అక్టోబరు 23 నుంచి ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ టర్మినల్ 

Date:11/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ టర్మినల్ ప్రారంభమైంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ నారాయణ్ చౌబే, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శైలేంద్రకుమార్ జోషి, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు తదితరులు బుధవారం ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ వల్ల విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ తగ్గుతుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. శంషాబాద్ విమానాశ్రయంలో గత మూడేళ్లలో ప్రయాణికుల సంఖ్య రెండింతలయ్యింది. ఈ నేపథ్యంలో దేశీ, విదేశీ ప్రయాణికులకు వేర్వేరు టెర్మినళ్లను ఏర్పాటు చేయడం ద్వారా రద్దీని నియంత్రించాలని నిర్ణయించారు. ఈ మేరకు రూ.50 కోట్ల వ్యయంతో లక్ష చదరపు అడుగుల్లో కొత్త టెర్మినల్ నిర్మించారు.
ఈ నెల 23 నుంచి ఈ టెర్మినల్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.  ప్రయాణికుల హ్యాండ్ బ్యాగేజీ తనిఖీ కోసం రిమోట్ స్క్రీనింగ్, ఆటోమెటిక్ ట్రే సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ఇలాంటి సదుపాయం దేశంలో మరే విమానాశ్రయంలోనూ లేకపోవడం గమనార్హం. ఈ సదుపాయం వల్ల తనీఖీలు వేగంగా పూర్తవుతాయి. ఇమిగ్రేషన్ విభాగం కూడా ఇక్కడే ఉండటంతో ఆలస్యం లేకుండా విమానం ఎక్కేయొచ్చు. ఇంటెరిమ్ టెర్మినల్‌లో 38-40 చెక్ ఇన్ కౌంటర్లు, 20 వరకు ఇమిగ్రేషన్ కౌంటర్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. భవిష్యత్తులో ఇక్కడ ప్రయాణికుల సంఖ్య 34 నుంచి 40 మిలియన్‌కు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు.
Tags:Interim International Departures Terminal from October 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *