రెండో వన్డేలోనూ భారత్ జట్టు ఘన విజయం

In the second ODI, India has been a huge success
Date:26/01/2019
న్యూజిలాండ్  ముచ్చట్లు:
మైదానం మారినా టీమిండియా ప్రదర్శనలో మాత్రం జోరు తగ్గలేదు. అదే జోష్.. అదే ఉత్సాహంతో మరో మ్యాచ్‌లోనూ సమష్టిగా రాణించి ప్రత్యర్థిని మట్టికరిపించారు. సొంతగడ్డపై తిరుగులేని రికార్డు ఉన్న న్యూజిలాండ్‌ను మరో వన్డేలో చిత్తుగా ఓడించి కోహ్లీసేన సత్తా చాటింది. న్యూజిలాండ్‌ గడ్డపై వరుసగా రెండో వన్డేలోనూ భారత్ జట్టు ఘన విజయం సాధించింది. మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ (87: 96 బంతుల్లో 9×4, 3×6), శిఖర్ ధావన్ (66: 67 బంతుల్లో 9×4), మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (48 నాటౌట్: 33 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు మెరిపించడంతో 324 పరుగులు చేసిన భారత్.. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (4/45) చెలరేగడంతో న్యూజిలాండ్‌ని 234 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో.. 90 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా.. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగానే జరగనుంది. మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. శనివారం జరిగిన రెండో వన్డేలో భువనేశ్వర్ కుమార్(2 42), చాహల్(2/52) చైనామన్ బౌలర్ కుల్దీప్(4/45) యాదవ్‌ల ధాటికి కివీస్ 40.2 ఓవర్లలో 234 పరుగులకే కుప్పకూలింది.
దీంతో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ మార్టిన్ గప్తిల్(15)ను ఔట్ చేసి భువనేశ్వర్ భారత్‌కు శుభారంభం అందించాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో నిలకడగా కనీసం 50కి పైగా పరుగులు సాధిస్తూ వస్తున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజులోకి రాగానే వేగంగా ఆడాడు. రెండు సిక్సర్లు బాది జోరు మీదున్న కేన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత మరో విధ్వంసకర ఓపెనర్ మున్రో(31)ను చాహల్ ఎల్బీడబ్లూగా వెనక్కి పంపడంతో 84 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. కుల్దీప్ తన స్పిన్ మాయాజాలంతో మిడిలార్డర్ పుంజుకోకుండా కివీస్ ఆటగాళ్లు టామ్ లాథమ్(34), హెన్రీ నికోల్స్(28), గ్రాండ్ హోం(3)లను పెవిలియన్ పంపి టీమిండియాకు విజయాన్ని ఖరారు చేశాడు. ఆఖర్లో బ్రాస్‌వెల్(57: 46 బంతుల్లో) ఫోర్లు, సిక్సర్లతో అర్ధశతకంతో మెరిసినా ప్రయోజనం లేకపోయింది.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 324 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్ బౌలర్లపై విరుచుకుపడి భారత ఆటగాళ్లు తమదైన శైలిలో పరుగులు రాబట్టారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(87), శిఖర్ ధావన్(66) అర్ధశతకాలతో చెలరేగారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(43), అంబటి రాయుడు(47), ధోనీ(48 నాటౌట్), కేదార్ జాదవ్(22 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. మొదటి ఐదుగురు బ్యాట్స్‌మెన్ అందరూ 40కి పైగా స్కోరు సాధించడం భారత క్రికెట్లో ఇదే తొలిసారి కావడం విశేషం. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఫర్గుసన్ చెరో రెండు వికెట్లు తీశారు.
Tags:In the second ODI, India has been a huge success

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *