డబ్బులు లెక్కల్లేక పోతే..అంతే

Date:08/11/2018
కరీంనగర్ ముచ్చట్లు:
ఎన్నికల్లో ఓట్లు పడాలంటే నోట్లు పంచాల్సిందేనన్నది రాజకీయ నానుడి. ఈ సమయంలో ఏ పనికావాలన్నా.. డబ్బు కావాల్సిందే మరి. ప్రచారం, సభలు, సమావేశాలు, పార్టీల్లో చేరికలు, ప్రతి కార్యక్రమానికి మనీ అత్యవసరం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు రవాణాను అరికట్టేందుకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అనేక చోట్ల ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్, సీసీఎస్‌ పోలీసులు 15 బృందాలుగా విడిపోయి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఇప్పటి వరకు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 2 కోట్ల 50 లక్షల పైచిలుకు వరకు డబ్బును సీజ్‌ చేశారుఎన్నికల సంఘం కోడ్‌పేరిట ఎన్ని నిబంధనలు విధించినా.. పోలీసులు  ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసినా..నగదు మాత్రం సోదాల్లో పట్టుబడుతోంది. దొరికిన డబ్బుకు సరైన లెక్కలు చెప్పకపోవడంతో అధికారులు వాటిని సీజ్‌ చేస్తున్నారు. అయినా.. మనీ మూటలు సరి‘హద్దు’లు దాటుతున్నాయి. అత్యవసర అవసరాల కోసం డబ్బులు తీసుకెళ్లే వారు తప్పనిసరిగ్గా తగిన ఆధారాలు ఉంచుకోవాల్సిందే.
లేదంటే ఇబ్బందులు తప్పవు.ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద మొత్తంలో నగదును తరలిస్తుంటారు. అనుమానం ఉన్న చోట్ల పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరిహద్దులు, టోల్‌ప్లాజాలవద్ద తనిఖీలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో పాటు సాధారణ పౌరులూ అవసరాల రీత్యా డబ్బు తీసుకెళ్తుంటారు. బ్యాంకులో జమచేసేందుకు లేదా బ్యాంకు నుంచి తీసుకువస్తున్న సొమ్ముకు సంబంధించిన ఆధారాలు చూపితే సరిపోతుంది. వ్యాపారరీత్యా నగదు తీసుకెళ్తుంటే.. సంబంధిత ధ్రువపత్రాలు వెంట తీసుకెళ్లాలి. రూ.50 వేల వరకు నగదు తీసుకెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అంతకమటే ఎక్కువ ఉంటే మాత్రం పత్రాలు తప్పనిసరని అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో భాగంగా పలుకమిటీలు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్, అకౌంటింగ్‌ బృందాలు, నోడల్‌ కమిటీ, వీడియో చిత్రీకరణ తదితర అధికారుల కమిటీలు అనుక్షణం నిఘాపెట్టాయి. నియమావళిని ఉల్లంఘించే చోట వెంటనే చర్యలకు ఉపక్రమిస్తారు. రూ. 50 వేల లోపు నగదు తీసుకెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకెళ్తే స్వాధీనం చేసుకోవడమే కాకుండా దాన్ని సంబంధిత అభ్యర్థి ఎన్నికల ఖర్చులో జమ కడతారు. సాధారణ పౌరులు సైతం తాము తీసుకెళ్తున్న నగదుకు లెక్క చూపని పక్షంలో అప్పటికప్పుడు సీజ్‌ చేస్తారు. అనంతరం నోడల్‌ కమిటీకి అప్పగిస్తారు.పోలీసులకు పట్టుబడ్డ డబ్బు తమదేనని సరైన రుజువులతో కూడిన పత్రాలు చూపించాలి.
సంబంధిత పని కోసం తీసుకెళ్తున్నట్లు ఆధారాలు చూపితే తిరిగి డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. నోడల్‌ కమిటీ అధికారులకు సంబంధిత పత్రాలను చూపాల్సి ఉంటుంది. ఈ కమిటీలో డీఆర్‌డీవో, డీటీవో, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి తదితరులు సభ్యులుగా ఉన్నారు. రూ.10 లక్షలలోపు పట్టుబడిన నగదు నోడల్‌ కమిటీ పరిధిలో ఉంటుంది. అంతకు మించితే సంబంధిత నగదు వ్యవహారాన్ని ఆదాయ పన్నుశాఖ నోడల్‌ అధికారులకు అప్పగిస్తారు. ఎన్నికలకోడ్‌ అమలులో ఉన్నందున నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు జరుపుకోవడం ఉత్తమమని పలువురు సూచిస్తున్నారు.
Tags; If the money does not count

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed