ఆరంభంలోనే భానుడు ప్రతాపం

Sleeping with sunny

Sleeping with sunny

Date:26/03/2019
మెదక్ ముచ్చట్లు:
వేసవి ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోజూవారి పనులలో భాగంగా జనం బయటకు వెళ్లాలంటేనే మండుటెండలను చూసి జంకుతున్నారు. వేసవి ఆరంభంలోనే ఇంత తీవ్రత ఉంటే ఏప్రిల్, మేలో ఉష్ణోగ్రతలు ఏమేర ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎండవేడి తట్టుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఏటా వేసవిలో మెదక్‌ జిల్లా ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతారు.గతంతో పోలిస్తే ఈసారి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ ఎక్కువగా ఉంటోంది. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి.  ఆ సమయంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, పండ్ల రసాలను సేవిస్తున్నారు. అలాగే ఎండలకు వడదెబ్బ తగులకుండా తలకు రక్షణగా టోపీలు ధరిస్తున్నారు. రుమాళ్లను చుట్టుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు గొడుగులు వేసుకుని వెళుతున్నారు.
వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఈసారి వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో చెరువులు, కుంటలు వట్టిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో  నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో బోర్లు నీళ్లు పోసే సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. సాగు నీరు లేకపోవడంతో పంటసాగు విస్తీర్ణం ఈసారి గణనీయంగా తగ్గింది. చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేకపోవడంతో పశువులు దాహం తీర్చుకునేందుకు అల్లాడుతున్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నీళ్ల కోసం బిందెలు పట్టుకొని సమీప ట్యాంకులు, పొలాలకు పరుగులుపెడుతున్నారు.  సింగూరులో నీటి మట్టం తగ్గిపోవడంతో మిషన్‌ భగీరథ నీటి సరఫరా కొద్ది రోజులుగా నిలిచిపోయింది. ఈసారి తాగు, సాగు నీటికి గడ్డుకాలమేనని పలువురు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడి అధికారులకు సవాల్‌గా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Tags: Initially, Bhanu praised

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *