ఆయుర్వేద ఫార్మశీలో ఔషధాల ఉత్పత్తి సామర్థ్యం పెంపు -టిటిడి జెఈవో సదా భార్గవి
తిరుపతి ముచ్చట్లు:
టిటిడి ఆధ్వర్యంలోని నరసింగాపురంలో గల ఆయుర్వేద ఫార్మశీలో ఔషధాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని టిటిడి జెఈవో సదా భార్గవి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతిగృహంలో గురువారం ఆయుర్వేద ఫార్మశీపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఫార్మశీని బలోపేతం చేసేందుకు మూడు ఇండస్ట్రియల్ షెడ్లు నిర్మించామని, త్వరలో వీటిని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.3.50 కోట్లతో ఔషధాల తయారీ యంత్రాల కొనుగోలుకు అనుమతి ఇచ్చామని, 75 శాతం యంత్రాల ఏర్పాటు జరిగిందని తెలిపారు. మొత్తం 314 రకాల ఫార్ములాలకు ఆయుష్ శాఖ నుండి అనుమతి లభించిందని, వీటిలో 60 రకాల మందులు మొదటి దశలో ఉత్పత్తి చేసి రోగులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

పెండింగ్‌లో ఉన్న ఇంజినీరింగ్ పనుల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకు, సంపు, మరుగుదొడ్ల నిర్మాణం, సిసి కెమెరాల ఏర్పాటు, పెయింటింగ్ తదితర పనులను మార్చి 15లోపు పూర్తి చేయాలని జెఈవో ఆదేశించారు. తులసివనాల తరహాలో ఫార్మశీ ఆవరణలో ఔషధ మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. డిఎఫ్‌ఓ ఆధ్వర్యంలో టిటిడికి చెందిన బ్రాహ్మణపట్టు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, కల్యాణి డ్యామ్, నరసింగాపురం, ఇతర టిటిడి నర్సరీల్లో ఔషధ మొక్కలు పెంచాలన్నారు. ఈ సమీక్షలో డిఎఫ్‌వో శ్రీనివాస్, ఫార్మశీ ఇన్‌చార్జి డాక్టర్ నారపరెడ్డి, ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రేణుదీక్షిత్, ఐటి జిఎం సందీప్, ఇఇలు మనోహర్, మురళి, డిఇ సరస్వతి, అలిపిరి ఎవిఎస్వో విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
Tags:Increasing the production capacity of medicines in Ayurvedic pharmacy – TTD JEO Sada Bhargavi
