అక్రమ లేఅవుట్లు..అమాయకులు పాట్లు..

Date:07/12/2018
రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పరిధిలో పలు అక్రమ లేఅవుట్లు వెలసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సరైన అనుమతులు లేకుండానే వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చుతున్నట్లు విమర్శిస్తున్నారు. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉన్న ఈ లేఅవుట్లను విక్రయిస్తూ కొందరు రూ.కోట్లు గడిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ తంతుపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనంగా ఉంటోందన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి అక్రమ లేఅవుట్లలో వేసిన హద్దురాళ్లను స్థానిక గ్రామపంచాయతీ ఉద్యోగులు తొలగిస్తున్నారు. అయినప్పటికీ రియల్‌ వ్యాపారులు ఇదేమీ లెక్కచేయడంలేదు. తమ దందా యథేచ్ఛగా కొనసాగించేస్తున్నారు. తక్కువ ధరలకు వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రియల్టర్లు.. వాటిని ప్లాట్లుగా మార్చి క్రయవిక్రయాలు సాగిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, కిష్టంపల్లి, ఎల్లారెడ్డిపేట మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ఈదందా సాగుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మలచేందుకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. రెవెన్యూ విభాగం నుంచి స్పష్టమైన అనుమతులు వచ్చాకే ఈ కార్యక్రమం సాగించాలి.
అయితే కొందరు అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా ప్లాట్లు చేసి విక్రయించేస్తున్నట్లు కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామపంచాయతీ నుంచి అనుమతి పొందకుండానే కొందరు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చడాన్ని స్థానికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పంచాయతీ ఆదాయానికి గండిపడుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తక్కువ ధరకు ఎకరాల కొద్దిభూములను కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రూ.లక్షలు దండుకుంటున్నారు. మరికొందరు వ్యాపారులు నమ్మిస్తూ లేఅవుట్లు లేకుండానే అమాయకులకు ప్లాట్లను అంటగడుతున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పలు ప్లాట్లకు అనుమతులు లేవని గ్రామపంచాయతీ సిబ్బంది దాడులు చేస్తున్నారు. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన వెల్లువెత్తుతోంది. రూ.లక్షలు పోసి కొనుగోలు చేసుకున్న స్థలాలు సొంతం కాకుండా పోతాయేమోననే భయం వారిని వెన్నాడుతోంది. అక్రమ లేఅవుట్లపై సంబంధిత అధికారులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని.. అమాయకులు మోసపోకుండా చూడాలని అంతా కోరుతున్నారు.
Tags:Illegal layouts ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *