ప్రాథమిక పాఠశాలలపై కొరవడిన పర్యవేక్షణ

Date:25/12/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక మండలాల్లో ఎంఈవోల పర్యవేక్షణ సరిగా లేదు. కేవలం మూడు మండలాల్లో మాత్రమే రెగ్యులర్‌ ఎంఈవోలున్నారు. మిగతా అన్ని మండలాల్లో ఇన్‌ఛార్జిల పాలన సాగుతోంది. ప్రాథమిక పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. వయసుకు తగిన తరగతిలో కూర్చోవాలనే ఆర్‌టీఐ చట్టం, డిటెన్షన్‌ విధానం లేక పోవడం, హాజరు శాతం ఉంటే ఉత్తీర్ణులవుతారనే భావనలో విద్యార్థులు ఉండడం, చదువుపై శ్రద్ధ చూపించకపోవటం లాంటి కారణాలతో ప్రగతి తగ్గుతోంది.
ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా, వివిధ ఇన్‌ఛార్జిల బాధ్యతల వల్ల పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడుతోంది. వృత్యంతర శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థుల ప్రగతి కోసం ఉపయోగించాల్సిన ఉపాధ్యాయులు వారి కర్తవ్యాలను పాక్షికంగా విస్మరించటం కూడా ఒక ప్రధాన కారణంగా భావించవచ్చు.
మొత్తం మీద విద్యా వ్యవస్థలో ప్రగతి పతనానికి అనేక కారణాలున్నాయి. ప్రాథమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, తద్వారా ఆరో తరగతి ఇన్‌పుట్‌ విద్యార్థుల్లో నాణ్యతను పెంచడం, 6, 7, 8, 9 తరగతులకు కూడా సకాలంలో సిలబస్‌ పూర్తి చేయటం లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కువగా సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే వివరణాత్మక ప్రశ్నలపై ఎక్కువ దృష్టి పెడతారు. మన పరీక్ష విధానం కూడా వీటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. కానీ ఎన్‌ఏఎస్‌ పరీక్ష పత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్‌(లక్ష్మాత్మక) ప్రశ్నలు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడటంతో ప్రగతి తగ్గినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో అయిదో తరగతి వరకు తెలుగు మాథ్యమంలో చదివిన పిల్లలు చాలామంది ఆరో తరగతిలో ఆంగ్ల మాథ్యమంలో చేరారు. వీరికి ప్రశ్న పత్రం అర్థం కాలేదు. కింది తరగతుల్లో  విషయాలపై ప్రశ్నలు వచ్చినా పదకోశంలోని మార్పుల వల్ల వారికి పేపర్‌ అర్థం కాక సరిగా జవాబులు రాయలేకపోయారు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు గానీ, పట్టణ ప్రాంత పిల్లల్లో గానీ ఈవిషయం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఉన్నత పాఠశాలల్లో ఒక్క పదోతరగతి ఫలితాలపైనే దృష్టి పెట్టడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి.
Tags:Insufficient monitoring of primary schools

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *