భీమా..ఏది ధీమా?

Date:10/08/2018
మహబూబ్‌నగర్ ముచ్చట్లు:
వరుణుడు మొఖం చాటేయడంతో తెలంగాణ రైతాంగంలో ఆందోళన వెల్లువెత్తుతోంది. మొదట్లో మురిపించిన వర్షాలు ప్రస్తుతం అడ్రస్సే లేకుండా పోయాయి. ఫలితంగా నీటితో కళకళలాడాల్సిన పలు ప్రాజెక్టులు ఎడారులను తలపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లోని భీమానది కూడా ఇదే దుస్థితిలో ఉంది. వానాకాలంలో నీటితో ఉండాల్సిన నది.. ప్రస్తుతం రాళ్లు రప్పలతో దర్శనమిస్తోంది. కొన్నివారాల క్రితం కురిసిన వర్షాలకు నదిలో నీళ్లు చేరాయి. నీరు బాగానే ఉంది కదా అని పంటలు వేసుకున్న రైతులకు ప్రస్తుతం కష్టాలు ఎదురవుతున్నాయి. పంటలు వేసుకున్న తొలినాళ్లలోనే అన్నదాతలకు నీటి గండం ఎదురైంది. వేసవిలో ఉండాల్సిన పరిస్థితి వర్షాకాలంలోనూ కొనసాగుతుండడంతో వారిలో ఆవేదన వెల్లువెత్తుతోంది. భీమానది కృష్ణా మండలంలో ఏడు కి.మీ ప్రవహిస్తుంది. మండలంలోని పంటపొలాలకు ఈ నది నీటి అవసరాలు తీర్చుతుంటుంది. ఇలాంటి కీలకమైన నీటి వనరు ప్రస్తుతం వట్టిపోయింది. 15 రోజులుగా ఎగువ నుంచి చుక్క నీరు రావడం లేదు. దీంతో వందల ఎకరాల్లో వరిపంట ఎండిపోతోంది. ఇక ఈ నదీ తీరంలో ఉన్న తంగిడిగి ఎత్తిపోతల పథకానికీ నీటి సమస్య ఉత్పన్నమైంది. వారం రోజులుగా నీరు అందకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.భీమానదీ తీరంలో సూకూరులింగంపల్లి మొదలుకొని తంగిడిగి వరకూ దాదాపు 10 వేల ఎకరాల భూమి సాగులో ఉంది. తంగిడిగి ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 600 ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతోంది. అయితే ప్రస్తుతం నీళ్లు అందకపోవడంతో ఈ పథకం వారం రోజులుగా మూత పడింది. ఇక నదీ తీరంలో సొంత లిఫ్టులతో నీరు తోడుకునే రైతులు నది మధ్యలోని గోతుల్లోకి మోటార్లు మార్చుకుని నీళ్లు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆ గోతులు కూడా వట్టిపోయాయి. దీంతో కర్షకుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పొలాల్లో మొదటి విడత ఎరువులు వేసుకున్నారు. రెండో దఫా ఎరువులు వేయడానికి రెడీఅవుతున్న సమయంలో సాగునీరు లేకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. వర్షాలు లేక, ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందక పంటను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి పలువురు రైతులు ఓ సూచన చేస్తున్నారు. కృష్ణా నదికి ఎగువన ఉన్న నారాయణపూర్‌ డ్యాం కాలవలకు నీరు వదిలితే మిగులు నీళ్లు భీమానదికి చేరతాయని అంటున్నారు. ఈ అంశాన్ని పరిశీలించి అధికారులు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags:Insurance?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *