వేదాల్లో అనంతమైన విజ్ఞానం : ఆచార్య కెవి.దేవనాథన్
తిరుమల ముచ్చట్లు:
మన పూర్వీకులు అందించిన వేదాల్లో అనంతమైన విజ్ఞానం దాగి ఉందని బెంగళూరులోని సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కెవి.దేవనాథన్ తెలిపారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల నానీరాజనం వేదికపై జరుగుతున్న శ్రీనివాస వేద విద్వత్ సదస్సులో శుక్రవారం ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆచార్య దేవనాథన్ మాట్లాడుతూ వేల సంవత్సరాల క్రితమే సూర్యమండలం, భూమ్యాకర్షణ, గణితం, ఖగోళశాస్త్ర సంబంధిత విషయాలు వేదాల్లో తెలియజేశారని తెలిపారు. ఆధునిక వైద్యశాస్త్రానికి అందని ఎన్నో చికిత్సలను వేదాల్లో పొందుపరిచారని చెప్పారు. వర్షాలు, గ్రహణాల రాక, పశుపక్ష్యాదులకున్న శక్తులను వీటిలో తెలిపారని వివరించారు. అమృతత్వాన్ని, ఆనందాన్ని, ధైర్యాన్ని అందించే ఎన్నో విషయాలు వేదాల్లో ఉన్నాయని తెలియజేశారు. ముందుగా చతుర్వేద పండితులు వేదపారాయణం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:Infinite Knowledge in Vedas : Acharya KV. Devanathan
