Natyam ad

వీరప్పన్ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతూనే షాక్ తిన్నాను-ఎస్.నగేష్, ఓఎస్డీ టీటీడీ ప్రజాసంబంధాల విభాగం

– ఆ ఇంట్లో కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు
– నులక మంచం మీద కూర్చునే ముత్తులక్ష్మి గారి ఇంటర్వ్యూ చేశాను
– పుష్ప సినిమా చూస్తున్నంత సేపు వీరప్పన్ గురించి ఆయన భార్య చెప్పిన విషయాలే గుర్తుకు వచ్చాయి.
 
తిరుపతి ముచ్చట్లు:
వీరప్పన్. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలను, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన అడవి దొంగ. ఈ రెండు రాష్ట్రాల్లో విస్తరించిన సత్యమంగళం అడవిలో శ్రీగంధం చెట్లు నరికి స్మగ్లింగ్ చేయడం, ఏనుగులను చంపి వాటి దంతాలను అక్రమ రవాణా చేసిన వ్యక్తి. కోట్ల రూపాయలు సంపాదించి కుటుంబం విలాసవంతంగా బతికే ఏర్పాటు చేసి ఉంటాడు. ఇలాంటి వ్యక్తి ఇల్లు ఎంత విలాసంగా ఉంటుందో అనుకుని ఆ ఇంటి ఆవరణ లోకి అడుగుపెట్టిన నాకు ఒక్క సారిగా ఆశ్చర్యం కలిగింది.ఆ ఇంట్లో కూర్చోవడానికి సరైన కుర్చీలు లేవు. దిగువ మధ్యతరగతికి కింద ఆ కుటుంబం జీవిస్తోందని నాకు అర్థం అయ్యింది. వీరప్పన్ భార్య శ్రీమతి ముత్తులక్ష్మి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన సందర్భంగా నా కంటికి కనిపించిన పరిస్థితి ఆ కుటుంబం ఎలా జీవిస్తోందో నాకు అర్థమయ్యేలా చేసింది. ఇంతకీ ఈ కథ వెనుక ఉన్న విషయం ఏమిటంటే..
2012 వ సంవత్సరం లో నేను తిరుపతి లో సాక్షి పత్రిక కు బ్యూరో ఇంచార్జి గా పనిచేస్తున్నాను. కొన్ని నెలల క్రితం వీరప్పనూర్ తదితర అటవీ గ్రామాలకు వెళ్ళి ఎర్రచందనం అక్రమ రవాణా గురించి ప్రత్యేక కథనం రాసిన నాకు దీనికి కొనసాగింపుగా వీరప్పన్ భార్య తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయాలనిపించింది.
ఆమె తమిళనాడు లోని కృష్ణగిరి కి దగ్గరలో నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్నాను. కానీ ఖచ్చితమైన చిరునామా తెలుసుకోవడం, ఆమె ఇంటర్వ్యూ సంపాదించడం ఎలా అని ఆలోచించాను. కృష్ణగిరి కుప్పం కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల వారికి మంచి సంబంధాలు ఉంటాయని నాకు తెలుసు. సాక్షి కుప్పం ఆర్సీ ఇంచార్జి గా పని చేస్తున్న మిత్రుడు వెంకటేష్ బాబును ఒక సారి అడిగి చూద్దామని ఫోన్ చేశాను. విషయం చెప్పగానే కృష్ణ గిరి ఈ టీవీ రిపోర్టర్ శ్రీధర్ నాకు మంచి మిత్రుడు. వానిది కుప్పమే. నా క్లాస్ మెట్. వానితో మాట్లాడి ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేస్తాను సర్ అని చెప్పాడు. ఇంత మంచి సోర్స్ దొరికాక నేను వదులుతానా? ప్రయత్నం కాదు బాబు నువ్వు ఏం చేస్తావో తెలీదు. ముత్తులక్ష్మి గారి ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చేసి నాకు ఫోన్ చెయ్ అని ఆర్డర్ లాంటి రిక్వెస్ట్ చేశాను. 2002 ఆంధ్రజ్యోతి నుంచి ప్రారంభమైన స్నేహ సంబంధం అతనితో నాకు ఆ చనువును ఇచ్చింది.
 
 
 
వెంకటేష్ ఏం ఇబ్బంది పడ్డాడో నాకు తెలియదు కానీ నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేసి శ్రీధర్ ను ముత్తులక్ష్మి గారితో మాట్లాడించాను. అతనికి ఆమె పరిచయమే అంట సర్..ఆయన దగ్గర జాతకం కూడా చెప్పించుకుందట. ఆమెకు ఇంటర్వ్యూ విషయం చెప్పి ఓకే చేయించాడు. ఇంటర్వ్యూ రెడీ సర్. మీరు ఎప్పుడు వస్తారు అని అడిగాడు. ఎప్పుడో ఎందుకు స్వామీ ఎల్లుండి పొద్దునే బయలుదేరి వస్తాను అని చెప్పాను.వృత్తి రీత్యా విలేకరి కాక పోయినా జర్నలిజం పట్ల ఆసక్తి, అవగాహన ఉన్న నా మిత్రుడు తిరుమల కు చెందిన వెంకటేష్ తో ఈ విషయం చెప్పాను. నేను కూడా వస్తాను అన్న. వీరప్పన్ భార్య ను చూద్దాం. అని అతను కూడా నాకు తోడుగా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. డిసెంబరు 3వ తేదీ ఉదయం 6 గంటలకు శేషాద్రి ఎక్స్ ప్రెస్ రైల్ లో తిరుపతి నుంచి కుప్పం బయలు దేరాము. ముందుగానే ఫోన్ చేయడంతో చిత్తూరు రైల్వే స్టేషన్ కు మిత్రుడు, అప్పటి సాక్షి విలేకరి జయకర్ మా ఇద్దరికీ టిఫిన్ తీసుకుని వచ్చాడు. 11 గంటలకు కుప్పం లో దిగాము. అక్కడ సిద్ధంగా ఉన్న వెంకటేష్ బాబు మమ్మల్ని తాను కొత్తగా కట్టిన లాడ్జికి తీసుకుని పోయి రూ నెంబర్ 204 లో దించాడు. కాఫీ తాగాక అతని జైలో కారులో కృష్ణగిరికి బయలుదేరాము. మేము వెళ్లిన సమయానికి శ్రీధర్ ఇంట్లో లేరు. సాయంత్రం 4 గంటలకు రావచ్చని ఇంట్లో వాళ్ళు చెప్పారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 1 గంట. అక్కడి నుంచి టౌన్లో మంచి శాఖాహార హోటల్ కు తీసుకుని పోయాడు. ఆ హోటల్ దశాబ్దాల కాలంగా ఉందని చూస్తూనే అర్థం అయ్యింది. అయితే భోజనం మాత్రం సూపర్ గా ఉంది. అక్కడే చాలా సేపు గడిపి 3 గంటలకు శ్రీధర్ ఇంటికి వచ్చాము. అతను ఇంకా రాలేదు. ఎంత సేపైనా ఎదురు చూసి అతనితో మరోసారి శ్రీమతి ముత్తులక్ష్మి గారికి ఫోన్ చేయించుకుని, సరైన చిరునామా తీసుకున్నాకే వెళ్లాలని అక్కడే తిష్ట వేశాము. సాయంత్రం 5 గంటలకు అతను వచ్చాడు. వెంకటేష్ బాబు తో పాటు మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించి మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చారు. బాబు మమ్మల్ని పరిచయం చేశాక ఆయన ముత్తులక్ష్మి గారికి ఫోన్ చేసి తమిళంలో మాట్లాడాడు. రేపు ఉదయం 10 గంటలకు రమ్మని చెప్పండి. నేను ఇంట్లోనే ఉంటాను. అని అవతలి నుంచి తమిళంలో ఆమె మాట్లాడిన మాటలు నాకు వినిపించాయి. అడ్రస్ రాసుకుని కుప్పం కు తిరుగు ప్రయాణం అయ్యాము. ఆ రాత్రికి వెంకటేష్ బాబు లాడ్జిలో బస చేశాము.
 
 
 
 
మరుసటిరోజు ఉదయం 7 గంటలకు ధర్మపురి జిల్లా మేటూరు డ్యాం సమీపంలోని ఆమె ఇంటికి బయల్దేరాము. కృష్ణగిరి బైపాస్ లోని హోటల్లో టిఫిన్ తిని ఆ ఊరికి చేరుకున్నాము. ముత్తులక్ష్మి గారి ఇంటికి ఎలా పోవాలని అక్కడి వారిని అడిగితే మమ్మల్ని అదో రకంగా చూశారు. వాళ్ళని, వీళ్ళని అడిగి కాస్త అటు ఇటుగా 10 గంటలకు ఆమె ఇంటికి చేరుకున్నాము.
ఆ వాతావరణం చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. చిన్న పెంకుటిల్లు బయట నులక మంచం, పరకతో ఇంటి ముందు చెత్త ఊడుస్తున్న ముత్తులక్ష్మి. బాబు మనం కరెక్ట్ అడ్రస్ కే వచ్చామా అని అడిగాను. కరెక్టే సర్. ఆమే ముత్తులక్ష్మి అని వెంకటేష్ బాబు చెప్పిన సమాధానం విని షాక్ తిన్నాను. ఓర్నీ పాసుగుల నేను ఏదో ఊహించుకుని వస్తే ఇక్కడ అంతా రివర్స్ గా ఉండేందబ్బా అని అంటుండగానే ముత్తులక్ష్మి గారు మమ్మల్ని చూసి ” వాంగె వాంగె” అని ఆహ్వానించారు. సాక్షి బాబు (కుప్పం వెంకటేష్ బాబుని ఇలా కూడా పిలుస్తారు) అందుకుని అరవం లో మాటలు కలిపి శ్రీధర్ పంపిన వారు తామేనని చెప్పాడు. మనం వినేవి, ఒక్కో సారి చూసేవీ కూడా అన్నీ నిజాలు కావని అప్పుడు నాకు అనిపించింది.నేను, కుప్పం బాబు నులక మంచం మీద కూర్చున్నాము. తిరుమల వెంకీ మాత్రం అతను కూడా కూర్చుంటే మంచం తెగిపోతుందేమోనని నిలబడే ఉన్నాడు. ముత్తులక్ష్మి గారు ఇంట్లోంచి ( ఇంటికి నెలకు 2 వేల రూపాయలు అద్దె) పాత కుర్చీ తెచ్చుకుని అందులో కూర్చున్నారు. మా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది.
 
 
 
 
 
” మీరు మాకేమైనా ఇస్తారా (డబ్బు) ” అని ఆమె తొలి ప్రశ్న వేశారు. మేము ఆంధ్ర పేపర్ వాళ్ళము. మీరు చెప్పేది పేపర్లో రాస్తాము అని బాబు ఆమెకు తమిళంలో చెప్పాడు. ఈ మధ్య సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వచ్చి నాతో మాట్లాడి వీరప్పన్ మీద సినిమా తీస్తాను. మీకు డబ్బు ఇస్తాను అని చెప్పి పోయినాడు. సినిమా కూడా తీసినాడంట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆమె గోడు వెళ్లబోసుకున్నారు. ఇది కూడా పేపర్లో రాస్తాములే. ఆయన డబ్బులు పంపిస్తాడేమో చూద్దాం అని చెప్పి బాబు ఆమెను ఒప్పించాడు.
షరా మామూలే నేను బాబుకు తెలుగులో ప్రశ్న చెప్పడం, అతను తమిళంలో అడగడం,(వెంకటేష్ బాబు తెలుగు తో పాటు తమిళం, కన్నడలో కూడా బాగా మాట్లాడతాడు.) ఆమె చెప్పింది అతనే రాసుకోవడం జరిగింది. వీరప్పన్ అడవులను దోచేసి బాగా సంపాదించాడట కదా మీరేంది ఇట్లా ఉన్నారు అని అడిగితే. ఆయన సంపాదించింది పోలీసులకు, రాజకీయ నాయకులకే సరిపోయింది.(తమిళనాడు కు చెందిన కొందరు నాయకుల పేర్లు చెప్పారు. న్యాయ పరమైన ఇబ్బందులు వస్తాయని ఇంటర్వ్యూలో రాయలేదు. ఇక్కడ కూడా అదే సమస్య) మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మేము వీరప్పన్ కుటుంబం అని చెప్పుకోవడానికి కూడా భయం. జనం మమ్మల్ని వెలివేస్తారు. పోలీసులు ఇబ్బందులు పెడతారని చెప్పారు.
వీరప్పన్ లాంటి వ్యక్తి ని ఎందుకు పెళ్లి చేసుకున్నారని అడిగిన ప్రశ్న విని పక్కనే ఉన్న ముత్తులక్ష్మి గారి తండ్రి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. మేము ఎక్కడ పెళ్లి చేశాము.వాడే మమ్మల్ని బెదిరించి చేసుకున్నాడు. ఇద్దరికీ 18 సంవత్సరాల వయసు తేడా అని రుసరుస లాడారు. ఆమె కూడా ఇదే విషయం చెప్పారు. ఇంటర్వ్యూ ముగిసేంత సేపు ముత్తులక్ష్మి తండ్రి వీరప్పన్ ను తిడుతూనే ఉన్నారు.
ఈ బాధలు పడలేక మా కూతుర్ని చెన్నైలో కాలేజీలో చేరిపించాము. ఒక సంవత్సరం చదివాక ఆమె వీరప్పన్ కూతురు అని తెలిసి కాలేజీ వాళ్ళు టిసి ఇచ్చిపంపారని ముత్తులక్ష్మి చెప్పారు.
అడవిలో ఆవులు మేపుకునే వీరప్పన్ డబ్బు సంపాదన కోసం అడవిలో గంధం చెట్లు కొట్టించే మేస్త్రి దగ్గర పని చేసిన వీరప్పన్ స్మగ్లర్ గా మారడానికి దారితీసిన పరిణామాలను సుమారు గంటపాటు వివరించారు. మాకు ఇద్దరు ఆడ పిల్లలు. వాళ్ళు పుట్టాక రెండు సార్లే ఆయన్ని కలుసుకున్నానని చెప్పారు. సినీ నటుడు రాజ్ కుమార్ ను వీరప్పన్ కిడ్నాప్ చేసినప్పుడు పోలీసులు మమ్మల్ని చిత్ర హింసలు పెట్టారని కన్నీరు పెట్టుకున్నారు. మాకు తెలియదని చెప్పినా పోలీసులు వినలేదని చెప్పారు. ఆమె మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది. పెద్ద కూతురు పెళ్లయి కృష్ణగిరిలో ఉందని చెప్పారు. నేను, నాచిన్న కూతురు, మాకు తోడుగా మా నాన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నామని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని చిన్న కూతురుని చదివించాలని ఆమె అభ్యర్థించారు. ఇలా సుమారు మూడు గంటల పాటు మా ఇంటర్వ్యూ సాగింది.
 
