పుష్స ను మించి అక్రమ కలప
ఖమ్మం ముచ్చట్లు:
సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్‌గఢ్ నుండి తెలంగాణకు జోరుగా అక్రమ కలప రవాణా జరుగుతోంది. ఎప్పుడో చుట్టపుచూపుగా అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతంలో దొంగలను పట్టుకుని కేసులు నమోదు చేస్తుంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పలిమెల మండలంలోని వివిధ అటవీ గ్రామాలు స్మగ్లర్ల కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. అడవి గ్రామాల్లో దిమ్మెలుగా కోసి.. కార్లు, ట్రక్కులు, బోలోరో వాహనాల్లో కలప రవాణా జరుగుతోంది. అటవీ ప్రాంతాల్లో గిరిజనులను మచ్చిక చేసుకుని.. స్మగ్లర్లు వారితో విలువైన టేకు కలపను నరికిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేంజి పరిధిలోని సిబ్బంది కలప అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాత్రివేళల్లో కలపను గుట్టుచప్పుడు కాకుండా ఎలా తరలించాలో కూడా వారికి సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. అవసరమైతే వాటిని దాటించే పని కూడా వారి భుజాలపైనే వేసుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా మండలంలో స్మగ్లర్లకు ఎదురులేకుండా పోయింది. ఈ అక్రమ రవాణా దందా గురించి.. యంత్రాంగానికి తెలిసినా ఏమి పట్టనట్లు ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పలిమెల, లెంకలగడ్డ, సర్వాయి పేట, దమ్మూర్ గ్రామాల్లో రాత్రిపూట 2 గంటల నుండి 4గంటల సమయంలో జోరుగా అక్రమ రవాణా సాగుతున్నట్లు సమాచారం. ఉత్తర అటవీ రేంజ్‌లు గోదావరి నది పరివాహకంగా ఉన్నాయి.
మహారాష్ట్ర అభయారణ్యాలకు దగ్గరే ఉండటంతో కలప అక్రమ రవాణా ఈ మార్గాల ద్వారా సరిహద్దులు దాటుతోంది. టేకు దుంగలను సులభంగా సేకరిస్తున్న అక్రమార్కులు.. సునాయాసంగా లెంకలగడ్డ, దమ్మూరు, సర్వాయిపేట అటవీ సెక్షన్లు చిరునామాగా అక్రమ రవాణాకు ఒడిగడుతున్నారు. ఇక్కడ తక్కువ ధరకే టేకు లభ్యమవుతుండటంతో పూర్తిగా మహారాష్ట్ర స్మగ్లర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇక్కడి నుండి గోదావరి నదిలో పడవకు తెప్పలుగా కట్టుకొని సరిహద్దు దాటినా తర్వాత.. కలపను చిన్నగా కట్ చేసి.. వాహనానికి కొత్తగా లోపల వేరే బాడీ తయారు చేసి అందులో అమర్చి దొడ్డిదారిన యథేచ్ఛగా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో అక్రమ రవాణాపై నియంత్రణ లేకపోవడంతో మాఫియా రాజ్యమేలుతోంది. ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసుకున్న రవాణాదారులు కామనపల్లి, రెడ్డిపెళ్లి మీది నుండి భూపాలపల్లి జిల్లా ప్రాంతాలకు కలపను చేరవేస్తున్నారు. అక్కడ రూ.3వేల నుంచి రూ.3500 విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి.. పకృతి సంపదను నాశనం చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:Illegal timber beyond Pusa
