Natyam ad

కరీంనగర్ ఉపాధిలో అక్రమాలు…

కరీంనగర్ ముచ్చట్లు :

గొప్ప ఆశయంతో ప్రారంభమైన ఉపాధి హామీ పథకంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లోపాలు తలెత్తుతున్నాయి. ఉన్న ఊర్లోనే ఉపాధిని అందించే ఆశయం సరిగ్గా నెరవేరడం లేదు. ఏదో ఒక పని తప్పకుండా లభిస్తుందనే హామీ కూలీలకు ఆచరణలో దక్కడం లేదు. ఈజీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గడిచిన కొన్నాళ్లుగా అనుకున్న విధంగా పురోగతి చూపించలేకపోతోంది. వర్షా కాలం మొదలయినప్పటి  నుంచి పది రోజుల కల్పన పరంగా అరకొరగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా గడిచిన మూడు నెలలుగా ఊహించని విధంగా పని ప్రదేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. వరి కోతల ప్రభావం కొంత కనిపిస్తున్నా… అసలు ప్రస్తుత సమయంలో చేపట్టే పనులు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ముందస్తుగా పనుల ఎంపికలో లోపంతో పాటు ఏడాది అంతా… కూలి హామీ దక్కేల సరైన అంచనాలు ముందస్తుగా రూపొందించకపోవడం పేద కుటుంబాలకు శాపంగా మారింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాల వారీగా పని దినాలను కూలీలకు అందించాలి అనే లక్ష్యం విషయంలో నింపాది తీరు కనిపిస్తుంది. ఈ వార్షిక సంవత్సరం అయిపోయేందుకు మరో నాలుగు నెలలు మాత్రమే ఉండడంతో డిమాండ్ కు తగిన పని కల్పన అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెల నుంచి రాబోయే మూడు నెలల వరకు ఊర్లలో ధాన్యం కల్లాల పనితో పాటు ఇతర వ్యవసాయ పనులు ఉండే వీలుంది. కొందరు ఆ పనులకు వెళ్ళే అవకాశం కూడా ఉంది.

 

 

 

మరోవైపు ఉపాధి పనుల కోసమే నిరీక్షించే వారికి మాత్రం అనుకున్న విధంగా గ్రామాల్లో పనులు ప్రస్తుతం జరగడం లేదు. కేవలం హరితహారంలోని మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు పాదులు తీసి వాటిని సంరక్షించేందుకు కొంత మంది కూలీలకే అవకాశం దక్కుతుంది. మిగతా పనులు లేక ఖాళీగా ఉండే పరిస్థితి పలుగ్రామాల్లో నెలకొంది.గ్రామ సభల నిర్వహణ సమయంలోను ఊరి అభివృద్ధికి అవసరమైన పనుల ఎంపిక సంఖ్య తక్కువగా ఉండడంతో ఇబ్బంది ఎదురైంది. వచ్చే సంవత్సరం కోసం పనుల అంచనాలు ఇప్పటి నుండే రూపొందిస్తున్నందున… ఇక మీదటైనా కూలీలందరికీ ఉపాధి హామీ 100% దక్కేలా అవకాశం లభిస్తే ఆర్థికంగా మేలు జరిగే వీలుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఉమ్మడి జిల్లాలో 4.50 లక్షల పైగా పనిదినాలు కూలీలకు అందాయి. పోయిన నెలలో 3.26 లక్షలకు ఈ ప్రాధాన్యం దక్కింది. ఇక ఈ నవంబర్ నెలలో ఇప్పటి వరకు ఒక లక్షకు పైగా పని దినాలను క్షేత్ర స్థాయిలో అందించగలిగారు. అనుకున్న విధంగా పల్లెల్లో పనులు జరగకపోవడంతో హాజరయ్యే వారి సంఖ్య పడిపోతుంది. ఆదాయం రూపంలో కూలీలకు ఇబ్బంది పెరుగుతుంది.ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు జిల్లాల పరిధిలో 1405 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దక్కింది. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 468 నివాస గృహాల్లోని కూలీలు దినసరి వేతనాలను అందుకునే విషయంలో ఉత్సాహాన్ని చూపించారు. ఇక కరీంనగర్ జిల్లాలో 386, పెద్దపల్లి జిల్లాలో 291, జగిత్యాల జిల్లాలో 260 ఇళ్లలోని వారు శతకం అని మార్పుని పని రోజుల విషయంలో పొందగలిగారు. ఈ పథకంలో పారదర్శకత వహిస్తే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Post Midle

Tags: Irregularities in Karimnagar employment…

Post Midle