1000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా ఇంకా చేతికి అందలేదు. ప్రస్తుతం ఆ లోన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉన్నా… జీతాలు ఎలా జమ చేయాలనేది ఆందోళనకరంగా మారింది. అయితే, కొన్ని పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం డిపోల వారీగా కార్మికులకు వేతనాలను అడ్జస్ట్ చేస్తోంది. ఒక డిపోకు ముందు, మరో డిపోకు తర్వాత రోజున అడ్జెస్ట్చేసింది. ప్రస్తుతం రెండు, మూడు కోట్లు చేతిలో ఉన్నా.. వాటిని ఎలా అడ్జెస్ట్చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:How RTC Gattekedi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *