ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు
విశాఖపట్టణం ముచ్చట్లు:
నేవీ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి విశాఖపట్టణం సాగరతీరం సిద్ధమవుతోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వేడుకలను వీక్షించేందుకు రానున్నారు. దీంతో విశాఖ సాగరతీరంలో ముందస్తుగా నిర్వహించిన నేవీ డే రిహార్సల్స్ అందరినీ అబ్బురపరిచాయి. జల, వాయు, గగనతలంలో నేవీ తన శక్తి సామర్థ్యాలు చాటుతూ చేసిన ప్రదర్శనలు ఔరా అనిపించాయి. ఒళ్లు గగుర్పొడిచే నేవీ కమాండోస్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం నేవీ డే వేడుకల సందర్భంగా ఆర్కేబీచ్లో జరిగే ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 1971లో దాయాది పాక్పై సాధించిన విజయానికి ప్రతీకగా..నౌకాదళ దినోత్సవం ప్రతియేటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నావికాదళం శక్తి సామర్థ్యాలు చాటి చెప్పే విధంగా..ఈ వేడుకలు విశాఖ సాగర్ తీరంలో నిర్వహిస్తారు. డిసెంబర్ 4న నేవీడే సాగరతీరంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది తూర్పు నావికాదళం.నేవి డే వేడుకల కోసం విశాఖసాగర్ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆర్కె బీచ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది అధికార యంత్రాంగం. ఇక వారంరోజుల ముందునుంచే నేవీ రిహార్సల్స్ చేస్తోంది. గగనతంలో యుద్ధ విమానాలు,
హెలికాప్టర్లు శక్తి సామార్థ్యాలు చూపుతుండగా..సముద్ర జలాల్లో యుద్ధనౌకలు విన్యాసాలతో ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. మరోవైపు భూ ఉపరితలంపై నుంచి శత్రువులను తుద ముట్టించేందుకు నేవీ కమాండోస్ చేసిన రిహార్సల్స్ సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలిచాయి.ముఖ్యంగా విశాఖపట్టణం నావికాదళ ఆయుధ సంపత్తిని, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు అన్ని కూడా విపత్తుల సమయాల్లో ఏ విధంగా సహాయక చర్యలు అందిస్తాయో ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు విన్యాసాల ద్వారా.. భారత నావికా దళానికి వెన్నెముకగా తూర్పు నావికా దళం సేవలు అందిస్తోంది.1968 మార్చి 1న విశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం( ఈఎన్సీ ) కార్యకలాపాలు ప్రారంభమై చరిత్రకు శ్రీకారం చుట్టింది. 1971 మార్చి1న ఈఎన్సీ చీఫ్గా వైస్ అడ్మిరల్ నియామక శకం మొదలైంది. క్రమక్రమంగా ఈఎన్సీ విస్తరించింది.1971 నవంబర్ 1 నుంచి ఈఎన్సీ ఫ్లీట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

Tags; Impressive Navy Day maneuvers
