సిటీకి మరో   మాస్టర్ ప్లాన్  జలాశయాలకు మహర్దశ

 Date:11/02/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
“హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్ కు వలస వస్తున్నారు. నగరంలోని వాతావరణం, సామరస్య పూర్వక జీవనం, మంచి పారిశ్రామిక విధానం ఫలితంగా పెద్ద ఎత్తున ఐటి కంపెనీలు, పరిశ్రమలు తరలి రావడంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. హోటల్, నిర్మాణ రంగంలో కూడా ఎంతో మందికి ఉపాధి దొరుకుతున్నది.ఈ కారణాల వల్ల ప్రతీ ఏటా ఐదారు లక్షల జనాభా హైదరాబాద్ కు జత కలుస్తున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, దేశ నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడుతున్నారు. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా నిత్యం హైదరాబాద్ నగరానికి వచ్చి పోయే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతీ ఏటా రెండు కోట్లకు పైగా ప్రయాణికులు వచ్చిపోతున్నారు.. నిజంగా హైదరాబాద్ ఒకప్పుడు స్వర్గంగానే ఉండేది. హైదరాబాద్ నగరమంటేనే ముత్యాలు, సరస్సులు, ఉద్యానవనాలతో నిండి ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. కానీ రానురాను పరిస్థితి మారిపోయింది. మూసీ నదిని మురికి ప్రాయం చేశారు.నగరంలో కాలుష్యం పెరిగిపోతున్నది.
ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. పచ్చదనం తగ్గిపోయింది. రానున్న కాలంలో జనాభా మరింత పెరిగి, పరిస్థితి చేయిదాటిపోతుంది. జీవనం దుర్భరంగా మారుతుంది. కాబట్టి మనమంతా ఇప్పుడే మేల్కొనాలి. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి, దానికి తగినట్లు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలి. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి, అమలు చేయాలి” అని ముఖ్యమంత్రి అన్నారు.“హైదరాబాద్ ఇప్పుడెలా ఉంది? జనాభా ఎంత ఉంది? రోడ్లెలా ఉన్నాయి? ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సీవరేజి పరిస్థితి ఏమిటి? గ్రీన్ కవర్ పరిస్థితి ఏమిటి? వాహనాలు ఎన్ని ఉన్నాయి? రవాణా వ్యవస్థ ఎలా ఉంది? విద్యుత్ సరఫరా పరిస్థితి ఏమిటి? అనే దానిపై నిర్ధారణకు రావాలి. పదేళ్ల తర్వాత హైదరాబాద్ ఎలా ఉండబోతుందో శాస్త్రీయంగా అంచనా వేయాలి. దానికి తగినట్లు ఏమి చేయాలనే దానిపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.ఢిల్లీ, బెంగులూరు లాంటి నగరాలే కాదు, చైనా రాజధాని బీజింగ్ లాంటి నగరాలు కూడా జనజీవనానికి ఇప్పుడు అనువుగా లేవు. ఢిల్లీ కాలుష్య వలయంలో చిక్కుకుంది. బెంగులూరులో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. మన కళ్ల ముందే నగరాలు ఆగమయిపోతున్నాయి.
ఈ క్షణానికి హైదరాబాద్ పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పటికి ప్పుడు మేల్కొని సరైన విధంగా సన్నద్ధం కాకుంటే ఈ నగరం పరిస్థితి కూడా విషమిస్తుంది.మనిషి జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి మనుషులు సౌకర్యంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి, అమలు చేయాల్సిన తక్షణ అవసరం ఉంది” అని సిఎం చెప్పారు.“హైదరాబాద్ నగరం లోపలా, బయటా పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉంది. హెచ్‌ఎండిఏ పరిధిలోని భూభాగం చాలా పెద్దగా ఉండడంతో మొత్తం భూభాగాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. వ్యవసాయ క్షేత్రాలను ఓపెన్ ప్లేసులుగా పరిగణించి, మిగతా చోట్ల ఇష్టారీతిన భవనాలకు, నిర్మాణాలకు అనుమతులిస్తారు. దీంతో ప్రధాన నగరంలో పచ్చదనం కరువవుతున్నది.ఇదే పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగితే నగరంలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. కాబట్టి అనుమతుల విషయంలో నియంత్రణ ఉండాలి. పర్యావరణ పరిర క్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నింటినీ ప్రధాన నగరం అవతలికి తరలించాలి. మూత పడిన పరిశ్రమల భూముల్లో పార్కులు ఏర్పాటు చేయాలి.
నగరంలో ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ పచ్చదనం పెంచాలి. లక్షా 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ బ్లాకుల్లో అడవిని పునరుద్ధరించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.  “హైదరాబాద్ నగరాన్ని మూడు భాగాలుగా విభజించి, ప్రణాళిక రూపొందించాలి. ఓఆర్‌ఆర్ లోపలున్న నగరం… ఓఆర్‌ఆర్ అవతలి నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగు రిడ్డు వరకుండే నగరం.. ఆర్‌ఆర్‌ఆర్ అవతల మరో ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించే నగరం.. ఇలా మూడు భాగాలుగా విభజించుకుని మంచినీరు, డ్రైనేజి, సీవరేజి, ట్రాఫిక్, రవాణా, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అంచనా వేయాలి.భవిష్యత్తులో ఎక్కడ ఏమి చేయాలో నిర్ణయించాలి. ఎడ్యుకేషన్ సిటీ, స్పోరట్స్ సిటీ, సినిమా సిటీ, హెల్త్ సిటీ… ఇలా దేనికి అది ప్రత్యేకంగా ఉండేలా ప్రాంతాలను గుర్తించాలి. దాని ప్రకారమే అనుమతులు ఇవ్వాలి. ఏ భూభాగాన్ని ఎందుకోసం కేటాయించామో అందుకే వినియోగించాలి. మాస్టర్ ప్లాన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించడానికి వీల్లేదు. మాస్టర్ ప్లాన్ లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే దానికి మంత్రివర్గం అనుమతిని తప్పనిసరి చేస్తూ చట్టం తెస్తాం” అని ముఖ్యమంత్రి అన్నారు.“నగరాలకు వలసలను ఆపలేం. హైదరాబాద్ లాంటి అనేక అనుకూలతలున్న నగరానికి వలసలు మరింత ఎక్కువ కాకతప్పదు.
పెరిగే జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ అవసరాల కోసం సన్నద్ధం చేయడమొక్కడే మనముందున్న మార్గం. మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఆస్కీకి ఆ పని అప్పగిస్తాం. వారు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థలను కన్సల్టెన్సీలుగా నియమించుకోవాలి.వారికి అవసరమైన మౌలిక సమాచారాన్ని ఇవ్వాలి. మూడు నెలల్లో నగరానికి మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయడం కేవలం హెచ్‌ఎండిఏకి సాధ్యం కాదు. కాబట్టి మరికొన్ని ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలి.ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు అవసరమైన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది” అని ముఖ్యమంత్రి వివరించారు.నగర ప్రజలకు మంచినీరు అందించడానికి కేశవాపూర్ లో నిర్మించతలపెట్టిన మంచినీటి రిజర్వాయర్ కు ఈ నెలలోనే శంకుస్థాపన చేసి, శరవేగంగా పూర్తి చేయనున్నట్లు సిఎం వెల్లడించారు. మెట్రోరైలును ఎయిర్ పోర్టు వరకు విస్తరిస్తామన్నారు.
Tags:Another master plan for the city Excellence of reservoirs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *