Date:10/11/2020
వరంగల్ ముచ్చట్లు:
అసలే అకాల వర్షాలు. పంట చేతికొచ్చే సమయం. ధాన్యాన్ని మార్కెట్ తెచ్చుకోవాలంటేనే రైతులు భయపడుతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలకు మార్కెట్లో రక్షణ కరువైంది. మార్కెట్లలో సౌకర్యాలు కల్పించాలంటూ వ్యవసాయశాఖ మంత్రి ఆదేశించినా అమలు కావడం లేదు. ఐకేపీ కేంద్రాల్లో టార్పాలిన్ కొరత తీవ్రంగా ఉన్నది. ధాన్యం మార్కెట్లోకి వస్తున్నా సబ్సిడీ టార్పాలిన్లు మాత్రం అందించం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసే ఐకేపీ సెంటర్లు, వ్యవసాయ మార్కెట్లు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.మార్కెట్లలో అన్ని వసతులు కల్పిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. గత ఐదేండ్లలో తేమకొలిచే యంత్రాలు, టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్స్, వెయింగ్ మిషన్లు, మాయిశ్చర్ మీటర్లు వంటి కనీస వసతుల కోసం రూ 35.95 కోట్లు విడుదల చేసినట్టు మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే టార్పాలిన్లు ఇవ్వలేదు. ఈ సారి ఇవ్వకపోతే మార్కెట్ చేసేది లేదని ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు అంటున్నారు. కనీసం తాగడానికి నీటి సౌకర్యం కల్పించడం లేదని రైతులు చెబుతున్నారు.ధాన్యం రక్షణ కోసం మార్కెట్లలో సిమెంట్ ప్లాంట్ ఫామ్‌లు నిర్మించాలన్న అంశాన్ని మార్కెటింగ్ శాఖ విస్మరించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రక్షించుకునే పరిస్థితి లేదు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే వసతులు లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే ధాన్యాన్ని రక్షించుకోవడానికి రైతులకు టార్పాలిన్లు ఇవ్వడం లేదు. కనీసం కొనుగోలు కేంద్రాలకు కూడా వాటిని ఇవ్వక పోవడంతో నిర్వాహకులు సమాధానం చెప్పలేకపోతున్నారు. మండలాల వారీగా వ్యవసాయ అధికారులు ఇచ్చే ఇండెంట్ ఆధారంగా టార్పాలిన్ల సరఫరా జరిగేది. సబ్సిడీ టార్పాలిన్లను డీడీ, పాస్‌బుక్, ఆధార్ కార్డు జీరాక్స్ కాపీలు అందించి 50 శాతానికి కొనుగోలు చేయాల్సి ఉన్నది. మార్కెట్లో రూ 2500లకు లభించే టార్పాలిన్లను 50శాతం సబ్సిడీతో రూ 1250 ఇచ్చేవారు. అది రైతులకు చేరే సరికి ట్రాన్స్‌పోర్టు చార్జీలతో కలిపి ఒక్కో గ్రామంలో ఒక్కో తీరుగా రూ 1300, రూ 1450, రూ1500 చొప్పున అందుతున్నది. కంపెనీలు రైతుల వివరాలతో ప్రభుత్వానికి అందిస్తే మిగతా 50శాతం నిధులు కంపెనీలకు ప్రభుత్వం అందించేది. గతేడాది నుంచి కంపెనీలకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వక పోవడంతో ఆయా కంపెనీలు కూడా టార్పాలిన్లు సరఫరా చేయడం లేదని తెలిసింది.మార్కెట్ కమిటీలు నియమించినా వాటికి పైసలు ఇవ్వడం లేదు. దీంతో ఆయా మార్కెట్లలో కనీసం పరికరాలు కొనుగోలు చేయడానికి నిధులు లేవని అధికారులు అంటున్నారు. జిల్లా స్థాయిలో పర్చేజ్ కమిటీ అధికారులు కొనుగోలు చేసి ఆయా ఐకేపీ కేంద్రాలకు పంపించాల్సి ఉన్నది. జిల్లా స్థాయి అధికారులు, కుమ్మక్కై నిధులు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గిరిజన భూముల్లో.. కార్పొరేట్ సంస్థలు
Tags:Ignored marketing department