నిజామాబాద్ లో వందల మంది రైతుల నామినేషన్లు

Date:25/03/2019
నిజామాబాద్ ముచ్చట్లు:
పసుపు, ఎర్రజొన్న, చెరకు పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ రైతులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో తమ సమస్యను జాతీయం చేసేందుకు నిజామాబాద్ ఎంపీ స్థానానికి వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సోమవారం నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ కావడంతో రైతులు నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నామినేషన్ పత్రాలతో బారులు తీరారు. నిజామాబాద్‌ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న సాగు చేసే రైతులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా పసుపు సాగు చేసే రైతులు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోనే ఎక్కువగా ఉన్నారు. వీరంతా తాము సాగు చేసిన పసుపు, ఎర్రజొన్న పంటలకు సరిపడా గిట్టుబాటు ధర రావడం లేదంటూ గత కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వాల నుంచి సరైన స్పందన రావడం లేదని తమ సమస్యను జాతీయ స్థాయిలో ప్రతిబింబించాలనుకున్నారు. అందుకోసం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ప్రతి గ్రామం నుంచి ఐదుగురు చొప్పున నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 1000 మంది రైతులు నామినేషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు 50మందికి పైగా నామినేషన్ల వేయగా వందలాది మంది సోమవారం నామినేషన్ పత్రాలతో నిజామాబాద్ కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఇక్కడ కనీసం 500 నామినేషన్ల దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో కలెక్టరేట్ వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. రైతులు తీసుకున్న నిర్ణయంతో టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. ఇక్కడి నుంచి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తుండటంతో ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రైతుల చర్యలతో ఏకంగా ఎన్నికే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుండటంతో అధికార పార్టీ ఆందోళన చెందుతోంది.
Tags:Hundreds of farmers nominations in Nizamabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *