శ్రీవారి వాహన సేవల్లో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం చిన్నశేష వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 9 కళాబృందాలలో 217 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు.కర్ణాటక ఉడిపిలోని శ్రీ పాలిమారు మఠంకు చెందిన 12 మంది బృందం ఉడిపి మెళం వాహన సేవకు మరింత ఆధ్యాత్మిక అందాన్ని తెచ్చింది. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తున్నారు. ఈ వాయిద్య ప్రదర్శన ఎంతో వినసొంపుగా ఉంటుంది. వీరు గత 15 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉడిపి మెళం వాయిస్తున్నారు. పుదుచ్చేరికి చెందిన 30 మంది కళాకారులు పంబి డ్యాన్స్, 23 మంది కళాకారులు ప్రదర్శించిన మోహిని ఆట్యం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో మహిషాసుర మర్ధిని అలంకారంలో అమ్మవారు రాక్షసుడిని సంహరించడం, హిరణ్యకశిపుని చీల్చడంతో ప్రహ్లాదుడు నరసింహుడిని ప్రార్థిస్తున్న ఘట్టాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి.

దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో చెన్నై,సెలం, శ్రీరంగంకు చెందిన 6 కళా బృందాలు దాస సాహిత్య సంకీర్తనలకు భరత నాట్యం, ఫోక్ డ్యాన్స్, తాళ భజన, కృష్ణ లీలలు ప్రదర్శించారు.డిపిపి ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజగోపాల రావు, డిపిపి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనంద తీర్థా చార్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
Tags:Impressive art performances in Srivari Vahana Seva
