పుంగనూరులో రాత్రి గస్తీలో కాసులకు కక్కుర్తిపడ్డ పోలీసులు
-ఫిర్యాదు చేసి కేసులో ఇరుక్కున వ్యాపారులు
– ఇద్దరిపై సస్పెన్షన్వేటు
– అక్రమార్కులపై హెచ్చరికలు
పుంగనూరు ముచ్చట్లు:
అక్రమ మధ్యం, హాన్స్, గుట్కామసాల, పాన్‌మసాల, పోగాకు లాంటి హానికర పదార్థాల రవాణాను నియంత్రించాల్సిన పోలీసులు అర్ధరాత్రి గస్తీలో కాసుల కోసం కక్కుర్తి పడటం, లంచం ఇవ్వలేక వ్యాపార బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి ఇద్దరి పోలీసులను సస్పెండ్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.
పుంగనూరు సెబ్ పోలీసులు చక్రీనాయక్, వెంకటాచలపతి ఇద్దరు గత నెల 29న విధి నిర్వహణలో భాగంగా మఫ్టీలో పంజాణి మండలం తుర్లపల్లె వద్దకు వెళ్లారు. ఆ సమయంలో పంజాణి మండలం రాయలపేటకు చెందిన రాజేష్, సాయికుమార్, మురళికృష్ణలు ద్విచక్రవాహనాలపై హాన్స్, గుట్కా తదితర నిషేధిత వస్తువులను కర్నాటక నుంచి తీసుకుని రాయలపేటకు వెళ్తుండగా మఫ్టీలో ఉన్న సెబ్ పోలీసులు వారిని అర్ధరాత్రి ఆపి రూ. 30 వేలు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాధితులకు పోలీసులు మఫ్టీలో ఉండటంతో అనుమానం వచ్చి రాజేష్, సాయికుమార్ , మురళికృష్ణ లు డబ్బులు తీసుకొస్తామని సెబ్ పోలీసులకు చెప్పి ఒకరు మాత్రం వెళ్లి పంజాణి ఎస్ఐ స్వర్ణతేజకు ఫిర్యాదు చేశారు. ఆమె హుటాహుటిన తుర్లపల్లె సమీపానికి చేరుకుంది. పోలీస్‌జీపు రావడంతో మఫ్టీలో ఉన్న చక్రీనాయక్, వెంకటాచలపతి ఇద్దరు పరారైయ్యారు. వెంటనే ఎస్ఐ గుట్కాలు తరలిస్తున్న ముగ్గరిని అదుపులోనికి తీసుకుని, స్టాకును స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. అర్ధరాత్రిలో డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులు సెబ్ పోలీసులుగా నిర్ధారణ కావడంతో ఆమె జిల్లా అడిషినల్ ఎస్పీ జగదీష్‌కు నివేదికలు పంపారు. ఆయన విచారణ చేపట్టి, వాస్తవాలు రుజువుకావడంతో సెబ్ పోలీసులు చక్రీనాయక్, వెంకటాచలపతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటన సెబ్ పోలీసుల్లో సంచలనం రేకితిస్తోంది. అర్ధరాత్రి వేళ మఫ్టీలో వెళ్లడం, డబ్బులు డిమాండ్ చేయడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి , అక్రమార్కులపై వేటు వేశారు. కాగా అక్రమ వ్యాపారులు పోలీసులను తగిలించి, వారు కూడ కేసుల్లో ఇరుక్కోవడంపై సర్వత్ర చర్చనీయాంశమైంది.
Tags: In Punganur, the policemen came across money during the night patrol