Natyam ad

హైదరాబాద్ కా… ఢిల్లీకా…జానా…కిం కర్తవ్యం

నల్గోండ ముచ్చట్లు:

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా? పార్లమెంట్ బరిలో నిలవాలా? అనే సందిగ్ధంలో ఉన్నారని తెలుస్తోంది. రోజుకో రకంగా కామెంట్స్ చేస్తున్న ఆయన… తాజాగా నల్గొండ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని అంటున్నారు.తెలంగాణ కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ నేత కుందూరు జానారెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్  నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ప్రస్తుతం మాజీ. రానున్నతెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేయాలా? లేక తన వారసుడ్ని రాజకీయ అరంగేట్రం చేయించాలా అన్న విషయంలో ఇంకా డైలమాలోనే ఉన్నారని దగ్గరి అనుచరులు చెబుతున్నారు. ఒకసారి తాను పోటీ చేయడం లేదని.. మరో సారి పార్టీ ఆదేశిస్తే తానే బరిలోకి దిగుతానని, టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే స్థాయి తనది కాదని.. ఇప్పుడు తాజాగా, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని, తన స్థానంలో తన తనయుడు పోటీలో ఉంటారని ఇలా.. పలు రకాల స్టేట్ మెంట్స్ ఇచ్చి కేడర్ లో అయోమయం కలిగించారు.నాగార్జున సాగర్ నియోజకవర్గం ఒక విధంగా జానారెడ్డికి కంచుకోట. ఆయన టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి రికార్డు విజయాలు సాధించారు.

 

 

 

Post Midle

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లోనూ ఆయనే గెలుపొంది తెలంగాణ తొలి ప్రతిపక్ష నేతగా పనిచేశారు. కానీ, 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ.. దివంగత నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ చేతిలోనూ ఓటమి పాలయ్యారు. కాగా, మరో రెండు నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేస్తారా ? చేయరా ? అన్న సంశయం కార్యకర్తల్లో వచ్చింది. టీపీసీసీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 130 దరఖాస్తులు టీపీసీసీకి అందినా.. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి దరఖాస్తు చేసుకోలేదు. ఇక్కడి నుంచి ఆయన రెండో తనయుడు కుందూరు జయవీర్ రెడ్డి ఒక్కరే దరఖాస్తు చేశారు. దీంతో జానారెడ్డి పోటీ చేయరన్న ప్రచారం జరిగింది. కానీ, కొద్ది రోజుల కిందట తానే పోటీలో ఉంటానని ప్రకటించి మరోసారి చర్చకు తెరలేపారు.జానారెడ్డి పెద్ద కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి ముందు నుంచీ మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు.

 

 

 

ఒకే ఇంటిలో రెండు టికెట్ల అంశం వివాదాస్పదం కాగా, ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకు అర్హత ఉంటే రెండు టికెట్లు ఇవ్వడానికి వీలవుతుందని సమాధాన పడినా.. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బి.ఎల్.ఆర్)తో తీవ్రమైన పోటీ ఉంది. అటు నాగార్జున సాగర్ లో చిన్న కొడుకుకు, మిర్యాలగూడలో పెద్ద కొడుకుకు టికెట్లు సంపాదించేందుకు జానారెడ్డి దిల్లీ గడప తొక్కారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి టికెట్ అంశాన్ని ముందుపెట్టారు. ఇద్దరు కొడుకుల్లో ఎవరికి టికెట్ దక్కుతుందో? లేదా ఇద్దరికీ దక్కుతుందో ఇంకా తేలక ముందే జానారెడ్డి మరో కొత్త ప్రకటన చేశారు.అసెంబ్లీ ఎన్నికల టికెట్ల లొల్లి ఇంకా ఓ కొలిక్కి రానేలేదు. మరో వైపు జానారెడ్డి అపుడే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఇదే అంశాన్ని ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వివరించారని సమాచారం. వాస్తవానికి ముందు నుంచీ జరిగిన ప్రచారం ప్రకారం..

 

 

నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి పోటీ చేస్తారని, మిర్యాలగూడ నుంచి టికెట్ ఆశిస్తున్న రఘువీర్ రెడ్డిని పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసేలా ఒప్పించే పనిలో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థుల రేసులో హైకమాండ్ వద్ద కేవలం రఘువీర్ రెడ్డి, బి.ఎల్.ఆర్ పేర్లే పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. మిర్యాలగూడ టికెట్ కావాలని 18 మంది దరఖాస్తు చేసుకోగా వడబోత అనంతం ఇద్దరి పేర్లు జాతీయ నాయకత్వం పరిశీలనకు వెళ్లాయి. మరి నాగార్జున సాగర్ లో తన తనయుడు పోటీ చేస్తాడని, తాను ఎంపీ అభ్యర్థిగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని జానారెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంటే రెండు చోట్లా తన ఇద్దరు కుమారులకు అసెంబ్లీ టికెట్లు, తనకు పార్లమెంటు టికెట్ కావాలని జానా కోరుతున్నారా? మరి ఇతర పోటీదారులు, ముందు నుంచీ పార్టీ కోసం పనిచేసిన వారేం కావాలన్న ప్రశ్నలు వస్తున్నాయి.

 

Tags: Hyderabad ka… Delhi ka… Jana… Kim duty

Post Midle