విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా…

International status for Vijayawada airport

International status for Vijayawada airport

Date:01/01/2019
విజయవాడ ముచ్చట్లు:
నవ్యాంధ్రప్రదేశ్‌కు తలమానికమైన విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చి పదకొండు నెలలు అయినా, విదేశాలకు ఒక్క సర్వీసు కూడా లేకపోవడం, కేంద్రం కొర్రీల మీద కొర్రీలు పెడుతూ ఉండటంతో, రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. అవసరమైతే ఎదురు పెట్టుబడి పెట్టి మరీ విదేశాలకు విమానాలు పంపించాలని కృతనిశ్చయానికి వచ్చింది. ఈ క్రమంలోనే అభివృద్ధి చెందిన ఆసియా దేశాలలో సింగపూర్‌కు తొలి విమాన సర్వీసు నడపాలని నిర్ణయించింది. ఏపీ ఏడీసీఎల్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. సింగపూర్‌కు సర్వీసు ప్రారంభించే ముందు ప్రజల అభిప్రాయాన్ని ఏడీసీఎల్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా సేకరించగా.. లక్షలాది మంది మద్దతు పలుకుతూ స్వాగతించారు. ఈ క్రమంలో మరో ఆలోచనకు తావు లేకుండా ఔత్సాహిక విమానయాన సంస్థల కోసం టెండర్లు పిలవగా… ఇండిగో సంస్థ ప్రతిపాదన ఆమోదయోగ్యంగా ఉండటంతో దానిని ఎంపిక చేశారు.వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) ప్రాతిపదికన సింగపూర్‌కు విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం… సింగపూర్‌కు నడిపే విమానంలో మొత్తం 180 సీట్లు ఉంటాయి.
ఇందులో సగం… అంటే 90 సీట్లు కూడా నిండకపోతే ఇండిగో సంస్థకు వచ్చే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఒక్కో సీటుకు కనిష్ఠంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా 15 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన విమాన సర్వీసుకు ఆదరణ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.కోట్లలో భారం పడే అవకాశాలు ఉన్నాయి. కని ఇప్పటి వరకూ ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా భారం పడలేదు. ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజాదరణ ఉండడంతో అటు ఇండిగో సంస్థ కూడా ఖుషీఖుషీగా ఉంది. ఈ పరిణామాలు రాష్ట్ర ఎయిర్‌పోర్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కు మంచి బూస్ట్‌ ఇచ్చాయి.రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు సర్వీసు ప్రారంభించిన వేళా విశేషమేంటోగానీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పరిస్థితి రాలేదు. ఇటు నుంచి వెళ్లే వారిలో సగటున 100 మంది, అటు నుంచి వచ్చే వారిలో సగటున 170 మంది ఉంటున్నారు.
ఇటు నుంచి వెళ్లటానికి వీసా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్య పరిష్కారమైతే మరింత మంది వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని గమనిస్తున్న ఇండిగో… భవిష్యత్తులో మరిన్ని సర్వీసుల పట్ల కూడా ఆసక్తి కనబరుస్తోంది. సింగపూర్‌ సర్వీసు దిగ్విజయం కావటంతో దుబాయ్‌కు విమానాలు నడిపే అంశంపై ఏడీసీఎల్‌ దృష్టి సారిస్తోంది. దుబాయ్‌కు విమాన సర్వీసు నడ పటానికి నిన్న మొన్నటి వరకూ స్లాట్‌ లేదు. ఇటీవల స్పైస్‌ జెట్‌ సంస్థ దేశం నుంచి సింగపూర్‌కు పలు విమానాలను ఉపసంహరించుకోవటంతో స్లాట్‌ల ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో విజయవాడ నుంచి దుబాయ్‌కు సర్వీసు నడపటానికి స్లాట్‌ అవకాశం లభిస్తోంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో ఏడీసీఎల్‌ ఉన్నట్లు తెలుస్తోంది.
Tags:International status for Vijayawada airport

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *