మీరు లేకపోతే నేను లేను ఉద్యోగులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
తాడేపల్లి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య జీతాల వివాదం ముగిసిన నేపథ్యంలో సీఎం జగన్ (AP CM YS Jagan) ఆదివారం పీఆర్సీ సాధన సమితి నేతలతో భేటీ అయ్యారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ హాజరయ్యారు. పీఆర్సీ సాధన సమితి తరపున ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు, శనివారం మంత్రుల కమిటీ చేసిన ప్రతిపాదనలు, ఇచ్చిన హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఐఆర్ రికవరీ, హెచ్ఆర్ఏ, పెన్షన్లు, హెల్త్ రీయింబర్స్ మెంట్ తో సహా ఇతర ప్రధాన అంశాలపై సీఎం జగన్.. ఉద్యోగ సంఘాలతో చర్చించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులనుద్దేశించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రప్రభుత్వానికి ఉద్యోగుల సహకారం ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని స్పష్టం చేశారు. ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు చేయగలిగినంత చేస్తున్నామన్న సీఎం.. డిమాండ్ల విషయంలో ఎవరూ భావోద్వేగాలకు గురికావొద్దని సూచించారు. అంతేకాదు మీరు లేకపోతే నేను లేను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ భేటీలో సీపీఎస్ విధానం రద్దుపైనా ప్రధానంగా చర్చ జరిగింది. సీపీఎస్ విషయంలో సరైన పరిష్కారం చూపిస్తామని.. దీనిపై ఎలా ముందుకెళ్లాలే అంశంపై అధ్యయనం చేస్తున్నామన్నారు. అంతేకాదు ఇందులో ఉద్యోగ సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు. దీనిపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే ముందుకెళ్తామని స్పష్టంచేశారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై రోస్టర్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్న సీఎం.. ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు వివరించారు. ఇక 30వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇస్తున్న సంగతిని సీఎం గుర్తుచేశారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం చాలా పాజిటివ్ గా ముందుకెళ్తోందన్న సీఎం.. దీని వల్ల ప్రతి ఒక్కరికీ ఫలాలు అందుతాయన్నారు.
మంత్రుల కమిటీ నిర్ణయాలన్నీ తన ఆమోదంతోనే మీకు చెప్పారని సీఎం జగన్ ఉద్యోగులతో అన్నారు. ఐఆర్ ఇచ్చిన 30 నెలల కాలానికి సర్దుబాటు చేయాల్సి ఉండగా.. 9 నెలలకు సంబందించిన ఐఆర్ ను మినహాయించడం వల్ల ప్రభుత్వంపై రూ.5,400 కోట్ల భారం పడుతోందన్నారు. అలాగే హెచ్ఆర్ఏ రూపంలో మరో రూ.325 కోట్ల భారం పడుతోందన్నారు. దీంతో పాటు రికరింగ్ కాస్ట్ రూపంలో మరో రూ.800 కోట్లు, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్, సీసీఏ రూపేణా మొత్తం రూ.1,330 కోట్ల భారం పడుతోందని సీఎం వివరించారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వంపై రూ.11,500 కోట్ల భారం పడుతుందని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇలా ఉండకుంటా ఉంటే అందరినీ మరింత సంతోషపెట్టేవాడనని జగన్ వ్యాఖ్యానించారు.
Tags: I’m not with you CM pics with employees Key Comments