Lakh crossing corona cases

తెలంగాణలో కరోనా పాలిటిక్స్

Date:14/07/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

కరోనా కల్లోలంపై, కాంగ్రెస్‌ కయ్‌మంటోంది. కమలం కూడా ఘాటైన విమర్శలతో సుర్రుమంటోంది. మొదటి నుంచి బీజేపీ దూకుడు అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్‌ ఒక్కసారిగా గేరు మార్చి, వన్‌ ఎయ్‌టీ స్పీడ్‌తో రయ్‌మంటోంది. కాంగ్రెస్‌‌లో ఎన్నడూలేనంతగా కనిపిస్తున్న ఈ దూకుడు వెనక, టీఆర్ఎస్‌ వ్యూహముందా?….ఏంటీ సౌండ్‌ కొత్తగా వుందా? కాంగ్రెస్‌ నిరసనల వెనక గులాబీదళం స్ట్రాటజీ ఏంటని అవాక్కవుతున్నారా…? ఇందులో నిజమెంతో తెలీదు కానీ, పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ చర్చ మాత్రం జరుగుతోంది. ఇలాంటి చర్చ ఎందుకొస్తోంది? టీఆర్ఎస్‌కు ఆ అవసరమేంటి?  శత్రువుకి, శత్రువు, మిత్రుడనే నానుడిని తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పక్కాగా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ విషయంలో గులాబీదళం, ఇలాంటి స్ట్రాటజీకి పదునుపెట్టినట్టు చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో వున్నామన్న అడ్వాంటేజీతో, తెలంగాణలో దూకుడుపెంచాలని భావిస్తోంది కమలం. రాష్ట్ర బీజేపీ నాయకత్వమే కాదు, జాతీయ నాయకత్వమూ రంగంలోకి దిగడమే అందుకు నిదర్శనం. కరోనా టెస్టుల విషయంలో రాష్ట్ర, జాతీయ కమలనేతలు టీఆర్ఎస్‌‌కు ఊపిరాడకుండా ఏకధాటిగా ఆరోపణలు చేస్తున్నారు. వరుసగా వర్చువల్ ర్యాలీలతో, టీఆర్‌ఎస్‌ సర్కారును డ్యామేజ్ చేసేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు.

 

 

దీంతో కమలం దాడి నుంచి తప్పించుకోవడానికి సరికొత్త వ్యూహానికి సానపెట్టింది గులాబీదళం. బీజేపీ ఎదరుదాడిని తప్పించుకోవడానికి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీకి, టిఆర్ఎస్ అవకాశమిచ్చినట్లు చర్చ సాగుతోంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నేతలు ఎక్కడ మీటింగ్‌లు పెట్టినా, నిరసనలు చేసినా, అడ్డుకుంది ప్రభుత్వం. కానీ తాజాగా కరోనాపై కాంగ్రెస్‌ చేపడుతున్న నిరసనలు, ధర్నాలను మాత్రం చూసీచూడనట్టు వదిలేస్తోందన్న మాటలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ ఆందోళనా కార్యక్రమాలకు, ఎక్కడా అధికారులు ఆటంకం కల్గించడంలేదన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలకు, జనంలో హైప్ వచ్చే విధంగా, నిరసనల్లో కాంగ్రెస్సే దూకుడుగా వుందన్న అభిప్రాయం వచ్చేలా, అధికార పార్టీ స్ట్రాటజిక్‌గా ముందుకెళ్తోందన్న మాటలు వినపడుతున్నాయి. కరోనా విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్సే మేలు అని టిఆర్ఎస్ భావిస్తున్నట్లు ఉంది. కేంద్రంలో ఉన్న బిజేపిని ఎదుర్కోవడం కంటే, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌తో ఫైట్ చెయ్యడం, చాలా ఈజీ అని ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోంది. అందుకే ఎక్కడా అధికార పార్టీ నేతలు, మంత్రులు సైతం బీజేపీ విమర్శలపై పెద్దగా స్పందించకుండా, స్ట్రాటజిక్‌ సైలెన్స్‌ మెయిన్‌టైన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్‌పైనే ఘాటుగా స్పందించి, పరోక్షంగా బీజేపీని సైడ్‌ చేస్తున్నట్టు కనపడుతోంది.

 

 

అంటే తమకు ప్రత్యర్థిపక్షం కాంగ్రెస్సే కానీ, బీజేపీ కానే కాదన్న సిగ్నల్స్‌ ఇస్తూ, కాషాయాన్ని తక్కువ చెయ్యాలన్న వ్యూహం అప్లై చేస్తోంది గులాబీదళం.బీజేపీ విమర్శలకు నేరుగా స్పందిస్తే, ఆ పార్టీని హైలెట్‌ చేసినట్టు వుంటుంది. రాష్ట్రంలో గులాబీ వర్సెస్ కమలంగా ఫోకస్‌ పడుతుంది. కాషాయ దూకుడుకు మరింత ఇంధనం ఇచ్చినట్టు అవుతుంది. అలాకాకుండా, అసలు బీజేపీనే ఇగ్నోర్ చేస్తే, ఆ సమస్యే వుండదన్న స్ట్రాటజీ టీఆర్ఎస్‌ది. కాంగ్రెస్‌ ఎంత దూకుడుగా కనిపించినా, ఎన్నికల్లో ఆ పార్టీని వెనక్కినెట్టడం చాలా సులభమన్నది తెలంగాణ భవన్‌ ధీమా. అందుకే కేంద్రం నుంచి వచ్చే ఒత్తడిని తప్పించుకోవడానికి, వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌ లిఫ్టు ఇచ్చిందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తోంది. గులాబీ వ్యూహం అర్థమైందో లేదో కానీ, కరోనా నిరసనల్లో, బీజేపీ కంటే తామే ముందున్నామన్న జోష్‌లో వుంది కాంగ్రెస్. తాము ఈ రేంజ్‌లో చెలరేగిపోతుంటే, టీఆర్ఎస్‌ మాత్రం తమకు స్పందించకుండా, కాంగ్రెస్‌కే ప్రతిస్పందిస్తోందని లోలోపల ఉడుకుతోంది కమలం. అదే కదా గులాబీ వ్యూహం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కరోనా బండ పడింది

Tags: Corona politics in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *