జాబ్ కార్డులలో అవకతవకలు
గుంటూరు ముచ్చట్లు:
పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది. జాబ్ కార్డుల పంపిణీలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డు మాత్రమే మంజూరు చేయాల్సి ఉంది. కానీ, కాసులకు కక్కుర్తి పడి ఒకే కుటుంబంలో మూడు నుంచి నాలుగు కార్డుల వరకు జారీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయిగ్రామీణ పేదలకు ఉపాధి కల్పించి, వలసలు నివారించే నిమిత్తం, కనీస ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకం నూజెండ్ల మండలంలో ఆ శాఖ అధికారులు అదనపు ఆదాయంగా మార్చుకున్నారు. ఒక రేషన్ కార్డు పై ఒక జాబ్ కార్డు మాత్రమే ఇవ్వాల్సి ఉంది.
కానీ, భార్య, భర్తలు వేరువేరు జాబ్ కార్డులు కలిగి ఉండగా, అదే కుటుంబ సభ్యులైన అవివాహిత కుమారులకు మరో జాబ్ కార్డ్, కుమార్తెకు ఇంకో జాబ్ కార్డు మంజూరు చేశారు. కుటుంబానికి వంద రోజులు పని లక్ష్యం కాస్త 400 రోజులు పని కల్పించేలా ఎవరు సహకరిస్తున్నారన్నది ప్రశ్నగా మారింది.ఇదిలా ఉండగా, విద్యార్థులకు, వృద్ధులకు, వేరే నగరాల్లో నివాసం ఉంటున్న వ్యక్తులకు, అంగన్వాడీ కార్యకర్తల పేరిట, ఆయాలు, ఆశ కార్యకర్తలు ఇలా తమకు నచ్చిన విధంగా జాబ్ కార్డులు మంజూరు చేశారు. అంతేగాక వీరందరికీ మాస్టర్లు వేస్తూ కూలీ డబ్బులను కాజేస్తూ లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి జేబులు నింపుకుంటున్నారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా పరిశీలించాల్సిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిండంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags: Irregularities in job cards
