హైద్రాబాద్ ట్రాఫిక్ చేజింగ్ ఓ పరీక్ష

Hydrabad Traffic Chasing A Test

Hydrabad Traffic Chasing A Test

Date:24/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
భాగ్యనగరం అనగానే ఇదొక సౌభాగ్య నగరం అనుకుని భ్రమపడుతుంటారు. పల్లెటూళ్లలో ప్రశాంతమైన జీవితాన్ని వదులుకుని పొట్ట చేతపట్టుకుని ఇక్కడికి వస్తుంటారు. కానీ భాగ్యనగర భాగోతం రోడ్డెక్కాక తెలుస్తుంది. కనుచూపు మేరళ్లో అంతా ట్రాఫిక్ మయమే. పొగలు కక్కుతున్న వాహనాలు, కాలుష్యంతో నిండిన రోడ్లు, కాలు కదిపే జాగ ఉండదు. భాగ్యనగరంలో సగటు మనిషి రోడ్డుమీదకు రావాలంటే.. వామ్మో రోడ్డుమీదకా అంటూ హడలి పోతున్నాడు. ఇక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రికి పోయి ప్రాణాలు దక్కించుకుందామనుకుని అంబులెన్స్‌లో రోడ్డెక్కిన వాళ్ల పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. రోగి ప్రాణాలతో పోరాడుతుంటే.. ట్రాఫిక్ కారణంగా అంబులెన్స్ ముందుకు కదలలేని పరిస్థితి. సైరన్ మోగినా సైడు దొరకదు. కనిచూపు మేరళ్లో అంతా ట్రాఫిక్. పూర్తిగా చక్రబంధంలో ఇరుక్కుపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే ట్రాఫిక్‌ను దాటుకుని ఆసుపత్రికి చేరేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటే నమ్మండి. ఒకరిద్దరు మానవత్వంతో అంబులెన్స్‌కు దారిద్దామంటే కూడా సాధ్యం కావడం లేదు.
ఇలా మనకు తెలియకుండానే ఒక వ్యక్తి ప్రాణాలను హరిస్తున్నాం. హైదరాబాద్ నగర నలుమూలలా అంబులెన్స్‌లకు ట్రాఫిక్ చేజింగ్ ఓ పరీక్షగా తయారైంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న రోడ్ల మీద అయితే కాస్త పరవాలేదు కానీ.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడళ్లలో అయితే నలువైపుల నుంచి వాహనాలు ఇష్టారాజ్యంగా వస్తుంటాయి. ఆ రోడ్డులో అంబులెన్స్ వెళ్లాలంటే తీవృ ఇబ్బందులు తప్పవు. వాహనదారులను తప్పించుకనేందుకు అంబులెన్స్ డ్రైవర్లు తీవ్రంగా శ్రమిస్తుంటారు. సైరన్ చప్పుడుకే సెగ పుట్టించే హారన్ శబ్ధాలు పేషెంట్‌కు చావు గంటల్లా వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటుకుని ఆసుపత్రికి చేరితే.. అరగంట ముందు తీసుకొచ్చి ఉంటే ప్రాణాలు దక్కేవి అని డాక్టర్ చెబుతుంటారు. ఆ సమయంలో తప్పు ఎవరిది అనాలో తెలియని పరిస్థితి. వాస్తవానికి అంబులెన్స్‌కు దారివ్వాలనే ఇంకిత జ్ఞానాన్ని కూడా కొంతమంది మర్చిపోతున్నారు. విదేశాల్లో అంబులెన్స్‌కు ప్రత్యేక రహదారులుంటాయి. అంబులెన్స్ వస్తుంటే వీఐపీలు సైతం పక్కకు తప్పుకుంటారు. కానీ మన హైదరాబాద్‌లో అంబులెన్స్‌లో రోగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా.. అంబులెన్స్ శబ్దం వినిపిస్తున్నా..పక్కకు జరగడం లేదు.
అంబులెన్స్ కంటే తాము ముందు వెళ్ళాలని చాలా మంది అతివేగంతో పరుగులు పెడుతుంటారు. ఇలా వ్యవహరించడంతో అంబులెన్స్‌లు సకాలంలో ఆసుపత్రులకు చేరలేక అనేకమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఏదిఏమైనా ఇప్పటికైనా కొందరిలోనైనా మర్పు వస్తే కొంత మంది ప్రాణాలైన కాపాడవచ్చు.ఆపదలో ఒక వ్యక్తిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు సాటి మనిషిగా మానవతా దృక్పథంతో అందరూ దారి ఇస్తారు. కానీ ఈ అవకాశాన్ని కొందరు అంబులెన్స్ డ్రైవర్లు అవకాశంగా చేసుకుని ఎమర్జెన్సీ లేకపోయినా, లోపల పేషెంట్ లేకుండానే ఎమర్జెన్సీ సైరన్ కొడుతూ జనాల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. తీరా అంబులెన్స్‌కు దారి వదిలాక చూస్తే లోపల పేషెంట్ ఎవ్వరూ ఉండరు. దీంతో వారిపై కొంత అసంతృప్తి కలుగుతుంది. అంబులెన్స్ నడిపే డ్రైవర్లు కూడా ఎమర్జెన్సీ లేనప్పుడు అందరిలాగే వెళితే బాగుంటుంది.
Tags:Hydrabad Traffic Chasing A Test

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *