ఖమ్మంలో ఆసక్తికరంగా సీట్లు

నాలుగు పార్టీలు.. 10 సీట్లపై గురి
Date:09/10/2018
ఖమ్మం  ముచ్చట్లు:
తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో అధికార పార్టీని ఢీకొనేందుకు ఉద్భవించిన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ భాగస్వామ్య పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు  ప్రక్రియ ప్రారంభంకాలేదు. మహాకూటమిలో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ పార్టీలతో పాటు తెలంగాణ సమితి కూడా కలిసిన విషయం తెలిసిందే. అయితే టిడిపి, సిపిఐ పార్టీల బలబలాలు వారు పోటీ చేసే స్థా నాల విషయంలోనే కాంగ్రెస్ పార్టీ సర్వే పేరుతో మడత పేచీ పెట్టడం వల్ల ఖరారు కాలేదని తెలుస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని స్థానాలపైనే అటు టిడిపి, ఇటు సిపిఐ మరో పక్క కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండటంతో సీట్ల సర్దుబాటు జఠిలంగా మారినట్లు తెలుస్తుంది.
మహాకూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టిడిపి తెలంగాణ వ్యాప్తంగా 16 సీట్లను, సిపిఐ పార్టీ 12 సీట్లను కోరుతుంది. అయితే ఆయా పార్టీలు ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని ఆరు స్థానాల కోసం పట్టుబడుతున్నాయి.ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థా నాలు ఉండగా అందులో ఆరు స్థానాల కోసం అటు కాం గ్రెస్, ఇటు సిపిఐ, టిడిపి కోరుకుంటున్నాయి. ఈ ఆరు స్థానాల్లోనే మహాకూటమిలోని పార్టీల మధ్య పీఠముడి పడింది. ప్రధానంగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సిపిఐతో పాటు కాంగ్రెస్, టిడిపి కావాలని కోరుకుంటున్నాయి.  ఈ  ఒక్క స్థానం కోసం మూడు ప్రధాన పార్టీలు పట్టుబడుతున్నాయి. ఇక మిగిలిన ఐదు స్థానాల్లో మహాకూటమిలోని  రెండు పార్టీల మధ్య పేచీ కొనసాగుతుంది. ఖమ్మం సీటును ప్రధానంగా కాంగ్రెస్, టిడిపిలు కోరుకుంటున్నాయి.
వైరా స్థానం కూడా తమకే కావాలని సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాన్ని టిడిపి, కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగుతున్నారు. పినపాక సీటును సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు మాకంటే మాకే కావాలని పట్టుబడుతున్నాయి. ఇక భద్రాచలం స్థానాన్ని కాంగ్రెస్, టిడిపి నేతలు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరు స్థానాల్లో ఇరు పార్టీలు పట్టువిడుపులకు పోయే స్థానం కేవలం అశ్వారావుపేటగా కన్పిస్తుంది. ఇక మిగిలన మధిర, సత్తుపల్లి, ఇల్లెందు, పాలేరు స్థానాల విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు.ఎందుకంటే సత్తుపల్లి స్థానం టిడిపికి సిట్టింగ్ స్థానం కాగా మధిర కాంగ్రెస్‌కు సిట్టింగ్ సీటు, పాలేరు, ఇల్లందు స్థానాల్లో పెద్దగా పోటీ లేదు.
అయితే తెలంగాణ వ్యాప్తంగా చూస్తే సీట్ల సర్దుబాటు విషయంలో ఖమ్మం జిల్లా స్థానాలపైనే పేచీ అధికంగా కన్పిస్తుంది. త్వరలో మరోసారి కూర్చోని ఒక కొలిక్కి తీసుకొస్తామని అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున సీట్ల సర్దుబాటు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. మరోవైపు మహాకూటమిలో ఒక పక్క సీట్ల సర్దుబాటు కాకపోవడంతో పలు పార్టీల్లో అయోమయం నెలకొంది. పొత్తుల్లో ఎవరి సీటు గల్లంతవుతుందోనని బెంగ ఆయా పార్టీల్లో పట్టిపీడిస్తుంది.
కేసీఆర్‌ను గద్దే దించడం కోసం నాలుగు పార్టీలు ఏకమై జతకట్టి మహాకూటమిని ఏర్పాటు చేశారు. అయితే  సింగిల్ ఎజెండా కోసం కొందరు తమ సీట్లను త్యాగం చేయడానికి ముందుకు రావడం లేదు. పొత్తుల ఎత్తుల్లో ఎవరి సీటు గల్లంతవుతుందోననే ఆందోళన పలు పార్టీల నేతలను పీడిస్తుంది. సీటు, టిక్కెట్ గల్లంతవుతుందోననే బెంగతో ఇప్పటికే జిల్లాకే చెందిన చాలా మంది నాయకులు హైదరబాద్ చుట్టూ, ముఖ్య నేతలు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
Tags:Interesting seats in Khammam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *