ఇన్ ఛార్జులే దిక్కు (వరంగల్)

Date:18/09/2018
వరంగల్ ముచ్చట్లు:
పాఠశాల విద్యను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించే డీఈఓతోపాటు ఎంఈఓల్లో ఇన్‌చార్జిలే అధికంగా ఉన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న నారాయణరెడ్డికి ఇటీవల డైట్‌ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా పదోన్నతిని కల్పించి బదిలీ చేశారు.
ఆయనకే వరంగల్‌ రూరల్‌ జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖాధికారిగా బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్‌ ఎంఈఓలు లేక ఆయా మండలాల్లోని గెజిటెడ్‌ హెచ్‌ఎంలను ఇన్‌చార్జి ఎంఈఓలుగా నియమించారు.
జిల్లాలోని 16 మండలాలకుగాను ఒక్కరే రెగ్యులర్‌ ఎంఈఓ ఉన్నారు. నల్లబెల్లి మండల విద్యాశాఖ అధికారిగా దేవా మినహా మిగతా మండలాలకు ఇన్‌చార్జీలే  కొనసాగుతున్నారు.
ఖానాపు రం, నర్సంపేటకు ఇన్‌చార్జి ఎంఈఓగా దేవా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగతా చోట్ల సీనియర్‌ ప్రధానోపాధ్యాయులు ఇన్‌చార్జీ ఎంఈ ఓలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సొంత పాఠశాల పర్యవేక్షణతోపాటు మిగతా పాఠశాలల పర్యవేక్షణ వారికి అదనపు భారంగా మారింది. దీంతో ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల విధుల నిర్వహణపై పర్యవేక్షణ కరువైంది. దీంతో పలు పాఠశాలలు గాడి తప్పుతున్నాయనే ఆరోపణలున్నాయి.
దీంతో చాలాచోట్ల విద్యార్థుల సంఖ్య సైతం తగ్గుముఖం పడుతోంది. రెండు చోట్ల పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు.ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. దీంతో ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు ఇతర మండలాలకు బదిలీ అయ్యారు.
దుగ్గొండి ఇన్‌చార్జి ఎంఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాసంతి హసన్‌పర్తి మండలంలోని చింతగట్టు జెడ్పీ హైస్కూల్‌కు, చెన్నారావుపేట ఎంఈఓగా పని చేస్తున్న పర్వేజ్‌ ధర్మసాగర్‌ మండలం కూనూరు జెడ్పీ హైస్కూల్‌కు, గీసుకొండ ఇన్‌చార్జి ఎంఈఓ సృజన్‌తేజ నెక్కొండ మండలం సూరిపల్లి జెడ్పీ హైస్కూల్‌కు హెచ్‌ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో పని చేస్తున్న వారు ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారు. వారు పనిచేస్తున్న పాఠశాలకు, ఇన్‌చార్జి ఎంఈఓగా బాధ్యతలు  నిర్వర్తిస్తున్న మండలానికి మధ్య సుమారు 50 కిలోమీటర్లపైనే దూరం ఉంటుంది. దీంతో పర్యవేక్షణ కష్టంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో ఎంఈఓలను నియమించాలని కోరుతున్నారు.
Tags: In charge of direction

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *