నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్లు

Date:14/01/2019
తిరుపతి ముచ్చట్లు:
చిత్తూరు జిల్లాల్లో  నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి.జిల్లాలోని కురబలకోట, కుప్పం, శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, నగరి.. ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు అధికంగా ఏర్పాటయ్యాయి. శ్రీకాళహస్తి- రేణిగుంట మధ్యలో పరిశ్రమలు అధికంగా వస్తుండడంతో 65 ఎకరాల్లో లేఅవుట్లు ఉన్నాయి. వాటిలో సగానికిపైగా అనధికారికంగా వెలిసినవే. అక్కడక్కడ అధికారులు నోటీసులివ్వడం, అడ్డుకోవడం.. చేస్తున్నా పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో సుకబ్రహ్మాశ్రమం వద్ద అనధికారికంగా వెలసిన లేఅవుట్లను రెండు నెలల కిందట జేసీబీలతో తొలగించారు. కురబలకోట, శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, నగరి.. ప్రాంతాల్లో అధికారులు హెచ్చరిక బోర్డులు పెడుతున్నా.. రిజిస్ట్రేషన్‌ అయితే చాలన్నట్టు కొనుగోలుదారులు కొంటున్నారు. వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతరగా కన్వర్షన్‌ చేసుకోకుండా కొన్ని.. ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కేసి మరికొన్ని లేఅవుట్లను వేసేస్తున్నారు. అడ్డొచ్చిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు.
ఇవేమీ తెలియని సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసి మోసపోతున్నారు.ఒకరికి రిజిస్ట్రేషన్‌ చేసిన భూమినే మరో ముగ్గురు, నలుగురికి అమ్మేస్తున్నారు.  కొనుగోలు చేసిన వారు తమ స్థలాలు చూసుకుంటూ భద్రంగా ఉన్నాయని భావిస్తున్నారు. తీరా స్థలాల్లో నిర్మాణాలు చేపట్టే సమయంలో మరో నలుగురు వచ్చి, ఆ భూమి తమదంటే తమదని ఆధారాలు చూపుతున్నారు. దీంతో వారి మధ్య నెలకొన్ని వివాదాలు పోలీస్‌స్టేషన్ల వరకు చేరుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. అక్రమ లేఅవుట్లు వేసిన నిర్వాహకులు పత్తా లేకుండా పోతున్నారు. లేఅవుట్లు ఏర్పాటు చేయాలంటే వ్యవసాయ భూమిని కచ్చితంగా వ్యవసాయేతరగా మార్చుకోవాలి. దీనికోసం భూవిలువలో 3శాతం ఖర్చు అవుతుంది.  ఆ భూమికి సంబంధించిన దస్త్రాలు, అధీకృత ఇంజినీరు తయారుచేసిన లేఅవుట్‌ ప్లాను గ్రామ పంచాయతీకి సమర్పించాలి. పంచాయతీ కార్యదర్శి వాటిని క్షుణ్నంగా పరిశీలించి.. అనంతరం సంబంధిత అధికారులకు పంపించాలి.
వారి నుంచి అనుమతి వచ్చాకే నిర్ణీత రుసుము వసూలు చేసి, వెంచర్‌ వేసేందుకు అనుమతులు జారీ చేయాలి. లేఅవుట్‌ వేసిన భూమిలో 10శాతం స్థలాన్ని గ్రామ పంచాయతీకి ఇవ్వాలి. లేఅవుట్‌లో పచ్చదనానికి ప్రాధాన్యమివ్వాలి. తప్పనిసరిగా రహదారులు, మురుగునీటి వ్యవస్థను ఏర్పాటుచేయాలి. 33 అడుగుల అంతర్గత, 40 అడుగుల ప్రధాన రహదారిని ఏర్పాటుచేయాలి.  లేఅవుట్‌ వేసే భూమి హెక్టారు లోపు ఉంటే జిల్లా టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారికి, ఒక హెక్టారు నుంచి రెండు వరకు ఉంటే రీజనల్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారికి, అంతకుమించి ఉంటే కంట్రీ ప్లానింగ్‌ రాష్ట్ర సంచాలకులతో అనుమతి పొందాలి. అక్రమ లేఅవుట్లు వేస్తున్నారని తెలిసిన వెంటనే నోటీసులిస్తున్నాం. అంగళ్లు, శ్రీకాళహస్తి, ఏర్పేడు.. వంటి ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్ల వద్ద ‘ఇది కొనుగోలు చేయవద్ద’ని హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేరని చెబుతున్నాం. ఎంత చెప్పినా.. కొనుగోలుదారులు కొంటూనే ఉన్నారు. అక్రమ లేఅవుట్లను అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నామంటున్నారు అధికారులు.
Tags:Illegal illusions contrary to the rules

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *