అనంత కష్టాలు (అనంతపురం)

Date:19/07/2018
అనంతపురం ముచ్చట్లు:
కరవు ప్రాంతం అనగానే ఎవరికైనా అనంతపురం జిల్లానే గుర్తుకు వస్తుంది. దశాబ్దాలుగా దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న జిల్లా ఇది. అటువంటి జిల్లాకు కేంద్రం ప్రకటించిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ నిధులు ఎంతో కొంత మేలు చేస్తాయని అంతా భావించారు. అయితే నిధులు పూర్తిస్థాయిలో అందక ప్రగతి పనులు ఆగిపోయాయి.అనంతపురం జిల్లాకు ఎస్డీపీ కింద 2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల్లో రూ.50 కోట్లు చొప్పున మూడేళ్లకు కలిపి రూ.150 కోట్లు జిల్లాకు వచ్చాయి. వీటితో వివిధ శాఖల్లో 2,996 పనులు చేపట్టారు. 2017-18, 2018-19 కూడా నిధులు వస్తాయనే ధీమాతోనే ఎక్కువ పనులు చేపట్టారు. రూ.150 కోట్లు వచ్చినా… మున్ముందు నిధులు  వస్తాయనే నమ్మకంతో గత ఏడాది రూ.169 కోట్ల పనులకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు వీటిలో రూ.126 కోట్ల మేర చెల్లింపులు కూడా జరిగాయి. మిగిలిన నిధులకు ఈ ఏడాది మార్చిలో సీఎఫ్‌ఎంఎస్‌ కారణంగా విడుదలకు కొంత సమస్య వచ్చింది. అవి విడుదల కావాల్సి ఉంది. మరోవైపు 2017-18 సంవత్సరానికి కూడా నిధులు వస్తాయనే నమ్మకంతో వివిధ పనులు మంజూరు చేయగా, ఈ నిధులు రాకపోవడంతో ఇప్పుడు వీటికి చెల్లింపులు పూర్తిగా ఆపేశారు.ఎస్డీపీ నిధులతో ఏపీ సూక్ష్మ నీటి సేద్యం శాఖ పరిధిలో రూ.29 కోట్లతో రెయిన్‌గన్స్‌ కొనుగోలు చేశారు. అలాగే తాగునీటి పనులకు ఆర్‌డబ్ల్యూఎస్‌ కింద రూ.61.73 కోట్లు, పంచాయత్‌రాజ్ శాఖ పరిధిలోని రహదారులు, భవనాలు తదితర నిర్మాణాలకు రూ.64 కోట్లు వెచ్చించారు. ఇంకా వ్యవసాయశాఖ, డీఆర్‌డీఏ, అటవీ, ఉద్యావన శాఖ తదితరాలకు ఇతర నిధులు వెచ్చించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఎస్డీపీ కింద జిల్లాలకు కొంత నిధులిస్తామని నిర్ణయించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని ఎడారి నివారణ ప్రాజెక్టుపై దృష్టిపెట్టింది. బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల్లో వేదవతి నదిని ఆనుకొని దాదాపు 20 వేల ఎకరాలు ఎడారిగా మారింది. పెద్ద ఎత్తున ఇసుక పొలాల్లో పేరుకుపోయింది. ఏటా ఇది 0.38 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తోందని కొంత కాలం కిందట నిర్వహించిన పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో ఎడారి నివారణకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని మంత్రి కాలవ శ్రీనివాసులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎస్డీపీ కింద వెనుకబడిన ప్రాంతాలకు నిధులిస్తున్న కేంద్రాన్ని.. ఇక్కడి ఎడారిపై ప్రత్యేక దృష్టిసారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వేదవతి నదిలో చెక్‌డ్యామ్‌ నిర్మాణం, సబ్‌ సర్ఫేజ్‌ డ్యామ్‌ల నిర్మాణం, వివిధ రకాల చెట్లను పెంచడం ద్వారా పడమటి గాలుల ప్రభావం తగ్గించి,  ఎడారి ప్రాంతం మరింత విస్తరించకుండా నివారించే కార్యక్రమం.. తదితరాలకు రూ.80 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు కేంద్రం ఆ నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. అయితే కేంద్రం మాత్రం ఇక్కడి ఎడారి నివారణ ప్రాజెక్టుపై శ్రద్ధ చూపలేదు. కనీసం నిధులు కూడా ఇవ్వలేదు.
అనంత కష్టాలు (అనంతపురం)
Tags; Infinite difficulties (Ananthapur)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *