అనంత జిల్లాల్లో ఆగని వలస బాట

Date;28/02/2020

అనంత జిల్లాల్లో ఆగని వలస బాట

అనంతపురంముచ్చట్లు

అనంతపురం జిల్లాలో వరుస కరవుతో ఇప్పటికే గ్రామీణ ప్రాంతవాసులు పొట్టకూటి కోసం తమ గ్రామాలను వదిలి వలస బాట పడుతున్నారు. ఎలాగైనా జిల్లాలో వలసలు తగ్గించాలన్న సదుద్దేశ్యంతో జిల్లాలో అదనంగా ఉపాధి పనులు చేయిస్తున్నారు. కొంతవరకు కూలీల్లో ఆనందం నింపినప్పటికీ పనులకెళ్లినప్పుడు బండలా మారిన నేలను తవ్వడానికి వారు నానాయాతన పడుతున్నారు.. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఉపాధి పనుల్లో పాల్గొన్న వారి కూలీ మొత్తాలు, ఇతరత్రా సామాగ్రి కోసం రూ. 446.70 కోట్లు ఖర్చు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అధికంగా ఫారం పాండ్ పనులు జరుగుతున్నాయి. ఒక్క క్యూబిక్ మీటర్ తవ్వితే రూ. 221లు కూలీ అందజేస్తున్నారు. ఉపాధి పనులకు వెళ్ళే ఒక కూలీ రోజుకు కనీసం ఒక్క క్యూబిక్ మీటర్ అయినా తవ్వుకుంటే కూలీ గిట్టుబాటు అవుతుంది. అయితే ప్రస్తుతం భగభగమంటున్న ఎండలతో భూమిలో ఏమాత్రం తడి లేక ఎంత తవ్వినా నేల తెగడం లేదు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు శ్రమించినా నేల పూర్తిగా గట్టిగా వుండటంతో కనీసం ఒక్క క్యూబిక్ మీటర్ లెక్కన కూడా తవ్వుకోలేని పరిస్థితి వుందని కూలీలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. నేల గట్టి పడటంతో తవ్వలేక పోతున్నామని అధికారులకు తెలిపితే నీళ్లు పోసి మెత్త పడ్డాక తవ్వుకోండని వాటికి సంబంధించి కూడా డబ్బులిస్తామని అంటున్నారని కూలీలు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఎండలకు బోర్లలో నీళ్లు లేక తాగునీటికే అవస్థలు పడుతున్న సమయంలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేసుకుని నేలను తడిపి తవ్వండని అధికారుల చెప్పడం హాస్యాస్పదం. ముఖ్యంగా కూలీలు ఉపాధి పనులు చేసే సమయంలో ఎటువంటి బండ రాళ్లు లేని స్థలాన్ని చూపడంతోపాటు పనులు జరిగే సమయంలో అన్ని సౌకర్యాలను సమకూర్చాల్సిన బాధ్యత అధికారులపై వుంది. కానీ అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. తాగునీటి సౌకర్యం కల్పించాల్సి వున్నా అందుకు అదనంగా డబ్బులు చెల్లిస్తుండటంతో కూలీలే నీళ్లనైతే తెచ్చుకుంటున్నారు. పనులు చేసే చోట అధికారులు నీడను ఏర్పాటు చేయకపోవడంతో కూలీలు తాగడానికి తీసుకెళ్ళిన నీళ్లన్నీ పూర్తిగా వేడెక్కుతున్నాయి. భగభగ మండుతున్న ఎండకు పనులు చేసి అలసిపోయే కూలీలు వేడెక్కిన నీళ్లు తాగలేకపోతున్నారు. దీంతో గంటల తరబడి తీవ్రమైన ఎండలో పనిచేసి సేద తీరడానికి నీడ లేక, నీళ్లున్నా అవి పూర్తిగా వేడెక్కిపోవడంతో వాటిని తాగక కూలీలు వడదెబ్బకు గురయ్యే అవకాశం వుందని వైద్యులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎండ తీవ్రమయ్యే అవకాశం వుంది. ఉపాధి పనులు జరిగే చోట కూలీలు సేద తీరడానికి, వారు తీసుకెళ్ళిన నీళ్లు, ఆహార పదార్థాలు వేడెక్కకుండా వుండేదుకు నీడను ఏర్పాటుచేయడంతోపాటు ఈ వేసవిలో క్యూబిక్ మీటర్‌కు రూ. 300లు కూలీ పెంచాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.ః

Tags;Incessant Migration in Infinite Districts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *