ఉత్తరాంధ్రలో  ఆసక్తికరంగా మారిన రాజకీయాలు

 Date:10/08/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య ఆస‌క్తిక‌ర రాజ‌కీయం మొద‌లైంది. ముఖ్యంగా చివ‌ర‌న ఉన్న శ్రీ‌కాకుళం జిల్లాలో మ‌రింత‌గా పోటీ నెల‌కొంది. ప్రస్తుతం టీడీపీ గ్రాఫ్ కొంత త‌గ్గుతూ ఉన్నా.. దానిని క్యాష్ చేసుకోవ‌డంలో మాత్రం ప్ర‌తిప‌క్ష నాయ‌కులు విఫ‌ల‌మ‌వుతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. సీనియ‌ర్లు ఎంత‌మంది ఉన్నా.. ఎవ‌రికి వారు త‌మ వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌వ‌డం, ఐక‌మత్యంతో ముందుకు వెళ్ల‌క‌పోవ‌డంతో రాజ‌కీయంగా కొంత ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌స్తుతం శ్రీ‌కాకుళం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఒక‌ప‌క్క ప్ర‌స్తుతం ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు వ్య‌క్తిగ‌తంగా, రాజ‌కీయంగా దూసుకుపోతూ ఉంటే.. వైసీపీలో మాత్రం ఇంకా ఒక స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. సీనియ‌ర్ నాయ‌కుల‌ను రంగంలోకి దించాల‌ని పార్టీ అధినేత జ‌గ‌న్‌ భావించినా..ఇంకా దీనిపై స్పష్టత రాలేదు.శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడి పేరు రాష్ట్ర స్థాయిలోనే కాదు.. ఢిల్లీ స్థాయిలో మారుమోగిపోతోంది. అన్ని అంశాల‌పై అవ‌గాహ‌న‌తో పార్ల‌మెంటులో ఆయ‌న చేస్తున్న ప్ర‌సంగాలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. తండ్రి ఎర్ర‌న్నాయుడి మ‌ర‌ణంతో అనూహ్యంగా 2014 ఎన్నిక‌ల్లో తొలిసారి అడుగుపెట్టిన రామ్మోహ‌న్ నాయుడు.. అన‌తి కాలంలోనే నాయ‌కుడిగా ఎదిగారు. ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉంటూ.. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇక రాష్ట్ర స‌మ‌స్య‌లపై ఢిల్లీ పెద్ద‌ల‌కు అర్ధ‌మ‌య్యేభాష‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడి.. ఇత‌ర నాయ‌కుల‌తో శభాష్ అనిపించు కుంటూనే ఉన్నారు. ఇటీవ‌ల అవిశ్వాసంపై చ‌ర్చ‌లో హిందీలో రామ్మోహ‌న్ చేసిన ప్ర‌సంగం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఫ‌లితంగా ఇటు జిల్లా స్థాయిలోనూ వ్య‌క్తిగతంగా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దీంతో త‌న‌కు పోటీ ఇచ్చేందుకు ప్ర‌త్య‌ర్థులు కూడా ఆలోచించేలా ప‌రిస్థితి మార్చుకున్నారు.ఇక వైసీపీలో మాత్రం గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ స్థానం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా అధికారికంగా ఎవ‌రినీ ప్ర‌క‌టించ‌క‌పోయినా.. పార్ల‌మెంటు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా దువ్వాడ శ్రీ‌నివాస్‌ను నియ‌మించారు. దీంతో ఆయ‌నే బ‌రిలోకి దిగుతార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం వైసీపీకి మాజీ మంత్రులు, సీనియ‌ర్లు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, త‌మ్మినేని సీతారాం పెద్ద‌దిక్కుగా ఉన్నారు. ఎంతో రాజ‌కీయ అనుభ‌వంతో పాటు జిల్లా రాజ‌కీయాల‌పై పట్టు ఉంది. ఈ నేప‌థ్యంలో వీరిలో ఒక‌రిని ఎంపీ స్థానం నుంచి పోటీచేయించాల‌ని జ‌గ‌న్ తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. అయితే ఇద్ద‌రూ ఎంపీగా కాకుండా.. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవ్వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. దీంతో కొత్త అభ్య‌ర్థిగా దువ్వాడ పేరును తెర‌పైకి తీసుకొచ్చారు. అయితే దీని వెనుక కూడా రాజకీయం లేక‌పోలేదంటున్నారు.టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అచ్చెన్నాయుడిని ఢీకొట్టేందుకు బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం వైసీసీ అధినేత జ‌గ‌న్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇక్క‌డ కాళింగ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌ పేరాడ‌ తిల‌క్‌, దువ్వాడ శ్రీ‌నివాస్ మ‌ధ్య పోటీ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ధ‌ర్మాన చ‌క్రం త‌ప్పి.. తన వ‌ర్గానికి చెందిన తిల‌క్‌కు టెక్క‌లి సీటు ఇచ్చి.. పోరు లేకుండా చేసేందుకు దువ్వాడ‌ను శ్రీ‌కాకుళం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ ర్గానికి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించేలా చేశార‌ని భావిస్తున్నారు. దీంతో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టు సాధించేందుకు దువ్వాడ శ్రీ‌నివాస్ త‌న వంతు ప్ర‌యత్నాలు చేస్తున్నారు. మ‌రోప‌క్క శ్రీకాకుళం ప‌ట్ట‌ణానికి చెందిన డాక్ట‌ర్ దానేటి శ్రీ‌ధ‌ర్ పేరు వినిపిస్తోంది. ఏదెలా ఉన్నా ఎన్నిక‌ల వ‌ర‌కు వైసీపీ నుంచి ఎంపీ సీటు ఎవ‌రికి ద‌క్కుతుందో ? చివ‌రి వ‌ర‌కు తేలేలా లేదు. ఇక జ‌న‌సేన కూడా స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా నాయ‌కులు మాత్రం క‌నిపించ‌డం లేదు.
Tags:Interesting politics in Uttarakhand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *