Natyam ad

కరీంనగరంలో.. ఇసుక మాఫియా

కరీంనగర్ ముచ్చట్లు:


ఇసుక మాఫియాతో రూలింగ్పార్టీ లీడర్లు మిలాఖత్ అయి మానేరులో మట్టి రోడ్లు వేస్తున్నారు. పంచాయతీ నిధులతో రోడ్లు వేసి మరీ ఇసుక రవాణాకు శాయశక్తులా సహకరిస్తున్నారు. విషయాన్ని కప్పిపుచ్చేందుకు రోడ్లకు టోల్గేట్లు పెట్టి సామాన్యుల నుంచి పైసలు సైతం వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మానేరులో రాకపోకల కోసమే రోడ్లు వేశామని, ఇసుక రవాణా కోసం కాదని మభ్యపెడుతున్నారు. రాత్రి 7 దాటిందంటే చాలు తెల్లవారేదాకా ఈ రోడ్ల మీదుగా వందలాది ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకోసం ఇసుక మాఫియా నుంచి లీడర్లకు భారీ మొత్తంలో ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు చోట్ల నడుస్తున్న ఇసుక క్వారీల కోసమే రోడ్లు వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు తగినట్లే చీకటి పడిందంటే వందలాది ట్రాక్టర్లు రాత్రంతా ఇసుక రవాణా చేస్తుంటాయి. ఇక్కడ ఇసుక క్వారీలు అఫీషియల్గా నడుస్తున్నప్పటికీ వాగులో మట్టి రోడ్లు వేసేందుకు ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఇసుక వ్యాపారులు చక్రం తిప్పి విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతో మట్టి రోడ్లు పోయిస్తున్నారు.

 

 

దీనిపై ఫిర్యాదులొస్తే తొలగించే అవకాశం ఉండటంతో జనం రాకపోకలకు అనే నాటకం ఆడుతున్నారు. ఇందుకు ఏకంగా టోల్గేట్లు పెట్టారు. కానీ ట్రాక్టర్ల నుంచి ఎలాంటి ట్యాక్స్ వసూలు చేయరు. దీని వెనుక నియోజకవర్గ స్థాయి లీడర్లు ఉన్నారని తెలుస్తోంది. అధికారులకు ముడుపులు అందినట్లు తెలుస్తోంది  పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్మండలం కిష్టంపేట, ముత్తారం మండలం ఓడెడు వద్ద మానేరు నదిపై గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో టోల్గేట్లు పెట్టి సామాన్యుల నుంచి టోల్ఫీజు వసూలు చేస్తున్నారు. తీసుకున్న పైసలకు వీడీసీ పేరుతో రశీదులు కూడా ఇస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వాగులో రాకపోకల కోసమే మట్టి రోడ్లు వేశామని సర్పంచులు చెప్తున్నారు. నిజానికి కిష్టంపేట నుంచి జమ్మికుంట వైపు, ఓడెడ్ నుంచి భూపాలపల్లి జిల్లా వైపు జనం రాకపోకలు పెద్దగా ఉండవు. ఈ రెండు మార్గాల్లో రోజుకు పదికి మించి బైకులు కూడా పోవు. కానీ కిష్టంపేట రోడ్డుపై పెట్టిన టోల్గేట్ను రూ.2.3 లక్షలకు, ఓడెడ్వద్ద టోల్గేట్కు ఏకంగా రూ.22 లక్షలకు టెండర్లు వేశారు

 

 

Post Midle

అనధికార  టోల్ గేట్లు
ఇసుక ద్వారా ఆదాయం వస్తుందన్న సాకుతో టీఎస్ఎండీసీ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు తార్కాణంగా నిలుస్తోంది పెద్దపల్లి జిల్లా రీచ్‌లు. మానేరు నదిలో చెక్ డ్యాంల నిర్మాణం కోసం డిసిల్ట్రేషన్ లో భాగంగా పలు చోట్ల ఇసుక రీచ్ లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 25 రీచ్ లకు టెండర్లకు టీఎస్ ఎండీసీ అధికారులు పిలిచారు. 25 చోట్ల కూడా ఇసుక రీచ్ లను కాంట్రాక్టర్లు దక్కించుకోగా ఇప్పటి వరకు జిల్లాలో సుమారు పదిచోట్ల మాత్రమే ఇసుక సేకరణ ప్రక్రియ జరుగుతున్నట్టు టీఎస్ ఎండీసీ వెబ్ సైట్ లో వివరించారు. అయితే వాస్తవాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతున్నాయి.

