Natyam ad

ఎన్నికలకు డిజిటల్ ప్రచారమేనా..

లక్నో ముచ్చట్లు:
 
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కొవిడ్ పరిస్థితుల నడుమ, ఎన్నికలు నిర్వహించడం ఒక విధంగా ఎన్నికల సంఘానికి కత్తి మీద సామే కాదు అంతకంటే కూడా కష్టమైన వ్యవహారమే. అందులోనూ గత సంవత్సరం కొవిడ్ సెకండ్ వేవ్ నడుమ పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది.ఎన్నికల ప్రచారంలో ప్రధాన  పార్టీలు ఏవీ కూడా కోవిడ్ నిబంధనలను పాటించలేదు. లక్షల మందితో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాయి. ఫలితంగా, దేశంలో కోవిడ్ మరింతగా విజృంభించి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ప్రభుత్వాలు కళ్ళు తెరిచే సరికి లక్ష్యల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి.అందుకు ప్రధాన బాధ్యత, రాజకీయ పార్టీలదే అయినా,ఎన్నికల సఘం విమర్శలకు గురైంది. అప్పట్లో ఎన్నికల సంఘంపై న్యాయస్థానాలు కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు చేశాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కావచ్చును కేంద్ర ఎన్నికల సంఘం, కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఓ వంక రాజ్యాంగ విధ్యుక్త ధర్మాన్ని పాటిస్తూ (రాజ్యాంగం ప్రకారం చట్ట సభల గడువు ముగిసిలోగా ఎన్నికలు నిర్వహించడం మినహా మరో మార్గం,వెసులు బాటు ఎన్నికల సంఘం ముందు లేదు.)మరో వంక అసాధారణ (కోవిడ్) పరిస్థితులను సమన్వయ పరచుకుంటూ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం  సిద్దమైంది. ఈ నేపధ్యంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని పరిగణలోకి తీసుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘం, నెల 15 వరకు ర్యాలీలు, రోడ్ షోలు, ఇతర ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఈ నెల 15 తర్వాత పరిస్థితిని సమీక్షించి ఎన్నికల ప్రచారంపై నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు రాజకీయ పక్షాలు సోషల్ మీడియా ద్వారా డిజిటల్  ప్రచారం చేసుకోవాలని సూచించింది.
 
 
 
దూరదర్శన్‌లో రాజకీయ పార్టీలకు కేటాయించిన ప్రసార సమయాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది.దేశంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం  డిజిటల్ ప్రచారం వైపు మొగ్గు చూపడం సమంజసమే అయినా, అది ఎంతవరకు సాధ్యం అనే విషయంలో అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఉత్తర ప్రదేశ్’ లో  ఓ వంక బీజేపే, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ డిజిటల్ హంగులతో సిద్డంవుతుంటే, యూపీలో పోటీకి దిగుతున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ దేశంలో డిజిటల్ సమాచార వినియోగం ఎలా ఉందనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారిస్తే బాగుంటుందని సూచించారు. ఈ సందర్భంగా ఒవైసీ, యూపీలో ప్రతి 100 మందిలో కేవలం 39 మందే ఇంటర్నెట్ వినియోగిస్తుంటారని వెల్లడించారు. నీతి ఆయోగ్ నివేదిక తెలిపిన ప్రకారం దేశం మొత్తంలో  అత్యంత తక్కువగా ఇంటర్నెట్ వినియోగించే రాష్ట్రాల్లో యూపీ ఒకటని వివరించారు. ఎన్ఎస్ఎస్ నివేదిక ప్రకారం యూపీలో గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు ఉన్న గృహాలు 4 శాతం, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారి శాతం 11 మాత్రమేనని పేర్కొన్నారు.యూపీలో ధనిక వర్గాల్లో 19 శాతం మందికి ఇంటర్నెట్ సదుపాయం ఉండగా, పేదల్లో 6 శాతం మందికే అందుబాటులో ఉందని తెలిపారు. యూపీ పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మహిళలు ఇప్పటివరకు ఇంటర్నెట్ ను వినియోగించలేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం తెలియని వాళ్లు 76 శాతం మంది ఉన్నారని ఒవైసీ వివరించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కనీసం ఒకసారి ఇంటర్నెట్ వినియోగించిన పురుషుల శాతం 54 కాగా, రాష్ట్రంలో 46.5 శాతం మంది మహిళలకే సొంత అవసరాల నిమిత్తం ఫోన్లు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్రచారం నిర్వహించడం ఎలా? అని ప్రశ్నించారు.నిజమే, కానీ, మరో మార్గం కూడా లేదు..ఎన్నికలు వాయిదా వేద్యం కుదరదని రాజ్యాంగ నిపుణులు వాదిస్తున్నారు. ఏమైనా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ ఎన్నికల చరిత్రను కొత్త మలుపు తిప్పుతున్నాయి ..,కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Is it a digital campaign for elections?