 
 
 
ఇంటర్వ్యూ ముగిశాక ఆ కుటుంబం మమ్మల్ని భోజనం తిని వెళ్ళమని ఆహ్వానించింది. అటువంటి స్థితిలో కూడా వారిచ్చిన మర్యాద మరువలేనిది. ఒకే సారి నలుగురు భోజనానికి సిద్ధం అయితే వారికి ఇబ్బంది కావచ్చు అనే ఉద్దేశంతో వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి బయలుదేరాము.అక్కడి నుంచి మేటూరు డ్యామ్ చూపించి నేరుగా హోగినేకల్ జలపాతానికి తీసుకుని వెళ్ళాడు వెంకటేష్ బాబు. ఆ ప్రాంతాన్ని నేను చూడటం అదే తొలిసారి. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ, జలపాతం కింద స్నానం చేసి, లోయలోని నదిలో ” పుట్టి” లో విహారం చేసి రాత్రికి కుప్పం చేరుకున్నాము. మరుసటిరోజు తిరుపతికి బయల్దేరి వచ్చి ఫ్యామిలీకి ఇంటర్వ్యూ రాసి పంపాను. అది 2012 డిసెంబరు 7వ తేదీ
” వీరప్పన్ ది ఎన్ కౌంటర్ కాదు” అనేశీర్షికతో నాపేరు, వెంకటేష్ బాబు పేరుతో ప్రచురితమైంది.ఒక నాన్ సెలబ్రిటీ వ్యక్తి ఇంటర్వ్యూ కోసం మూడు రోజుల సమయం వెచ్చించినా, మంచి ఇంటర్వ్యూ చేశాననే సంతృప్తి నాకు ఇప్పటికీ ఉంది.
 
 
 
 
నిన్న ( శనివారం 8.1.2022) రాత్రి పుష్ప సినిమా చూశాను. వీరప్పన్ భార్య శ్రీమతి ముత్తులక్ష్మి గారు తన భర్త అడవిలో చెట్లు నరికే కూలి స్థాయి నుంచి స్మగ్లర్ గా ఎలా ఎదిగాడో, బెదిరించి ఎలా పెళ్లి చేసుకున్నాడని చెప్పిన విషయాలే పుష్పరాజ్ పాత్రలో నాకు కనిపించాయి. బహుశా ఇది కాకతాళీయమే అయ్యుండొచ్చు. ( సినిమా దర్శకుడి క్రియేటివిటీని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు )కానీ సినిమా చూస్తున్నంత సేపు ముత్తులక్ష్మి గారితో చేసిన ఇంటర్వ్యూనే నా మదిలో తిరుగుతూ ఉంది. జర్నలిస్ట్ గా నా మరో అనుభవానికి రోజు అక్షర రూపం ఇచ్చాను.ఇంటర్వ్యూచేయాలనుకుంది నేనే అయినా ముందుండి నడిపించిన కుప్పం వెంకటేష్ కు, ముత్తులక్ష్మి గారిని ఇంటర్వ్యూ కు ఒప్పించిన ఈటీవీ శ్రీధర్ కు, నాకు తోడుగా వచ్చిన మిత్రుడు తిరుమల వెంకటేష్ కు, చిత్తూరు విలేకరి జయకర్ కు, అప్పటి ఎడిషన్ ఇంచార్జ్ శ్రీ రామాంజనేయులు సర్ కు, ఈ ఇంటర్వ్యూను ఫ్యామిలీ పేజీ లో బ్రహ్మాండంగా ప్రచురించిన శ్రీ రామ్ అన్నయ్య కు, నా ఈ వ్యాసాన్ని ప్రూఫ్ రీడింగ్ చేసిన నా శ్రీమతిఅన్నపూర్ణ కు ధన్యవాదాలు.
 

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: I was shocked when Veerappan stepped into their house