 

 

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ రీచ్ వద్ద ఇసుక సేకరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ అగ్రిమెంట్‌తో పాటు ఇతరాత్ర ఫార్మాలిటీస్ పూర్తి కాకున్నా అడ్వాన్స్ గా స్టాక్ యార్డులోకి ఇసుకను తరలిస్తుండడం గమనార్హం. టీఎస్ఎండీసీ నిబంధనల ప్రకారం అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయితే తప్ప రీచ్‌ల నుండి ఇసుకను స్టాక్ యార్డుకు తరలించకూడదని తెలుస్తోంది. కానీ అడవి శ్రీరాంపూర్ మానేరు నది వద్ద మాత్రం నిబంధనలకు పాతర వేసి స్టాక్ యార్డ్ ఏర్పాటు చేయడం విస్మయం కల్గిస్తోంది. రీచ్ ల వద్ద ప్రత్యేక్షంగా ఉండి పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిని కట్టడి చేయకపోవడం ఏంటో అంతుచిక్కకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.వారం పది రోజులుగా దర్జాగా సాగుతున్న ఈ తంతు రూల్స్‌కు విరుద్దమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వందల కోట్లలో ఆదాయాన్ని అందిస్తున్నామన్న సాకును చూపుతున్న అధికారులు ఇలాంటి వ్యవహారాలను నిలువరించే విషయాలను కప్పిపుచ్చుతున్నారన్న చర్చ కూడా స్థానికంగా సాగుతోంది. అడవి శ్రీరాంపూర్ క్వారీ నుండి ఇప్పటికే లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుకను స్టాక్ యార్డ్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. నిత్యం మానేరులో తోడుతూ, స్టాక్ యార్డుకు తరలిస్తూనే ఉన్నా టీఎస్ఎండీసీ యంత్రాంగం నియంత్రిచే పాపాన పోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఒకవేళ ఇసుక తీసుకునేందుకు అధికారులు అధికారికంగా అనుమతి ఇస్తే ఇక్కడ స్టాక్ యార్డ్ ఉన్నట్టుగా ఆన్ లైన్‌లో చూపించే వారు.

 

 

కానీ ఆన్ లైన్ లో అడవి శ్రీరాంపూర్ రీచ్ ను అధికారికంగా చూపించకుండానే ఇసుకను స్టాక్ యార్డుకు తరలిస్తున్నారంటే దీని వెనక మర్మమేదో ఉందని స్పష్టం అవుతోంది. స్టాక్ యార్డు ఏర్పాటు వెనక రాత్రి వేళల్లో అనధికారికంగా ఇసుకను తరలిస్తున్నారా లేక మరేదైనా కారణం ఉందా అన్న విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రీచ్ అధికారికంగా ప్రారంభం అయితే స్టాక్ యార్డుకు తరలించిన ఇసుక అధికారిక లెక్కలకు చేరుతుందన్న కారణంగా అడ్వాన్స్ స్టాక్ యార్డు స్టార్ట్ చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అధికారులు స్టాక్ యార్డ్‌ను పరిశీలిస్తే ఇప్పటికే అక్కడ ఇసుక ఎంత పరిమాణంలో ఉంది, అనుమతి ఇచ్చింది ఎంత అన్న వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కానీ అధికారులు మాత్రం అలాంటి సాహసం చేసే అవకాశాలు లేవని గత వారం పది రోజులుగా స్టాక్ యార్డుకు తరలించిన ఇసుకే సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.వడ్డించే వాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్నా ఫర్లేదు అన్నట్టుగా ఉంది ఇక్కడ సాక్షాత్కరిస్తున్న తీరు. రానున్నది వర్షాకాలం కాబట్టి అడ్వాన్స్ గా స్టాక్ యార్డుకు ఇసుక తరలిస్తున్నామన్న సాకును చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే వర్షాకాలంలో ఇసుక సేకరణ ప్రక్రియ ఎన్ని రోజులు నిలిచిపోతే తిరిగి అన్ని రోజుల పాటు ఇసుకను సేకరించుకునే వెసులుబాటును కూడా టీఎస్ఎండీసీ కల్పిస్తోంది. అంతేకాకుండా వర్షాలు ప్రారంభం అయితే చెక్ డ్యాం పనులు చేపట్టే అవకాశాలు ఉండవు. కానీ అధికారులు మాత్రం అనుమతి లేకుండా స్టాక్ యార్డును నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.

 

Tags: In Karimnagar .. Sand Mafia

Post Midle

Leave A Reply

Your email address will not be published.