కొత్త ఏడాదిలోనే…బాథ్యతలు

Date:05/12/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

తాజా ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందించారు. ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ఇంకా రెండు నెలలు ఉండటంతో.. కొత్తగా ఎన్నికైనవారికి కార్పొరేట్‌ హోదా రావాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం పాలకవర్గం గడువు ముగిశాక ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నది. అయితే, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టంలో సవరణ చేయడం ద్వారా గడువుకుముందే పాత పాలకవర్గాన్ని రద్దుచేసి ప్రభుత్వం కొత్త పాలకవర్గం కొలువుదీరేలా చేసే అవకాశం ఉన్నది.జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికల్లో కార్పొరేటర్లతోపాటు, ఎక్స్‌అఫీషియో సభ్యులను కూడా కలిపి లెక్కిస్తారు. దీనిప్రకారం హాజరైన మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువమంది మద్దతు ఉన్నపార్టీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకుంటుంది. కానీ, తాజాగా వెలువడిన గ్రేటర్‌ ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ రెండు పదవుల ఎన్నికపై చర్చ కొనసాగుతున్నది. వాస్తవంగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు జీహెచ్‌ఎంసీ చట్టంలో ప్రత్యేక నిబంధనలను పొందుపర్చారు. కొత్తపాలకవర్గం కొలువుదీరడానికి ముందుగా హైదరాబాద్‌ కలెక్టర్‌ను రిటర్నింగ్‌ అధికారిగా నియమించి.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేస్తుంది.

 

 

 

ఈ క్రమంలోనే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకొనేందుకు అవకాశమిస్తూ రిటర్నింగ్‌ అధికారి మరో నోటిఫికేషన్‌ ఇస్తారు. గ్రేటర్‌ పరిధిలో ఓటుహక్కు ఉండి, ఇతర ఏ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గతంలో ఓటుహక్కును వినియోగించుకోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. అనంతరం 150 మంది కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలతో కలిపి మేయర్‌ ఎన్నిక కోసం ఓటర్ల జాబితాను రూపొందిస్తారు.మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించి కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులందరికీ మూడ్రోజుల ముందే సమాచారమందిస్తారు. ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తారు. మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో కనీసం సగం మంది (కోరం) ఉంటేనే సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ సమావేశంలో కార్పొరేటర్లుగా గెలిచినవారు ప్రమాణ స్వీకారం చేశాక ఎన్నిక ప్రక్రియను మొదలుపెడతారు. ఉదాహరణకు ఎక్స్‌అఫీషియోలు, కార్పొరేటర్లు కలిపి 200 మంది ఉంటే.. కనీసంగా వందమంది హాజరైతేనే ప్రత్యేక అధికారి సమావేశాన్ని నిర్వహిస్తారు. సమావేశంలో మేయర్‌ అభ్యర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే, మరొక సభ్యుడు మద్దతు తెలుపాల్సి ఉంటుంది.

 

 

కార్పొరేటర్‌గా ఎన్నికైనవారే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు అర్హులు. ఎక్స్‌అఫీషియో సభ్యులకు పోటీచేసే అవకాశం ఉండదు. మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవుల కోసం ఏ పార్టీఅయినా తమ అభ్యర్థులను పోటీలో ఉంచవచ్చు.ఆయాపార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాక.. గుర్తింపుపొందిన పార్టీలు విప్‌లు జారీచేస్తాయి.ప్రత్యేకాధికారి నామినేషన్లవారీగా పోటీలో ఉన్న అభ్యర్థులను పిలిచి చేతులెత్తే విధానంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను నిర్వహిస్తారు. పోటీలోఉన్న ప్రతి అభ్యర్థి ఓట్లను లెక్కించి.. ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉన్నవారిని మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా ప్రకటిస్తారు.

పుంగనూరు ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Tags: In the new year itself … Liabilities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *