హైదరాబాద్ ఐటీ కంపెనీలు ప్రారంభం, కండిషన్స్ అప్లై! కంపెనీ-ఉద్యోగులు పాటించాల్సిన రూల్స్..

Date:10/05/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు క్రమంగా తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. కరోనా మహమ్మారి-లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఉద్యోగులు. ఇప్పుడు క్రమంగా సడలింపులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఐటీ కంపెనీలు ఒక్కసారే అందరు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించవద్దని, విడతలవారీగా అమలు చేయాలని, తొలుత 33 శాతం ఉద్యోగులతో ఆఫీస్‌లో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చునని పోలీసులు సూచించారు.

ఆఫీస్‌లు తెరుచుకొని.. ఇవి పాటించండి
IT/ITES కంపెనీలు క్రమంగా ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించాలని, అన్ని షిఫ్ట్‌లలో కూడా సిబ్బంది 33 శాతానికి మించవద్దని పోలీసులు సూచించారు. రాత్రి పూట పని చేసేందుకు అనుమతి లేదన్నారు. అలాగే సమయ పాలన పాటించాలని సూచించారు. ఉదయం 7 నుండి 10 గంటల మధ్య లాగిన్ అవ్వాలని, సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల మధ్య లాగవుట్ కావాలన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల మధ్య ఆఫీస్‌లకు వెళ్లడాలు, ఇంటికి రావడాలు వద్దని సూచించారు.

కంపెనీ అధికారిక లెటర్ దగ్గర ఉంచుకోవాలి
శనివారం నాడు ఐటీ కంపెనీలకు చెందిన ASCSC, HYSEA, NASSCOM ప్రతినిధులు, ఐటీ కంపెనీల యాజమాన్యాలతో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గైడ్ లైన్స్ విడుదల చేశారు. దీని ప్రకారం… ప్రతి ఉద్యోగి కూడా కంపెనీ అధికారిక లెటర్‌ను దగ్గర ఉంచుకోవాలి. ఐడీ కార్డు కూడా దగ్గర ఉంచుకోవాలి. కంపెనీల్లో క్యాంటిన్లు తెరువకూడదు. ప్రతి కంపెనీలో శానిటైజైషన్, మాస్కులు తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగులు సామాజిక దూరం పాటించాలి.

బస్సులు ఎంగేజ్ చేసుకోవచ్చు
సామాజిక దూరం నిబంధనలను అనుసరించి రోడ్ల పైన వ్యక్తిగత వాహనాలను తగ్గించే లక్ష్యంలో భాగంగా కంపెనీ బస్సులను ఎంగేజ్ చేసుకోవచ్చు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. పరిశుభ్రత పాటించాలి. తరుచూ చేతులు కడుక్కోవాలి. అన్ని రకాల ఆరోగ్య, భద్రత, పరిశుభ్రచర్యలు కంపెనీ తీసుకోవాలి. బస్సులు, క్యాబ్స్‌లలో సామాజిక దూరం పాటించాలి. కంపెనీ బయట గుంపులుగా ఉండకూడదు.

ప్రయాణంపై ఆంక్షలు
క్యాబ్, కారులో డ్రైవర్ సహా కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి. ద్విచక్ర వాహనంపై ఒకరికి మించి అనుమతి లేదు. కంపెనీకి చెందిన బస్సులు కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపవచ్చు. రోడ్డుపై వీధి వ్యాపారులను, ఇతర కార్యకలాపాలను ప్రోత్సహించేలా గుంపులు గుంపులుగా చేరవద్దు. క్యాంపస్ వెలువల ఉద్యోగులు గుంపులుగా చేరవద్దు. తదుపరి నోటీసులు వచ్చే వరకు క్యాంటిన్‌కు అనుమతి లేదు.

1500 కంపెనీల్లో లక్షలాది మంది ఉద్యోగులు
2018-19 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీలో 1500 కంపెనీల్లో 5.43 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఏటా 1.09 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఎగుమతులు నమోదు చేస్తున్నాయి.

ఆంక్షలు క్లుప్తంగా..
– ఉద్యోగులు ఉదయం గం.7 నుండి గం.10 మధ్య, సాయంత్రం గం.3 నుండి గం.6 మధ్య లాగిన్ లేదా లాగౌట్ కావాలి.
– 33 శాతం ఉద్యోగులతోనే కంపెనీ ఆఫీస్ తెరవాలి. మిగతా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి.
– ఉద్యోగులకు, క్యాబ్ డ్రైవర్లకు అధికారిక లేఖలు ఇవ్వాలి. ఉద్యోగులు ఐడీ కార్డు తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలి.
– ప్రభుత్వాలు సూచించే ఆరోగ్యపరమైన సూచనలు కచ్చితంగా పాటించాలి. సామాజిక దూరం, మాస్కులు వంటివి తప్పనిసరి.
– ఉద్యోగులు ఒకేచోట గుమికూడకుండా కంపెనీ చర్యలు చేపట్టాలి

సోమవారం మధ్యాహ్నం సీఎంలతో మరోసారి చర్చించనున్న మోదీ 

Tags: Hyderabad IT Companies Start, Conditions Apply! Rules for Company-Employees to Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *